మహి 'మ్యూజింగ్స్' - 2






దేముడు ఉన్నాడా.. లేదా.. ఈ సందేహం కాసేపు పక్కన పెడదాం.

ఒకవేళ ఉండీ.. నాకోసం దిగివచ్చి, నీకేం కావాలో కోరుకో అంటే మాత్రం నన్ను టైం మెషీన్ ఎక్కించి నా చిన్న తనానికి తీసుకు వెళ్ళమని అడుగుతాను.

నేను అక్కా చిన్నప్పుడు పెరిగిన ప్రదేశాలు... అంధ్రా.. ఒడిషా బోర్డర్. చిత్రకొండ ఊరు. సీలేరు అడవి. జలపాతాలు, లోయలు, ఆ పచ్చదనం. ఎంత అందమైన రోజులవి?

చిన్నప్పుడు నాన్నగారు బలిమెల ప్రాజెక్ట్‌లో చేసేవారు. అక్కడ ప్రాజెక్ట్ ఏరియా, టెంపరరీగా వేసిన  రేకుల షెడ్ల లాంటి ఇళ్ళల్లో ఉండే వాళ్ళం.

నా పసితనపు మొదటి జ్ఞాపకం అదే. ఇంటి చుట్టూ బోలెడు పూల మొక్కలు కాయగూరల మొక్కలు ఉండేవి
ఆ తర్వాత చిత్రకొండ వచ్చేసాం. ఇప్పటికి ఇన్ని వేసంకాలాలు చూసినా చిత్రకొండలో ఎండాకాలం శెలవులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం.

గవర్నమెంటు క్వార్టర్సు కాబట్టి చుట్టూ బోలెడు స్థలం ఉండేది.
ఇంటి బయట ఒక సీమచింతకాయల చెట్టు. వరండానల్లుకుని పెద్ద తీగ మల్లె చెట్టు...
ఇప్పటికీ కలలోకి వచ్చి ఒక బెంగ లాంటి ఫీలింగ్.

మధ్యాహ్నం అన్నం తిన్నాక బలవంతంగా నిద్రపుచ్చేది అమ్మ. సాయత్రం నాలుగు అయిన దగ్గర్నుంచి ఇంక హడావుడి మొదలయ్యేది.మల్లెమొగ్గల హడావిడి. ఇంకా పసరు  వాసన వస్తున్నాయ్, సాయంత్రం అవనీండి అని అమ్మ గొడవపెడుతూనే ఉండేది.

మనం వింటామా...

కొమ్మలు విరగ కుండా మొగ్గలు కోయడం. కొంచం పసరుదనం కనిపిస్తే ఇది రేపటికా.. అని గట్టిగా అరవడం.. అమ్మ లోపలికీ బయటకీ తిరగలేక ఈ చెట్టు ఎప్పుడు కొట్టేస్తామా అని విసుక్కోవడం... భలే ఉండేది.  ఇక మొగ్గలు కోయడం పూర్తయ్యేటప్పటికి ఇంకా ఎండగా ఉండేది కదా... మొగ్గలు కమిలి పోతాయని గాబులో నీళ్ళలో వేయించేది అమ్మ.

సరిగ్గా రోజూ ఆ టైంకి వచ్చేది సీతాపతి అత్తయ్య. అంటే నాన్నగారి కొలీగ్ సీతాపతి మామయ్య వాళ్ళ వైఫ్. పేరు సుశీల. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు. అందుకని మాతో మంచి స్నేహం అన్నమాట. పాపం మా అమ్మకున్న పిల్లా పీచూ పనులు ఆవిడకు లేవు కదా. 
ఇంటి వెనుక మా గాబు అంటే ( నీళ్ళ టాంక్) సరిగ్గా మేడ మీద నుంచి కింద పెరట్లో గోడని ఆనుకుని ఉండేది. అక్కడనుంచి వంటగది కిటికీ కి పైన ఒక విండో షేడ్ ఉండేది. సుశీల అత్తయ్య రాగానే అమ్మ చూడకుండా పైకి మేడ మీదకి వెళ్ళి నేను అక్క సుశీల అత్తయ్య.. ఒకళ్ళతర్వాత ఒకళ్లం మేడ మీద నుంచి కిటికీ షేడ్ మీదకి అక్కడనుంచి కింద గాబులో నీళ్ళలోకి రెండే రెండు స్టెప్స్ లో దూకే వాళ్ళం. ప్రతీ రోజూ అదో ఆట. నీళ్ళలో మల్లెపూలు... వాటితో పోటీగా మా ఈదులాటలూ... గుర్తుకు వస్తే ఇప్పటికీ ఆ పరిమళం... ఇప్పుడే పీల్చినట్లు ఉంటుంది. అంత ఫ్రెష్ జ్ఞాపకాలవి.

