నిర్లక్ష్యమో నిర్భయత్వమో..

నిర్లక్ష్యమో, నిర్వేదమో.. అన్నిటికీ మించిన ధిక్కారమో..
ఏమో తన మనసులో ఏముందో నా స్నేహితురాలు కవిత మాత్రమే చెప్పగలదనుకుంటా. ఒకానొక సందిగ్ధంలో మంచీ చెడూ, ఆశా నిరాశ, దుఃఖం ద్వేషాల మధ్య మనసు నలిగిపోతున్న ఈ క్షణంలో కవిత వేసిన ఈ చిత్రం నన్ను వెంటాడింది.
నిర్లక్ష్యమో 
నిర్భయత్వమో..
యాతనలన్నిటిని తోసేస్తూ 
బ్రతుకుని యథాతథంగా జీవించడమో
ఆ హద్దో 
ఈ హద్దో 
మరణానికి, మహానందానికీ 
మధ్యన గీస్తున్న సరిహద్దో
ఉన్మాదమో 
ఉద్వేగమో 
దేహాన్నీ గేహాన్నీ ధిక్కరిస్తూ
మోక్షానికి రాస్తున్న సరికొత్త నిర్వచనమో
అనకానేక నిబంధనలు 
వేలాడదీయబడ్డ లోకంలో 
లోక నియమాలని నిరాకరిస్తూ 
ఆనందాన్ని ఔపోసన పట్టేసే మంత్రమేమో అది
***
తనను తను నింపుకుంటున్నంతమేరా 
విస్తరిస్తున్న తేజమొకటి 
ఒక మర్మాన్ని విప్పుకుంటూ 
పల్చగా లోకాన్ని వెలిగిస్తున్న చప్పుడు 
నన్నో మెలకువలోకి తెస్తుంది


No comments