Tears And Laughter.. (Translation from Complete works of Kahlil Gibran)

విధాత ఒక ఉదయం తన నుంచి తన ఆత్మను వేరుపరిచి దానిని ఒక సుందరమయిన ఆకృతిగా మలిచాడు. అనంతమయిన దర్పాన్ని, కరుణను ఆ సృష్టి లో ప్రతిష్టించాడు. ఆమెకు రెండు పాత్రలు అందించి చెప్పాడు.
"ఈ మొదటి పాత్రలో ఆనందముంది. నువు నీ గతాన్ని మరిచిపోగలిగినప్పుడు, భవిష్యత్ చింత లేనప్పుడు దీనిని తాగు. క్షణికమైన సంతోషం కోసం కాక నశ్వరమైన ఆనందం కోసం దీనిని తాగు.
ఈ రెండవపాత్ర ని జీవితంలోని అనంతమయిన బాధని జయించి ఎల్లలులేని సంతోషాన్ని పొందడానికి సేవించు.
ఆయన ఆమెకి ప్రేమని ప్రసాదించాడు., కానీ ఎప్పుడయితే ఆమె ప్రాపంచిక విషయాల వల్ల సంతృప్తికి లోనవుతుతుందో ఆ మరుక్షణం ఆ ప్రేమ ఆమెనుంచి శాశ్వతంగా దూరమయిపోయేలా చేసాడు.
మంచితనాన్ని ప్రసాదించాడు. కానీ మొట్టమొదటిసారి పొగడ్తని తెలుసుకున్న వెంటనే దానిని ఆమెనుంచి మాయమైపోయేలా చేసాడు.
అన్నివేళలయందూ ఆమెను సరయిన పథంలో నడిపించే తెలివితేటలను స్వర్గం నుంచి తెచ్చి ఆమెకు అనుగ్రహించాడు. కంటికి కనిపించని వాటిని చూడగల మనోనేత్రాన్ని ఆమె హృదయంలో ప్రతిష్టించాడు. సృష్టిలోని అన్ని వస్తువులపట్లా దయ కలిగి ఉండేలా ఆమెను దీవించాడు. హరివిల్లు నుంచి తెచ్చిన రంగుల లతలతో దేవతలు అల్లిన ఆశల వస్త్రాలతో ఆమెను అలంకరించాడు. ఫలవంతమయిన జీవితానికి ఆవశ్యకమయిన వెలుగు ని వెతికే ఒక అనిశ్చితిలో ఆమెను నిలిపాడు.
ఆ తరువాత ఆయన కోపపు కొలిమి నుండి జనించిన ఉష్ణాన్ని, అజ్ఞానమనే ఎడారినించి వడగాల్పులని, స్వార్ధమనే ఒడ్డునించి తన పదునుతో దేనినైనా కోయగలిగేలాంటి ఇసుకని, యుగాలుగా భూమిలో కప్పబడి పోయిన ముతక అవశేషాలను సేకరించి, వీటన్నింటిని కలిపి పురుషుడిని తయారు చేసాడు. వాంఛ తీరడం ద్వారా మాత్రమే సంతృప్తి పొందే పిచ్చి వైపు మాత్రమే నడిపించే ఒకానొక గుడ్డిశక్తిని అతనిలో ఆయన ప్రతిష్టించాడు. అనుక్షణం మరణాన్ని శ్వాసించే జీవితాన్ని అతనిలో నింపాడు. .
ఆ తరువాత ఆయన నవ్వాడు, యేడిచాడు. ఆ పురుషుని పట్ల అవ్యాజమయిన అనురాగం, సానుభూతి కలిగిన ఆయన తనదారిలో నడిచేలా అతనిని అనుగ్రహించాడు.


No comments