ఇక స్విమ్మింగ్ అయ్యేటప్పటికి పూలు కాస్త నేవళంగా అయ్యేవి. అప్పుడు మొదలయ్యేది అసలు పని అంతా. సుశీల అత్తయ్య న్యూస్ పేపర్లు జాగర్తగా చింపి పకోడి పొట్లంలా చేసి రెండు చేతులతో రెండు పట్టుకుని కూర్చునేది. నేనూ అక్కా ఒక్కోసారికి అయిదు మొగ్గల చెప్పున లెక్క పెడుతూ ఆ పొట్లంలో వేసేవాళ్ళం. అసలు అలా వేయడంలోనే ఉంది నేర్పంతా. మొగ్గ నలగకుండా గట్టిగా పట్టుకోకుండా.. అలా సున్నితంగా వత్తిడి తగలకుండా వేయాలి. వంద వంద చొప్పున ఒక్కో పొట్లంలో వేసి అంతే జాగర్తగా పై మూత కవర్ చేయాలి. ఆ పొట్లాలన్నీ గౌన్ ఎత్తి పట్టుకుని ఆ జోలెలో వేసుకుని పరిగెత్తే వాళ్లం. రోజుకి ఐదారుగురి చొప్పున పంచి వచ్చేవాళ్ళం.

ఇక పూల జడలు వేసుకోవాలంటే ముందే కబురు చెప్పి వెళ్ళేవాళ్ళు. ఇక ఆ రోజు పూలన్నీ వాళ్ళకే అన్న మాట. ఇన్ని పూలు ఉండేవా.. నాకు మాత్రం కృష్ణుడి పిలకే. ఎందుకంటే మనది హిప్పీ క్రాఫ్ కదా... ఆ దుఃఖం అంతా ఇంకో సారి చెప్తాలే.

ఎండా కాలం అయిపోయి వర్షా కాలం వచ్చేటప్పటికి చామంతులూ, డాలియా పూలు మొదలయ్యేవి. వర్షాలు మొదలవ్వగానే మా ఇద్దరికీ ఇక అదే పని. ఏ అత్తయ్యా వాళ్ళింట్లో కొత్త రంగు చామంతులు ఉన్నాయో. ఏ మౌసీ (ఒరియాలో అత్తయ్య) ఇంట్లో కొత్త రంగు డాలియా దుంప వేసిందీఇదే పని. మనింట్లో పిలకలూ దుంపలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళింట్లోవి తెచ్చుకోవడం. బార్టర్ సిస్టం చాలా న్యాయంగా అమలయ్యేది.

ఇన్ని రకాల పూల మధ్య పెరిగి నేను 8 వ తరగతికి విజయవాడలో చేరాక మొదటిసారి బస్టాండ్ దగ్గర పూల కొట్టు చూడడంమల్లెలు కొనుక్కోవడం, మూరలు బేరమాడడం భలే బెంగగా అనిపించేది.

ఇప్పటికీ చాలా సార్లు చిత్రకొండ లో ఆ క్వార్టర్స్ కలలోకి వస్తాయి. క్వార్టర్ నంబర్ D14. ఇంటి ముందు రేగి చెట్టూ, సీమచింతకాయ నీరేడు చెట్లు, సందు చివర కొండ మామిడి చెట్టు... దాని మొదట్లో మేం కట్టుకున్న బొమ్మల ఇళ్ళు ఇవన్నీ మళ్ళీ చెప్తా…
 

No comments