బారిష్టర్ పార్వతీశం!!

గోదావరీ, గోరింటాకూ, గోంగూరా, గిరీశం, 
కచటతపలూ, గసడదవలూ
బారిష్టరు పార్వతీశం, పదహారణాలూ..
ఇవి అసలు సిసలు తెలుగు దినుసులు- తెలుగు తనపు జెండాలు. 
-- ముళ్ళపూడి వెంకటరమణ.
సీరియస్ ఫిక్షన్, నాన్‌ఫిక్షన్ జీవితాల మధ్య (సీరియస్‌లీ!! ఫిక్షన్, నాన్‌ఫిక్షన్ పుస్తకాలు కాదు.. జీవితాలే) ఇదిగో ఇలాంటి పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. మళ్ళీ మళ్ళీ చదివినా ఎప్పుడూ కొత్తగా గిలిగింతలు పెట్టి హాయినిచ్చే పుస్తకం "బారిష్టర్ పార్వతీశం"
చిన్నప్పుడు నాన్‌డీటైల్ లో చదివాం. తెలుగు మాష్టారు చెప్తుంటే క్లాసులో నవ్వులే నవ్వులు. ఆ తర్వాత "ప్రాచీనాంధ్ర" లో మొదటి, మూడవ భాగాలు దొరికాయి. మళ్ళీ ఈ మధ్య వెళ్ళినప్పుడు జగన్మోహన రావు గారు రెండవ భాగం జాగ్రత్తగా ఉంచి ఇచ్చారు. మూడు భాగాలు కలిపి ఒకే పుస్తకం గా వచ్చింది కానీ, నాకు పాత పుస్తకాలు దొరికితే అవే కొనడం ఇష్టం. ఏదో నోస్టాల్జియా ఫీలింగ్!!
For ever warm and still to be enjoy'd,
For ever panting, and for ever young; అంటాడు కీట్స్. పార్వతీశం కూడా అంతే. 1924 లో పుట్టి ఇప్పటికీ యంగ్ గా మనతో ఉండిపోయిన పార్వతీశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పార్వతీశమనే ఒక బుల్లి కుర్రోడు దేశంలో స్థితిగతులు ఉండాల్సిన రీతిలో లేవనీ అందుకు ఏదో ఒక గొప్ప మార్పు అవసరమనీ పెద్ద వాళ్ళ ఉపన్యాసాల ద్వారా తెలుసుకున్నాడు.
ఇంతకీ ఆ మార్పు కోసం ఏం చేయాలో ఆ అబ్బాయికి తెలీదు. ఎవరూ చెప్పలేదు.
పోనీమని వదిలేస్తే అతను పార్వతీశం ఎందుకవుతాడూ.. అందుకే ఇక తనకి తప్పదని, హిందూ దేశ ముక్తి కోసం బారిష్టరీ చదవితీరాలనీ అదీ ఇంగ్లాండులోనే అని నడుం కట్టి బయలు దేరతాడు.
ఇంగ్లాండుకు వెడుతూ, కచికా, తాటాకులూ, మర చెంబు, బొంత, ఎర్రశాలువా, గులాబిరంగు సిల్కు కండువా, ఆరు యజ్ఞోపవీతాల జతలూ, మూడు పట్టు మొలత్రాళ్లు, బంతిపువ్వు రంగు పెట్టె వగైరా, వగైరా సామానుతో బయలుదేరిన పార్వతీశం కడుపుబ్బా నవ్వించి మనల్ని హాస్యంలో ముంచి తేలుస్తాడు.
ఇంగ్లాండు బయలుదేరడంతో మొదటి భాగం,
బారిష్టరీ చదివి తిరిగి రావడంతో రెండవ భాగం..
ఇక్కడ ప్రాక్టీసు.. స్వాతంత్రోద్యమ అనుభవాలూ... ఇవన్నీ మూడవ భాగం. దేనికదే.. మొక్కపాటి వారి కధనా చాతుర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది.
తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన కాలాతీత హాస్య నవల "బారిష్టర్ పార్వతీశం"

No comments