రహస్య స్నేహిత!!

పోయిన ఆదివారం వంటంతా అయ్యాక, కిచెన్ సర్ది ఇద్దరం చెరో పుస్తకం పట్టుకు కూర్చున్నప్పుడు, ఏదో శబ్దం అయినట్లు అనిపించి వెళ్ళి చూసాం. ఏమీ కనిపించలేదు. సరే కాసేపు చూసి వెనక్కి వచ్చేసాక మళ్ళీ శబ్దం... వెళ్ళి చూస్తే ఏమీ కనిపించక పోవడం. ఇదిగో అలా మొదలయ్యింది ఆట. 
అక్కడ ఏదో జరుగుతోంది. ఎవరో దాగుడు మూతలు ఆడుతున్నారనిపిస్తోంది. కానీ దొరకలేదు. ఇంక బాబి గాడి చదువు అటకెక్కింది. జేంస్ బాండ్ అవతారం ఎత్తి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు. ఎవేవో శబ్దాలు రావడం... మనం వెళ్ళేటప్పటికి గప్‌చుప్. మొత్తానికి సోమవారం చిన్న హింట్ దొరికింది. ఎవరో అలమరాలో వేయించి పెట్టిన వేరుశెనగ గుళ్ళు చక్కగా మూతలాగి, తొక్కలు వలుచుకుని తింటున్నట్లు.. కిందంతా వేరుశెనగ పొట్టు. ఇక లాభం లేదని ఆ డబ్బా మీద కొంచం బరువు పెట్టాం. దొంగ గారు హర్ట్ అయ్యారనుకుంటా. ఇక అల్మరా అంతా విధ్వంసం. చిన్న చిన్న డబ్బాలన్నీ కిందకి లాగేసి పడేసినట్లు మొత్తం కంగాళీ అయిపోయింది.
చివరికి ఇంక లాభం లేదని మళ్ళీ వేరుశెనగ పప్పులు లూజ్ డబ్బాలో అందు బాటులో ఉంచి కాపలా మొదలు పెట్టాడు బాబీ. ఇదిగో నాలుగో రోజు దొరికిపోయింది. బహుశా మేమంటే భయం కూడా పోయిందనుకుంటా. చక్కగా వచ్చి రోజూ కాసిని పప్పులు తిని వెళిపోతోంది. మనుష్యులు తిన్నట్లే.. చక్కగా తొక్కలు వలుచుకుని తింటుంటే అసలు చూడడానికి రెండు కళ్ళూ చాలట్లేదు..బుజ్జి ఉడుత. భలే ఉంది ముద్దుగా.. నిన్న డబ్బా ఖాళీ అయిపోయింది. 
ఇదిగో అప్పుడు మొదలైంది అసలు కధ. ఇప్పుడు మేమంటే భయం పోయింది కదా. దానితో పాటు ఏదో హక్కులాగా.. ఈ రోజు మధ్యహ్నం దాని టైం కి వచ్చి డబ్బాలో పప్పులు లేవని ఒకటే గొడవ. గోల గోలగా అరుపులు. ఆ మాత్రం ఓ అరకేజీ పప్పులుంచితే నీ సొమ్మేమైన అరిగిపోతుందా అని దాని లాంగ్వేజ్‌లో నిలదీస్తున్నట్లు అనిపించి, ఇప్పుడే ఒక అరకేజీ కొనుక్కొచ్చి దాని డబ్బాలో పోసాం. 
ఇప్పుడు బాబి గాడంటే భయం కూడా పోయింది. మా ఎదురుగానే తోటలో కూర్చుని హాయిగా తింటూ ఇదిగో ఇలా దొరికింది వాడి కేమెరాకి. కొన్ని చిన్న చిన్న కాలక్షేపాలు భలే అనిపిస్తాయి కదా. వాటిని అలా గమనించడం.. చిన్న చిన్న ఆటలు ఆడుకోవడం ఎంత రిలాక్సేషన్ గా అనిపిస్తుందో...


No comments