And Still I Rise (అయినా…)

కర్కశంగా వక్రీకరించబడ్డ అసత్యాలతో 
నువ్వు నన్ను చరిత్రలో అణగదొక్కినా 
దుర్గంధమైన మలినంలోకి నువ్వు నన్ను త్రొక్కివేసినా 
అనంతాన్ని ఆక్రమిస్తున్న ధూళి రేణువునై నేను ప్రభవిస్తాను
నా ధీరత్వం నిన్ను కలవరపెడుతుందా?
ఎందుకలా విచారగ్రస్తుడివై మగ్గిపోతున్నావు?
నిక్షిప్త చమురు బావులన్నీ నా ఇంట్లోనే ఉన్నంత 
ధైర్యంతో నేను నడుస్తున్నాననా ?
అలల పోటుల నియతిని శాసించే 
చందమామల్లా… సూర్య తేజస్సుల్లా 
మొలకెత్తుతున్న కోరికల ఉద్ధృతిలా 
నేను వెల్లువెత్తుతాను
భావపూరితమైన శోకపు దుఃఖాశ్రువులతో 
కృంగిపోయిన భుజాలతో 
వంచిన తలతో… వాలిపోయిన కళ్ళతో 
వికల మనస్వినిగా నన్ను చూడాలని నీకనిపిస్తుందా
నా స్వాతిశయం నిన్ను బాధపెడుతుందా?
దాన్నేదో భయంకరమైన కష్టంగా తీసుకోకు 
ఎందుకంటే, నా ఇంటి పెరట్లో
బంగారపు గనుల్ని 
తవ్వుకుంటున్నంత దిలాసాగా నేను నువ్వుతూనే ఉంటాను
నువ్వు నన్ను మాటలతో కాల్చెయ్యవచ్చు 
నీ చూపులతో నన్ను కోసెయ్యవచ్చు 
నీ హేయభావముతో నన్ను చంపెయ్యవచ్చు 
అయినా సరే… ప్రచండమైన గాలిలా… నేను పైకి లేస్తాను
నా సోయగం నిన్ను నిరాశ పరుస్తుందా? 
నా కటి ప్రదేశాన వజ్రాలేవో ఉన్నట్లుగా 
నేను నాట్యం చేస్తుండటం 
నీకు ఆశ్చర్యంగా ఉందా?
భంగపరచిన చరిత్ర యొక్క కుటీరాల నుండి 
నేను ఉద్భవిస్తాను 
వేళ్లూనుకుపోయిన బాధామయ గతం నుండి 
నేను పైకి లేస్తాను
ఎగసిపడుతూ… అనంతంగా విస్తరిస్తూ 
అగాధాలనీ… ఔన్నత్యాన్నీ అలలలోనే భరిస్తున్న 
నేనొక నల్ల సముద్రాన్ని
భీతి గొలిపే భయానక రాత్రుల్ని వెనుక వదిలేస్తూ 
అద్భుతమైన నిర్మలత్వపు ఉషోదయంలో 
నేను లేస్తాను
నా పూర్వీకులు ఇచ్చిన దీవెనల్ని తీసుకువస్తూ 
నేనొక కలనై… 
బానిస యొక్క ఆశనై… 
నేను ఉదయిస్తాను 
నేను ఉదయిస్తాను 
నేను ఉదయిస్తాను.
Maya Angelou రాసిన Still I Rise Poem కి నా అనువాదం.


No comments