నీల -కె.ఎన్.మల్లీశ్వరి.

"జ్ఞాపకం ఆవరించినప్పుడు 
భస్మ వేదిక నుంచి పక్షి ఉత్థానం చెందుతుంది 
కాలం చేసిన దారుల వెంట మృత నది మళ్లీ ప్రవహిస్తుంది. 
వేల ఏండ్ల క్రిందట సరీసృపాల లోను ఇంకా ప్రాణం కదలాడుతూనే ఉంటుంది
ముగిసి పోకూడని వాటిని ఎవరు ముగించలేరు..
దీపస్థంభం: సంభాషణ "
అంటుంది మల్లీశ్వరి పుస్తకం మొదట్లో. బహుశా ఫీనిక్స్ పక్షి ని గుర్తు తెచ్చుకొని కాబోలు.
నీల పుస్తకాన్ని ఆరు నెలల క్రితం ఆపకుండా చదివాను. నిజానికి అప్పుడే రాయాలి ఈ పుస్తకం గురించి. అయితే సరిగ్గా అదే సమయానికి నా జీవితంలో ఒక పెద్ద కుదుపు. ప్రాణస్నేహితుడు హఠాత్తుగా చనిపోవటం నా జీవితంలో పెద్ద విషాదం. ఆ ముందు రోజే మేమిద్దరం నీల ,పరదేశి , సదాశివల గురించి మాట్లాడుకోవడం ఆ మర్నాడు ఇలా జరగడం... దుఃఖం ఒక పెద్ద సునామీలా వచ్చి నన్ను లాక్కుపోయింది. నాతోపాటు నీల జ్ఞాపకాలను కూడా.
ఈ ఆరు నెలల్లో చాలా పుస్తకాలు చదివాను. కొన్ని థాట్స్ రాసాను. అయినా పుస్తకాల మధ్య నీల కనిపించినప్పుడల్లా ఒక అస్పష్ట భావన. మళ్లీ దుఃఖపు తెరలు. రాస్తే గాని కొంత భారం దిగదనిపిస్తోంది అందుకే రాస్తున్నా.
నీలలో నాకు బాగా నచ్చిన అంశం అన్ని పాత్రలు వేటికవే తమ తమ సహజ గుణాలతో స్పష్టంగా ఉంటాయి. నీల మొత్తం మీద తన జీవితంలోనే కాకుండా ఆమెతో ముడిపడి ఉన్న అనేకానేక పరిస్థితులను మనకు పరిచయం చేస్తుంది.
సంపూర్ణ, చంద్రకళ,అరంజ్యోతీ, పరదేశి, సదాశివ, పైడమ్మ... వేటికవే ఏ పాత్ర ఊరికే అలా వచ్చి పోయినట్లు ఉండదు. వెళుతూ వెళుతూ ఏదో ఒక ముద్ర వేసి వెళ్తుంది. నీలపట్ల మొదలైన ప్రేమ మనల్ని ఎలా కమ్మేస్తుంది అంటే ఎప్పటికైనా భర్తను ఎదిరించి గలిగే శక్తి ఆమెకి వస్తుందా అని ఎదురుచూస్తాం. ఒక్కోసారి చిరాకు పడతాం. చేయి పట్టుకుని “ఇక చాల్లే రా బయటకు” అనాలని చూస్తాం. చివరకు కూతురు “అమ్మా నాన్నొద్దు, భయం... వెళ్ళిపోదాం” అన్నప్పుడు మనం కూడా నీల వైపు ఆశగా చూస్తాం ఇక చాల్లే రా బయటకు అని.
“అసలు ముందు నాలో నన్ను మిగుల్చుకోకుండా అతన్ని దక్కించుకునే పోటీలోకి ఎందుకు పరుగులు పెట్టాను” అనుకుంటుంది నీల బయటికి వస్తూ. ఒక్క నీలే కాదు చాలా మంది వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
తల్లి జీవితాన్ని దగ్గర్నుంచి చూసింది నీల. పెద్ద పెద్ద దుఃఖాల మధ్య చిన్న సంతోషాన్ని వెతుక్కుని దానికి బలైపోయిన తల్లి... నీలని వంటరి చేసి వెళ్లిపోయిన తల్లి... వెళ్తూ వెళ్తూ నీల మనసు మీద పెద్ద నీడని పరచి వెళుతుంది. అప్పుడే నీల జీవితంలో పోరాటం మొదలవుతుంది.
