మంకెనపూలు - 4
సృష్టి మొదలు మనుష్యులుగా మేము అకల్పితాలం
అరాచకాన్నే శాసనంగా కొనసాగిస్తూ వస్తున్న
మీ నిగూఢ పశుప్రవృత్తులకు
మా రక్తమాంస దేహాలూ
నవమాసాలూ మీరు దాగిన గర్భగేహాలూ కల్పితాలే
మరందుకే కదా మీ చిత్తం వచ్చినట్లుగా
మీ నియమానుసారం కట్టుబాట్లు రాసేసి
మమ్మల్ని బొమ్మలుగా ఆడిస్తూ విలాసం చూస్తూ ఉండేది
యుగాలుగా మా వంతుకి వచ్చిన కాలంలోకి
బలవంతంగా చొరబడి మీరు దోచుకుంటున్న కాలం విలువ,
తరాల దారులన్నిటిలో మీరు చల్లుతూ వచ్చిన కంటకాలు చేసిన నొప్పి
మీకెన్నడూ తెలియకపోవచ్చు
కాలం గోడలన్నిటినీ చెమ్మబార్చిన మా అశ్రువుల లెక్కలన్నీ
సిద్ధంగా ఉన్నాయి…
ప్రతి లెక్కనీ సరిచెయ్యడం పెద్ద కష్టమేమీ కాదిప్పుడు
ఇంతవరకూ మీకు కనిపించేవన్నీ
మమ్మల్ని అబలలుగా పరిచయం చేసే
కాంతి ఇంకిపోయి వెలుగు ఆరిన కన్నులు…
మా చెక్కిళ్ళపై ఎండిన అశ్రు చారికలు మాత్రమే అయి ఉండవచ్చు
సహనమంతా ఇంకిపోయి బండబారి పోయిన హృదయాలు
ఏ చిరు తాకిడికో ఒక్కసారిగా బద్దలవటం అంటూ జరిగితే
మీ ఊపిరులన్నీ శకలాలుగా చెల్లాచెదురవ్వడమన్నది
రేపటి వార్తలలో మీరు వినలేని నిజం
పుట్టుకనుండి చీకటినే శ్వాసించిన మాకు
అరారగా మీరు వెలిగించే అగ్గిపుల్లల వెలుగులో
కాంతిని వెదుక్కునేంత పిరికితనం లేదిప్పుడు
మా ధిక్కారమే చెకుముకి రాయిగా మారి
పుట్టించే అగ్గి రవ్వ చాలదూ
అనంతం నాటి మీరు వేసిన సంకెలలన్నింటినీ
దహనం చెయ్యడానికి…
అప్పుడు మాత్రం కాస్త దూరంగా ఉండండేం…
అక్కడున్న జ్వలనపు సెగలు తగిలి మీరు మాడిపోకుండా
ఇన్నాళ్ళుగా మా చుట్టూ మీరు పరచిన
కొలవలేని నిశ్శబ్దాలన్నీ
ఒక శబ్దంగా మారి పిక్కటిల్లినప్పుడు
ఎదురుగా నిలిచారు సుమా…!
మీ కర్ణభేరులు బద్దలయిపోతాయి
మిమ్మల్ని మీకు నిశ్శబ్దం చేస్తూ!
అవును… మా లోపలి మనసులకి ఇలానే మాట్లాడడం వచ్చు. అది మాట్లాడే మాటలని యధాతథంగా లోకానికి వెల్లడి చేస్తే ఆ మాటలు ఇలానే అత్యంత కరుకుగా ఉంటాయి. కానీ మేమే మాట్లాడం…
ఎందుకంటే… మీకై మీరు మారడానికి ఒక్క ఆఖరి అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక్క తలంపుతో. ఒక్కసారి ఆ తలంపుని దాటి బయటకు వచ్చామా… ప్రపంచంలో ఏ ఒక్క స్త్రీ గర్భసంచీతో ఉండదు. అంతేకదా మరి… ఆరేడు నెలల పసికందులోనూ… అరవై డెబ్భై ఏళ్ళ ముదిమి వయసు మహిళలోనూ ఆడతనం తప్ప ఇంకేదీ కనిపించని లోకానికి అమ్మతనం ఇక అవసరం లేదు అని అనిపించిన ఒకే ఒక్క క్షణాన ఈ ప్రపంచం ఇక పరుగును ఆపెయ్యవచ్చు.
ఇన్నాళ్ళుగా మిమ్మల్ని మేము సహవాసులం అనుకుని, మీరెన్ని దాష్టీకాలు చేసినా సర్దుకొని పొయ్యాం. సహనం, ఓరిమి మా చుట్టాలేమీ కాదు… అవి మేము మీకిచ్చిన అవకాశాలు.
చివరిగా ఊపిరి ఆగిపోయే మనిషి తన మరణవాంజ్ఞ్మూలంలో స్త్రీలపై యుగయుగాలుగా సాగించిన తమ దమన నీతిపై పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తే… భవిష్యత్తులో ఈ భూమి మీదకు వచ్చే ఏ బుద్ధి జీవికో అది చక్కని పాఠం అవుతుంది.
ఒక కొత్త లోకం ప్రకటితమవుతుంది.
Post a Comment