సాహిల్ వస్తాడు

నిన్న సాహిల్ వచ్చాడు. వస్తూ వస్తూ వాసు (పారిజాత శరత్ చంద్ర) జ్ఞాపకాల్ని కూడా మోసుకొచ్చాడు. ఒక దశాబ్దం పాటు నేనూ తనూ ఒక ఆత్మలా కలిసి ఉన్నాం. మా అమ్మా నాన్న తనకి కూడా అమ్మా నాన్నలే. వాసు వాళ్ళ అమ్మగారు నాకు కూడా అమ్మ. అలానే నాకు అత్యంత ఆప్తులైన సత్యవతి అమ్మ తనకి అమ్మ అయింది. తనకి చాలా చాలా ఇష్టమైన Afsar Mohammed నాకు అన్నయ్య అయ్యారు. 
దాదాపు అయిదేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతిలో "సాహిల్ వస్తాడు" చదివినప్పుడు, బహుశా అప్పుడప్పుడే తను అఫ్సర్ వాక్యాలని చదవడం మొదలు పెట్టాడు. అఫ్సర్ అఫ్సర్ అని కలవరించేవాడు. ఆయన రాసిన ప్రతీ వాక్యాన్ని తనదే అన్నంతగా ఇష్టపడేవాడు.
బాబ్రీ సంఘటన తర్వాత సమాజంలో గాలిలో కలిసిపోయినంత సహజంగా మత విద్వేషమనే కాలుష్యం ఎలా కలిసిపోయిందీ అని విడమర్చి చెప్పేవాడు. విఛ్ఛిన్నమైపోయిన మైక్రో లెవెల్ ఎమోషన్స్‌ని ఇలాంటి సాహిత్యమే చర్చ లోకి తెస్తుంది అనేవాడు.
Afsar అన్నయ్యా మీరు అతన్ని కలవలేదు. ఈ బాధ నాకు ఎప్పటికీ ఉండిపోతుంది. ప్రేమించబడడం చాలా గొప్ప అనుభూతి అన్నయ్యా.... కొన్ని నిర్లిప్తాలకి ఆ తర్వాత సంజాయిషీలు ఇచ్చుకోలేం.
వాసు ఎప్పుడూ కోట్ చేసే మీ సాహిల్ వాక్యాలు ఈ రోజు నన్ను మళ్ళీ దుఃఖం లోకి నెడుతున్నాయి.
" ఈ లోకం ఎలాంటిదో ఎంత చెప్పినా నీకు తెలియదు.
సీతాకోక రెక్కల మీద హరివిల్లుని తుడిచేస్తుంది
అవేవో కృత్రిమ రంగుల్ని చెక్కుతుంది.
పడమటి సంధ్యకి నెత్తురు పూసి రక్తపాతం అంటుంది"


No comments