వసుధేంద్ర - మోహనస్వామి

మనం చాలా ఎదిగిపోయామనీ, మన హృదయాలు చాలా విశాలపరచుకున్నామనీ ఎంతన్నా అనుకోనీ.. ఇప్పటికీ ప్రేమకి, కామానికి చాలా overlaps ఉంటాయి మన సమాజంలో. అలాంటిది పురుషులు, పురుషుల నడుమ ప్రేమకు, కామానికి సంబంధించిన విషయాలను జీర్ణించుకోవడం ఎంత కష్టం కదా. 
"మోహనస్వామి" పుస్తకం చదివిన దగ్గరనుంచి, నా మనసంతా వసుధేంద్ర పట్ల ప్రేమతో నిండిపోయింది. ప్రవాహంలో తోసుకు పోవడం తేలికే. బతకొచ్చు.. కొట్టుకు పోవచ్చు. కానీ, ఏటికి ఎదురీదాలంటే ఎంత సంఘర్షణ కావాలి!!
రెండురోజుల నుంచి మనసంతా చాలా దుఃఖంగా ఉంది. చాలా సంవత్సరాల క్రితం రూట్స్ పుస్తకం చదివినప్పుడూ.. ఆ తర్వాత పాపిల్లాన్ పుస్తకం చదివినప్పుడు చాలా ఏడ్చాను. The Diary of a young girl చదివినప్పుడు, లాస్ట్ పేజ్ అలా కళ్ళ ముందు కనిపించి చాలా చాలా డిస్ట్రబ్ చేసేది. ఇక ఆ మధ్య "ఒక హిజ్రా ఆత్మ కధ" అయితే నిజంగా నా దృక్పధంలో చాలా మార్పు తెచ్చింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర , రైళ్ళలో అంతకు ముందు వాళ్ళను చూసినప్పుడు కలిగే కొంత జలదరింపు, సంకోచం పూర్తిగా పోయాయి.
ఇదిగో ఇప్పుడు "మోహనస్వామి". 
మొత్తం పది కధలు. తనని తాను గే గా పరిచయం చేసుకున్న ఒక సున్నిత హృదయపు గాధ ఇది. మానసిక, శారీరకమైన Imbalances ఒక మనిషిని ఎంత సంఘర్షణకు గురి చేస్తాయో అర్ధం అవుతుంది మనకి. కనీసం ఒక రెండు దశాబ్దాల పాటు తను పడిన సంఘర్షణ నుంచి బయట పడడానికి వసుధేంద్ర ఎంచుకున్న దారి నిజంగా చాలా చాలా గొప్పగా అనిపించింది.
తన మనసు ఎంచుకున్న ఎంపికలు, 
అవి అనుభవంలోకి తెచ్చిన నిరాశలు,
సంపాదించుకున్న ప్రేమలు, 
పోగొట్టుకున్న స్నేహాలు,
చితిలా కాల్చుతున్న జ్ఞాపకాలు
మొత్తం మీద జీవితం చేసిన గాయాలు,
ఇదే మోహన స్వామి. 
అన్ని కధలూ మీరంతా చదవాలి. ప్రతీ అక్షరం మీ మనసులోకి తీసుకోవాలి. మనం అందరం రచయిత మనసులోకి తొంగి చూసే ప్రయత్నం చేయాలి. 
తమ మనసుతోనూ, శరీరంతోనూ పోరాడుతూ చుట్టు పక్కల వాళ్ళు చేసే మానసిక గాయాలతో అలసిపోతున్న మోహనస్వామిలు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళపట్ల సహానుభూతితో చూద్దాం. 
రండి.. మోహనస్వామిని చదవండి. రంగనాధ రామచంద్రరావు గారి అనువాదం చాలా సహజంగా ఉంది.

No comments