#SileruMusings- 3

లంబసింగి నుండి 11గంటల కల్లా బయలు దేరాం. సీలేరుదాకా మూడు గంటల ప్రయాణం. మొత్తం ఘాట్ రోడ్డు. అటుపక్కా ఇటుపక్కా అడవి పూలు. దారంతా వర్షం పడుతూనే ఉంది. ఘాట్ మలుపులు తిరుగుతున్నప్పుడల్లా.. ఒక పక్క కోసేసినట్లున్న రోడ్లు... కొంచం అదుపు తప్పినా జారిపోతామన్నట్లున్న లోయ... ఒక పక్క గుండె ఝల్లు మంటున్నా.. అదో తెలియని ఆనందం.
మధ్యలో ఒక చోట కొండమలుపు తిరుగుతూ ఉండగానే పారిజాతాల పరిమళం చుట్టుముట్టింది. దిగి వెతుక్కుంటూ వెళితే ఒక వంద మీటర్లు లోపలికి అడవిలోకి నడిచాక కనిపించింది ఒక పారిజాతం చెట్టు. ఇక్కడ మన ఇళ్లల్లో పారిజాతం అంటే మహా ఐతే ఒక ఏడెనిమిది అడుగులు ఉంటుంది. కానీ అక్కడ అడవిలో స్వేఛ్చగా పెరిగిన పారిజాతం ఆకాశాన్నంటుతుందా అన్నట్లుంది.
కానీ నా మనసంతా ఆ అందాల మీద లేదు. సీలేరు, చిత్రకొండ క్రాస్ రోడ్ లో ఉండే జలపాతం మీద ఉంది. ఆ జలపాతానికి ఒక పెద్ద కథ ఉంది. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మేము 6,7 తరగతులు చదివేటప్పుడు చిత్రకొండ నుండి సీలేరుదాకా బస్ లో వచ్చే వాళ్ళం. దారి పొడుగునా అటూ ఇటూ పెద్ద పెద్ద చెట్లు. ఒక్కొక్కరికీ ఒక్కో చెట్టు. ఎవరికి వాళ్ళ వాళ్ళ చెట్టు కనిపించగానే ఇది నాది ,ఇది నాది అని అరిచేవాళ్ళం.
అలాగే నాకూ ఒక చెట్టు ఉండేది. సీలేరు ఊరి బయట ఇటు దారకొండని, అటు చిత్రకొండని కలిపే ఒక క్రాస్ రోడ్ దగ్గర పెద్ద జలపాతం ఉండేది. జలపాతం మొదటి మెట్టు దగ్గర కొంచెం వంగినట్లు పెద్ద మాను ఉండేది. పైనుండి ఉరుకుతున్న జలపాతం. .. అక్కడ ఒక బ్లైండ్ కర్వ్. ఘాట్ లో ఆ మలుపు దాటగానే తెల్లగా మెరుస్తూ దూకుతున్నట్లుండే జలపాతం. దానిమీదికి వంగి ముద్దు పెట్టుకుంటున్నట్లున్న చెట్టు. భలే ఉండేది.
బస్ ఆ ఘాట్ లో మలుపు తిరగ్గానే పెద్దగా అరచే దాన్ని. ప్రసాద్ మామయ్యని ( Bus Driver ) ఒక్క సారి ఆపు మామయ్యా అని కేకలు పెట్టేదాన్ని. వెళ్ళేటప్పుడు ఆపేవాడు కాదు గానీ వచ్చేటప్పుడు ఆపేవాడు. జలపాతం మొదట్లో ఆ చెట్టు కొమ్మ పట్టుకుని కాసేపు ఊయల ఊగి వచ్చేసే వాళ్ళం.
ఫిబ్రవరి, మార్చి దాటి మాకు వంటిపూట స్కూళ్ళు మొదలయ్యేసరికి పులులు జలపాతం దగ్గర నీళ్లు తాగటానికి రోడ్డు మీదకి వస్తాయని నాన్న హెచ్చరించేవారు. అయినా పిల్లలం వినం కదా…
అలా ఒకసారి ఆ జలపాతం దగ్గర ఆగి పిల్లలం అందరం దిగాక దూరం నుండి పులి గాండ్రిపు వినిపించిందని ప్రసాద్ మామయ్య గోల గోల చేసి పిల్లలందరినీ బస్సు ఎక్కించి తెచ్చేసాడు.
మరలా ముప్ఫయి సంవత్సరాల తరువాత జలపాతం మలుపు తిరగ్గానే ఉద్వేగంతో కళ్ళ వెంట నీళ్లు వచ్చేసాయి. దిగి దగ్గరకు వెళుతుంటే నా చెట్టు… నా చెట్టు… అంటూ మనసు కలవరించింది. వర్షాలకో… వరదలకో… ఎండలకో .. ఏమో అక్కడ చాలా చాలా మారిపోయింది.
నా చెట్టు… జలపాతం మీదకి వంగి వయ్యారంగా ముద్దు పెట్టుకునే కొమ్మ…ఎక్కడుందో గుర్తు పట్టలేక పోయాను. అన్ని చెట్లనీ ఒకసారి కౌగలించుకుని వచ్చేసాను. వాటిల్లోనే ఎక్కడో ఉండే ఉంటుంది. నా స్పర్శనీ నా ప్రేమనీ మౌనంగా స్వీకరించే ఉంటుంది. 
అంతలో సడన్ గా వర్షం మొదలయ్యింది. ఆ చిరిజల్లుల్లో ఏదో స్పర్శ.. మెత్తని హాయైన పరిమళం.. హమ్మయ్య!! నా చెట్టు నన్ను గుర్తు పెట్టుకుంది. ఆనందంగా అక్కడి నుండి బయలుదేరి సీలేరు ఊళ్ళోకి వచ్చేసాం..

No comments