#Mahanati

మహానటి సినిమా చాలా మంది ప్రేమగా చూసారు. 
అంతకు మించి బాధ్యతగా చూసారు.
చూసినవాళ్ళంతా దాదాపుగా తమ తమ ఫీలింగ్స్ పంచుకున్నారు. నేను కూడా చూసాను నిన్న.
కధ, కధనం, తారాగణం... ఇవన్నీ కాదు. కొన్ని సీన్స్ మనసులోంచిపోవట్లేదు.
చిన్నప్పుడే తండ్రి చనిపోతే కష్టపడి భాధ్యతగా పెంచిన తల్లి, పెదనాన్న.. వీళ్ళందరినీ కాదనుకుని, జెమినీ కోసం రాత్రి వేళ వర్షంలో తడుస్తూ పరిగెత్తుకు వెళ్ళిన సావిత్రి...
తలుపు తీసిన మొదటి భార్య, ఆ వెనుక చీకట్లో ఇద్దరు పిల్లలతో నిలబడిన జెమినీ ని చూసి.. భోరున ఏడుస్తూ.. కూలబడిన సావిత్రి. 
జెమినీ ని వేరే మహిళతో గెస్ట్ హౌస్ లో చూసినప్పుడు... హిస్టీరిక్ గా ఏడ్చిన సావిత్రి.
"అన్నీ తెలిసే చేసుకున్నావ్ కదా" అని అడిగిన జెమినీ కి "అప్పుడు నేను సావిత్రిని. ఇప్పుడు సావిత్రీ గణేషన్ ని" అని ఉక్రోష పడుతూ చెప్పిన సావిత్రి.
ఇవే కాదు.
జెమినీ కళ్ళు!!! అవి నన్ను అస్సలు వదలట్లేదు.
సావిత్రిని చూసిన జెమిని కళ్ళలోని కాంక్ష.
సావిత్రిని నమ్మించినప్పుడు జెమినీ కళ్ళల్లో గర్వం.
ఎదైనా కన్విన్స్ చేసేటట్లు చెప్పగలనన్న అతని కళ్ళల్లో నమ్మకం!!
అన్నిటికీ మించి ఓడిపోయినప్పుడూ... మోసపోయినప్పుడూ ఆమె కళ్ళల్లో నిర్వేదం. 
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కో గలిగిన సావిత్రికి.. జెమినీ లేకుండా బతక గలనన్న నమ్మకం ఎందుకు లేకపోయిందో కదా.
మహానటి చూసాక ఒకటే అనిపించింది.
పెద్దగా చదువులేని సావిత్రి. ఏదైనా క్షణంలో నేర్చుకోగల ప్రతిభ ఉన్న సావిత్రి. ఆ రోజుల్లోనే గుర్రం స్వారీ చేయగల, ధైర్య సాహసాలున్న మనిషి.. భర్త దూరం కాగానే డిప్రెస్ అవ్వడం... ఎప్పటికీ ఆడపిల్లలు ఇంతే కదా. బతకలేక పోవడం కాదు. ఓడిపోయామన్న ఉక్రోషం.
సావిత్రి జీవితంలో అనివార్యమైన ఈ విషాదం మనం అనుభవించడం కోసం ఈ సినిమా చూడాలి.
అంతకు మించి ..
నవ్వుతో విచ్చుకుంటూ,
కోపంతో ముడుచుకుపోతూ..,
ప్రేమతో వెలిగిపోతూ...
ఆనకట్టలు లేని కరుణని వర్షంలా కురిపించిన ఆ కళ్ళకోసం చూడాలి.
కాఠిన్యంతో మూసుకు పోయిన భర్త హృదయాన్ని చేరలేక, తలుపుకి తల బాదుకుని ఏడ్చిన సావిత్రి నుదుటిని ప్రేమార ముద్దు పెట్టుకోవాలి.
ఇవన్నీ కాదు. వేన వేల విద్యుల్లతల కాంతితో వెలిగిపోయిన కీర్తి సురేష్ (సావిత్రి) కోసం చూడాలి.


No comments