ఒక పచ్చటి ప్రయాణం

ప్రతి రోజూ ఒక ఉషోదయంతోనే మొదలవుతుంది. కాని కొన్ని ఉదయాలు వస్తూ వస్తూ కొన్ని కొత్త దారులు చూపిస్తాయి. ప్రతీ ప్రయాణం కొన్ని ఆనందాలనీ కొన్ని అనుభవాలనీ ఇస్తుంది . కొన్ని ప్రయాణాలు వీటితో పాటు విలువైన పాఠాలు నేర్పిస్తాయి.
Malini M Chaitanyashravanthi Sai Padma Satyavati Kondaveeti వీళ్ళు పరిచయం అయ్యే వరకూ లైఫ్ అంటే కుటుంబం, ఆఫీస్, స్నేహితులు , సాహిత్యం అంతే అనుకునే దాన్ని. అసలు అవతలి ప్రపంచం ఎలా ఉంటుందో అర్ధం అయ్యింది వీళ్ళు తెలిసాకే…
మాలిని వర్క్ తెలుసుకోవాలన్న కోరిక ఇన్ని రోజుల తరువాత తీరింది. ఎపుడో వనవాసిలో చదివిన సంఘటనలు నిజంగా చూసినట్లు అనిపించింది. మొన్న నేను, భరద్వాజ్, మాలిని అడవుల్లోకి వెళ్ళాం. మాలిని పని చేసే ఏరియా అది. ఈదులపాలెం. పాడేరు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చాలా ఏక్సెసబిలిటీ ఉన్న ఊరు అది. అంటే చిక్కటి అడవిలోకి ఒక గంట ప్రయాణం. ఇదే చాలా ఏక్సెసబిలిటీ ఉన్న ఊరు అంటే మిగిలిన ఊళ్ళ సంగతి ఆలోచించండి.
ముందుగా వస్తున్నామని చెప్పినా ఎక్కువమందిని కలవలేకపోయాం. అందరూ అనాస తోటల్లో కలుపు తీయడానికి వెళిపోయారు. కాసేపు ఎదురు చూసాక నెమ్మదిగా ఒక్కరొక్కరూ వచ్చారు. మాలిని కొత్తగా చేపట్టిన ప్రాజెక్ట్ "Skilling of Tribal youth on application of Technology for sustainable livelihood Management" దీనికి సంభందించి అక్కడ ట్రైబల్స్‌కి అవగాహన కల్పించడం ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం.
వాళ్ళకి అమాయకంగా కష్టపడడం ఒక్కటే తెలుసు. చుట్టుపక్కల అడవుల్లో అడ్డాకులు బాగా దొరుకుతాయి. అలాగే అనాస, కమల, బత్తాయి తోటలు సాగు చేస్తారు. చింతపండు విరివిగా పండుతుంది. అయితే పండిన పంటలకి కొంత నైపుణ్యం జోడించుకుని మరికొంత లాభాలను తెచ్చుకునే నేర్పరితనం వాళ్ళకి తెలీదు. అలా ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చి కొంత చేయూత ఇవ్వాలని చైతన్య స్రవంతి ఆరాటం.
చేయి పట్టి నడిపించినా నడవటం తెలియని జీవితాలు వాళ్ళవి. బుడు బుడి అడుగులేస్తూ చటుక్కున పడిపోయే ప్రాయంలో ఉన్న నాగరికం వాళ్ళది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆసరా ఇవ్వటం అన్నది కేవలం మన ఉద్యోగ భాద్యత అనుకుంటే జరిగేది కాదు. వాళ్ళ మనసుల్లోకి… ఇంకా చెప్పాలంటే మూలాలలోకి వెళ్లి వాళ్ళ మనసులోని సంకోచాలని నెమ్మది నెమ్మదిగా తుడిపేసే సహనమూ, ఓరిమి ఉండాలి. అలా ఉండాలీ అంటే కుల,మత,వర్గ,ప్రాంత, భేధాలకతీతతంగా… కేవలం మనిషి లో మనిషిని మాత్రమే చూడగలిగే స్వచ్ఛమైన కళ్ళు ఉండాలి…
NGOs, గవర్నమెంట్ ఫండ్స్ అవన్నీ పక్కన పెట్టి… అక్కడ వర్క్ చెయ్యాలి అంటే ఎంత passion ఉండాలి. మనుష్యుల పట్ల ఎంత ప్రేమ ఉండాలి. అలా మనసుకు కళ్ళు అంటించుకుని గిరిజనుల మూలాల లోకి నడిచి వెళ్ళే నేస్తం “మాలిని”.
మాలినీ, ఇన్నాళ్ళూ అడవి అంటే పచ్చదనమే అనుకున్నా. ఆ పచ్చదనం వెనుక ఎన్ని వ్యదార్ధ జీవుల యదార్ధ గాధలున్నాయో అర్ధం అయింది.

No comments