ఇదిగో ఇలా...


ఓపలేని దుఃఖం. ఆగ్రహం లోలోపల లుంగలు చుట్టుకుని మనల్ని కుదిపేసి ఏ దిగంతాల అంతాలకో మనల్ని విసిరేసినప్పుడు మనల్ని మనం గాయపరచుకుని..
మనమే లేపనం పూసుకుని సర్దుకుని స్థిమిత పడడం…
అనేకానేక మార్లు అట్లా పగిలిపోయి,
శకల శకలాలుగా చెదిరిపోయి
మళ్ళీ మనల్ని మనం పోగేసుకుని , నిలబెట్టుకుని,
రక్త సిక్త దారులలో పాదముద్రల ఆనవాళ్ళని వెతుక్కుంటూ…
తెగిన గాలిపటాల్లా...
ఎగిరిపోయిన కలల సీతాకోక చిలుకల్ని పట్టుకునేందుకు నిస్సహాయంగా చేతులు చాచి, 
మరల మరల స్వప్నాల దారుల్ని, అన్వేషిస్తూ..
మన అంతరాంతరాలలో జరిగే నిత్య సంఘర్షణల మధ్య... అంతర్లోకాలలో సదా ఒంటరిగా సంచరిస్తూ....
రాయలేని తనమేదో మనల్ని కమ్ముకున్న వేళ…
ఒక్కోసారి అంతే..
చాలా కాలంగా ఉగ్గబట్టుకున్న అక్షరాలేవో కట్లు తెంచుకుని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. దాటాల్సిన అడ్దంకులింకా చాలా ఉన్నాయనీ.. కొంచెం కొంచెం అయినా సంకోచాలని వదిలి చెప్పాలనుకుంటున్న సంగతులేవో స్పష్టంగా చెప్పాలని అనిపిస్తుంది.
ఏ దుఃఖమో… కోపమో చుట్టు ముట్టినప్పుడు అనిపిస్తుంది ఆలోచనలు కూడా తూకమేసినట్లుగా ఏ మేరకు అవసరమో ఆ మేరకే వస్తే బాగుండు కదా… ఎప్పటికిప్పుడు ఈ బాధలకి విముక్తి ఇచ్చేసుకుంటాం కదా అని.
ఒక్కోసారి మనవారికి కూడా మన దుఃఖపాతాలూ… విషాదపు ఆనవాళ్ళు కనిపించవు. కనిపించే గాయాల లోతు తెలిసినట్లుగా కనిపించని గాయాల లోతు తెలిస్తే… ఏమో… అప్పుడైనా ఆనందపు సాంగత్యం అనుభవమవుతుందేమో…
చాలా పెద్ద ఆశ కదూ ! మరి ఆశ అంటూ లేకుంటే మనిషి మనిషిలా ఉండేవాడా ఏం? అనంత జంతుజాలం తానూ అలా కొనసాగుతూనే ఉండేవాడు. అలా ఉంటేనే బాగుండేదేమో.
అప్పుడు ఏ దుఃఖభారాలూ మనసుకు వర్తించేవి కావు. గుండెకీ కంటికీ మధ్యన అశ్రు రాయబారమూ ఉండేది కాదు.
ప్రతి మనసుకూ కొన్ని తడి వేళలుంటాయ్. ఆ కాసేపు మనకి మనం రాలుతున్న ఒంటరి నక్షత్రమే అనిపిస్తూ…
ఇదిగో ఇలా కొన్ని తడి అక్షరాలతో నేలను తాకుతూ..

.

No comments