Politics of the Womb by pinky virani

A riot, in very slow motion, is being engineered on the woman inside her body; to take her apart, part by profitable part. The slow rampage is in the name of God – for hers is the womb and she shall conceive. 
పుస్తకం తెరవాగానే కనిపించే ఈ వాక్యాలు, రచయిత మనకు చెప్పాలనుకున్న అంశాన్ని దాదాపుగా చెప్పేస్తాయి. ఐవిఎఫ్ , సర్రొగసీ పద్ధతుల్లో ముడి పడి ఉన్న ఆర్ధిక అంశాలతో పాటు, అటు తల్లి తండ్రులూ.. ఇటు సర్రోగసీకి వప్పుకున్న తల్లి పడే మానసిక శారీరక సంఘర్షణలూ... హాస్పిటల్స్, డాక్టర్లు ఎలా వీళ్ళని Exploit చేసి తమ వ్యాపార దృక్పధాన్ని చాటుకుంటున్నారు... ఇవన్నీ ఉదాహరణలతో చెప్తారు పింకీ. మాతృత్వపు వరం కోసం ఒకరు, ఆ వర ప్రదానం చేసే దాతృత్వపు స్థానంలో మరొకరు… ఎంతటి ఉన్నత బాంధవ్యమది? 
తలచుకుంటే దీన్ని సుసాధ్యం చేసిన శాస్త్రవేత్తలకి చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అమ్మదనమంటే బజారులో ధనానికి అమ్మేది కాక పోయినా, వేరు వేరు పరిస్థితుల దృష్ట్యా.. ఒక మాతృమూర్తి తన గర్భంలో మరో మాతృమూర్తి పిండాన్ని మోయడం ఎప్పటికైనా ఒక అద్భుతం.
. కానీ వాళ్ళ అవసరాలని అవకాశంగా తీసుకుని సరోగసీ ని వైద్య విధానంగా కాక ఒక బిజినెస్ ఆపర్చ్యునిటీగా మార్చుకుంటున్న డాక్టర్స్ గురించి చదువుతుంటే చాలా కొద్ది మంది అయినా, ,నడిచే దేవుళ్ళుగా పేరుబడ్డ అ వృత్తి, కొద్ది మంది వల్ల ఎలా పతనమౌతోందీ అన్న బాధ .
“What is a uterus, it is like a room. Repaint, redecorate any number of times”., అన్న ఒక డాక్టర్ మాటలు చదువుతుంటే మనసు దుఃఖం తో ముడుచుకు పోతుంది. ఒకప్పుడు డైరీ పరిశ్రమ పట్టుకొమ్మగా ఉన్న ఆనంద్ ఇప్పుడు సర్రొగసీ ని ఒక పరిశ్రమగా మార్చుకుందని తెలిసి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 50 ఏళ్ళు పైబడిన కొంత మంది పేద తల్లులు కూడా కేవలం 75 వేల కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చి.... ఆ తర్వాత వాళ్ళు శారీరకంగా పడిన కష్టాలు.. ఇవన్నీ చదువుతుంటే ,ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం మనం ? అనిపిస్తుంది. వీటన్నిటి వెనుక పేదరికంతో పాటు, భర్తల చెడు వ్యసనాలు.. నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, ఆర్ధిక స్వావలంబన లేకపోవడం..
ఇటువంటి గత్యంతరం లేని పరిస్థితులు మనకి అర్ధం అవుతాయి. కుటుంబాన్ని పోషించడానికి కొంతమంది అవివాహిత ఆడపిల్లలు కూడా వీటికి వాహకాలు గా మారుతున్నారంటే మనసు బాధతో ముడుచుకు పోతుంది. "సర్రొగసీ పద్ధతి వెనుక ఉన్న నైతికత.. న్యాయ అన్యాయాల గురించి నేను మాట్లాడట్లేదు. అది చాలా లోతైన అంశం. ఎందుకంటే తల్లి కావాలని తపన పడే ఒక స్త్రీ బాధ నేను అర్ధం చేసుకోగలను." అంటారు పింకీ. . పింకీ చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఒకటే.. కొంతమంది వైద్యుల వ్యాపార ధోరణి. 
ఒక తల్లి అవసరం... మరో తల్లి నిస్సహాయత... వెరెవరికో డబ్బులు ముద్రించే ఒక వాహకం అవుతోందంటే ఎలాంటి వ్యవస్థలో ఉన్నాం మనం??


No comments