నీల నవల ఒక నీల పాత్ర చుట్టూ అల్లిన కథ కాదు. ఇందులో చాలా మంది స్త్రీ పురుషుల జీవితం ఉంది. వాళ్ల వాళ్ల జీవితాల్ని మలచుకున్న పద్ధతుల్లో చాలా భిన్నత్వం ఉంది. మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడం తప్ప ఎవరి జీవితాల్లోని తప్పొప్పులు కూడా మనం నిర్ణయించలేం కదా అనిపిస్తుంది మనకి.
తల్లి జీవితాన్ని దగ్గరగా చూసిన నీల పాస్టరమ్మ దగ్గర ప్రేమని పొందిన నీల ప్రసాద్ తో పెళ్లి తో భద్రమైన జీవితాన్ని తనకు మాత్రమే సొంతమైన జీవితాన్ని కోరుకుంటుంది.
అది భగ్నమయ్యాక పరదేశి తో ఒక ఆదర్శవంతమైన అనుబంధం కోరుకుంటుంది. ఒక మంచి తోడు ఒక పోటీ లేని ప్రేమ కావాలనుకుంటుంది. అది కూడా సాగకపోయాక సదాశివ పరిచయం అయ్యేటప్పటికి నీలలో ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది.
తప్పుల గురించి బాధ పడటం మానేసిన పరిణితి... స్వేచ్ఛా పూరితమైన సహచర్యం... అప్పుడు తనకు తాను ఇలా చెప్పుకుంటుంది
“పదిమంది అండ ఉండాలని అనుకోవడం మానవ సహజం ఒక్కరు లేకపోతే జీవితమే శూన్యం అనుకోవటం బేలతనం సదాశివ సహచర్యం తనకు కట్టుబాటు అంటే కొత్త అర్థం చెప్పింది ముందు మనకు మనం ఉండాలి ఆ ధైర్యం నుండి స్థిమితం నుండి మనుషులను కోరుకోవాలి.”
నాకయితే సంపూర్ణ, పైడమ్మ పాత్రలు చాలా చాలా నచ్చాయి. కొన్ని సార్లు నీల పాత్రమీద చాలా చాలా కోపం వస్తుంది కూడా. వాల్యూ జడ్జ్‌మెంట్ కొంచం ఇబ్బంది పెడుతుంది. అచ్చం నీల గురించి మళ్ళీ ఒక సారి రాయాలి.
పైడమ్మ ప్రేమలో పడిపోయా నేనయితే.
సముద్రంతో పైడమ్మ "ఒలె! అప్పా! నచ్చత్రాలు భూమండలము పుట్టినప్పుడు పుట్నావు. ఇన్ని తాపులు కాసినావు. రాచ్చసులంటి పడవల్ని బుజానేసుకుని మోసినావు. నీ లోపట సంపదలు సత్తువలు తీసి మాకిచ్చినావు. ఇంకా ఈ జీవరాశికి ఎంతకాలం సాకిరీ సేత్తావు? బుడింగిన మునిగి మాయమౌదారని అనిపించట్లేదే నీకు?"
అంటుంది. ఎందుకు బతకాలి ఇంక అనిపించిన ప్రతీసారి గుర్తుంచుకోవాల్సిన వాక్యం ఇది.
సముద్రమంత స్వేచ్ఛ సముద్రానికి ఉంది కదా ! మరి సముద్రం ఎందుకు వెనక్కి వెళ్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా సముద్రానికి ఏవైనా నియమాలు విధించారా? లేక సముద్రం తనకి తను ఏమైనా నైతికతను రూపొందించుకుందా? లేక అనుభవం తనకి గమనాన్ని నేర్పిందా? ఎప్పుడైనా మన మనసు కి తడుతుందా ?

దీనికి సమాధానం నీల చెప్పడానికి ప్రయత్నిస్తోంది... మీరూ చదవండి తన సమాధానం మీకూ నచ్చుతుందేమో.






No comments