#NatureLessons

రోజూ వాటిని చూస్తున్నప్పుడు వాటి ప్రశాంతత నాకు అందకపోతే పోనీ, నా అలజడి వాటికి చేరకుండా ఉంటే బాగుండు అనుకుంటాను.
ఆఫీస్ లో నేను వర్క్ చేసుకునే చోట, వెనుక పెద్ద ఖాళీ స్థలం… అందులో ఒక కొబ్బరి చెట్టు, పక్కనే ఓ మామిడి చెట్టు. వాటి మీద ఉంటాయి చిలుకలు,ఉడుతలు, కోయిలలు, మైనాలు. కొబ్బరి పిందెలతో ఆడుకోవడం, వాటి జీవన భాషలో చెప్పాలంటే ఆహారం తిన్నంత తినడం, పెద్ద పెద్దగా సంభాషించుకోవడం (చిలుక పలుకులు, కోయిల పాటలు అనాలేమో), కాసేపు ఎక్కడికో ఎగిరి పోవడం చాలా వరకూ ఇదే వాటి దిన చర్య. ఇప్పుడు మామిడి పూత ఉంది కదా. వాటిమీద బోలెడు కోయిలలు.
గమనిస్తూ ఉంటే… పచ్చటి వాటి జీవితం చాలా సార్లు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది. పనిలో ఎప్పుడున్నా కాస్త వీలు దొరికితే వెనక్కి తిరిగి వాటిని గమనిస్తూ ఉంటాను. కాస్తంత రిలాక్సేషన్ దొరుకుతున్న ఫీలింగ్ మొదలవుతుంది. ఇంతలో ఎవరో ప్రపోజల్స్ తెస్తారు. మళ్ళీ మామూలుగా నా మెటీరియలిస్టిక్ ప్రపంచమే… వాటి నుండి నాలోకి పాకిన ఎనర్జీ కాసేపు ఉంటుంది. నేనూ కొన్ని చిలుకపలుకులు పలుకుతూ సాత్వికంగా ఉండటానికి ప్రయత్నిస్తా. అయినాగానీ అప్పుడప్పుడూ ఏదో ఒక చిక్కుముడి గొంతు పెంచేలా చేస్తుంది. కుదరదని చెప్పాల్సిన పరిస్థితి గొంతులోకి కాఠిన్యాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాంటప్పుడు కుహూ అనో....కిర్ మనో ఒక గొంతు… మహీ అని తట్టినట్లనిపిస్తుంది. వెనక్కి తిరిగి ఒక్క సారి నవ్వుకుని మళ్ళీ పనిలో మునిగిపోతా… కొన్ని సార్లు అవిచేస్తున్న కట్టడిని మళ్ళీ మళ్ళీ తలచుకుని మరీ నవ్వుకుంటూ ఉంటా …
అవసరమైనంత వరకే ఆహారం సంపాదించుకోవడం, మనలాంటి సేవింగ్స్, ఖర్చులు, ఆదాయాలు, డాంబికాలు లేని ప్రపంచం వాటిది. చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటాయి. గుడ్లు పెట్టేకాలం లో ఒకటి కాపలా ఉంటే ఇంకోటి ఆహారం కోసం బయట తిరుగుతూ ఉంటుంది.
అప్పుడప్పుడూ ఒక గద్ద వస్తుంది. చాలా చాలా కలకలం. ఆ రోజంతా నాకూ అలజడిగా ఉంటుంది. అకారణంగా వచ్చిన వాళ్ళ మీద విసుక్కుంటూ మాటి మాటికీ వెనక్కి చూడాలనిపిస్తుంది. ఈ పనంతా లేకపోతే అక్కడ కూర్చుని వాటి అలజడి తీర్చాలనిపిస్తుంది.
అలాంటప్పుడు కాసేపు ఈ ప్రకృతి మీద చాలా కోపంగా అనిపిస్తుంది. ఒక జీవి మరో జీవి మీద దాడి చేయడం ఏమిటి. తన జీవితాన్ని అస్తవ్యస్తం చెయ్యడం ఏమిటి అని… కాకపొతే అప్పుడు మనుషుల్ని గుర్తుకు తెచ్చుకుంటే చాలు... అదే నయమనిపిస్తుంది. వాటి మధ్య ఉండేది జాతి వైరమే తప్ప… మనుషుల్లోలా ఒకే జాతి అయినా తోటివారిని కబళించడం అన్నది ఉండదు కదా అని.
కాంక్రీట్ జంగిల్ లాంటి పట్టణంలో, అంతకన్నా మనసుకి ఎలాంటి తేమా అంటని ఒక PSU ఆఫీస్ పక్కన వీటి పచ్చటి జీవితం ఒక పాఠం.
వాటినుంచి ఏమన్నా నేర్చుకుంటున్నానా.. ఏమో తెలియదు. కానీ, నా యాంత్రికమైన జీవితానికీ, ఆ పచ్చటి జీవితానికి మధ్య ఒక గోడ ఉంది. చాలా దగ్గరగా ఉన్నా.. నేను అంత తేలికగా ఛేదించలేని గోడ. చాలా చాలా ప్రయాస పడినా అక్కడకు వెళితే గొప్ప ఆనందం దొరుకుతుందన్న ఆశ ఉంది.
ఆనందం ఎక్కడుందో తెలుసు.
దారీ తెలుసు.
మొదటి అడుగు వేయడమే కష్టం.

No comments