స్నేహ కుటీర్- భీమిలి

నిన్న భీమిలిలో సౌరిస్ ఆశ్రమం "స్నేహకుటీర్" కి వెళ్ళాం. దారంతా భీమిలి సముద్రపు అందాలు. అక్కడే సముద్రపు వడ్డున కెరటాలతో ఆడుకుంటూ చలం మన మనసు మీద ప్రేమ ముద్రలు వేసి ఉంటాడు కదా.
అంతకు ముందు సత్యవతి అమ్మతో ఒకసారి వెళ్ళాను కాని, దారి గుర్తు లేదు. 
భీమిలి ఊర్లోకి వెళ్ళి స్నేహ కుటీర్ అని అడిగితే ఎవరికీ అర్ధం కాలేదు. సౌరీస్ ఆశ్రమం అని అడిగినా చెప్పలేకపోయారు. అక్కడ మునిసిపల్ పార్క్ లో కొంతమంది ఉద్యోగులు కూర్చుని ఉన్నారు. లోకల్ వాళ్ళు కదా ఖచ్చితంగా తెలిసి ఉంటుందని వెళ్ళి అడిగాం. ఊహూ.. లాభంలేదు.. ఇక ఇలా కాదని "చలంగారి అమ్మాయి... సౌరిస్, ఆమె ఆశ్రమం. స్నేహకుటీర్. అడ్రస్ చెప్తారా" అని అడిగాను.
"చలం గారా" ఆయన ఎవరు? ఏం చేసేవారు? అంటే ఏం ఉద్యోగం చేసేవారు?" అని అడిగాడాయన.
నవ్వు, దుఃఖం... రెండూ కలగాపులగంగా వచ్చేసాయి నాకు. రాంగ్ టైం.. రాంగ్ పర్సన్స్‌ని టచ్ చేస్తున్నా అని అర్ధం అయి, Thatisetti Raju గారికి కాల్ చేసాను. ఆయన కరెక్ట్ గా గైడ్ చేసారు. భీమిలి ఊరు బైట నుంచే నేరెళ్ళవలస కాలనీ.. అందులో ఉంది "స్నేహ కుటీర్".
అందమైన తోట. అందులో ప్రశాంతమైన భవనం. ప్రహరీని ఆనుకుని పెద్ద మానులాంటి రావి చెట్టు. చలం అంత పచ్చగా, చలం అంత చల్లగా.. చలం అంత హాయిగా..
లోపలకి వెళ్ళగానే స్కంధ కనిపించింది. వచ్చే వరకూ వదిలి పెట్టలేదు. చలంలానే మనుష్యులంటే ఎంత ప్రేమ కదా. 
భవనం బయట, చలం, సౌరిస్, రమణ మహర్షి చిత్రాలు మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయి. లోపలంతా ఎంత హాయిగా ఉందో. అడుగు పెట్టగానే ఆకు సంపెంగ వాసన గుభాళింపుతో మనకి స్వాగతం. అటు చూస్తే గణుపు, గణుపుకీ విరగపూసిన ఆకుపచ్చ సంపెంగ. అసలు అన్ని పూలా!! అవి పూలో, ఆకులో అర్ధం కాలేదు. అంత విరగబూసాయి.
లోపల ఒక భాగం అంతా సౌరిస్ జ్ఞాపకాలు. చిన్నారి సౌరిస్ నుంచి ఆశ్రమ వాసి "అమ్మ సౌరిస్" గా రూపాంతరం.. నిలువెత్తు జ్ఞాపకాలుగా చిత్రించి ఉంది.
మధ్యలో పెద్దహాలు. చీకటిగా చల్లగా ఉంది. సౌరిస్ కలలోకి వచ్చిన ఈశ్వర రూపం ఒక పక్క, మరో పక్క జీసస్ చిత్రపటం. వాటి మధ్యలో చలం పెద్ద చిత్ర రాజం. విశ్వజనీనమైన ప్రేమ అక్కడ ప్రతీ అణువులోనూ నిండి ఉందా అనిపించింది.
వెనుకవైపు పెరట్లో పెద్ద పనస చెట్టు. వాటి మొదట్లో సౌరిస్ ప్రేమగా పెంచుకున్న గోరింక మీనా. పెద్దదైపోయి కొంత బలహీనంగా ఉంది. కాని మనుష్యులని చూడగానే ఏక్టివ్ గా అరుస్తోంది.
ఒక పక్క గది అంతా చలం పుస్తకాలతో, అరుదైన ఆయన ఫొటోలతో ఉంచారు. అక్కడ కుర్చీలో పెట్టి ఉంచిన చలం ఫొటో ఒకటి భలే ఉంది. గెడ్డం లేని ఫొటో!! గడ్డం లేని ఆ చలం ఫోటో ప్రేమ లేఖలు రాసిన నాటి చలం అట. ఎంత అందంగా ఉందో ఆ ఫోటో. చూస్తుంటేనే తన మనసులోని నైర్మల్యం అంతా కళ్ళల్లోకి పొంగుకొచ్చి పెదవుల మీదకి పాకినట్లు ఉంది. అందుకే అంత అందం.!!. మనసునంతా ప్రశాంతతను నింపి వేసేలా అనిపించింది. దాన్ని అలా చూస్తూ కొన్ని పుస్తకాలూ, అరుదైన ఫొటోలూ తీసుకుని మనసంతా చలాన్ని నింపుకుని అక్కడినుంచి వచ్చేసాం.

No comments