స్వేఛ్చ

వోల్గా..
నేను జర్నలిజంలో పిజీ చేస్తున్నప్పుడు చదివా ఈ పుస్తకాన్ని. అప్పటికే దాదాపు అయిదారేళ్లు అయింది చతురలో పబ్లిష్ అయ్యి. అయినా అప్పటికీ ఫ్రెష్ గా ఒక డిబేటింగ్ పాయింట్ లానే ఉండేది. ఇప్పటికి కూడా!!
ఒక రకంగా నా దృక్పధాన్ని మార్చిన పుస్తకం "స్వేఛ్చ".
"FREEDOM IS THE RECOGNITION OF NECESSITY".... 
-- FRIEDRICH ENGELS.
స్వేచ్ఛ ఎవరో ఒకరు ఇచ్చేది కాదు. ఎవరి దగ్గరనుండో సాధించుకునేదీ కాదు...
మన అవసరాలనూ, మన ఉనికికి అత్యవసరమైన విషయాలను మనం గుర్తించడమే స్వేచ్ఛ. సామాజిక మార్పులు అనివార్యమైనపుడు ప్రజల్లో ఈ స్వేచ్ఛాకాంక్ష పుట్టుకు వస్తుంది. ఈ భావాన్ని అర్ధం చేసుకోకుండా, జీవితంలో స్వేచ్ఛని పొందకుండా, దానిని అనుభవించకుండా మనం ఎంత సాధించినా అసమానతలని ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చుకోవడమే...
కానీ దురదృష్టం ఏమిటంటే మనలో చాలా మందికి స్వేచ్ఛ అనే పదమే నచ్చదు. అందులోనూ స్త్రీ ఈ పదం వాడితే అదో పెద్ద భాద్యతా రాహిత్యమని చాలా మంది ఉద్దేశ్యం. 
సమాజం గురించి, తమ ఉనికి గురించి, సమాజంలో అసమానతల గురించీ ప్రశ్నించి.. సమాధానం వెతికే ప్రయత్నం చేసిన అరుణ కధ..." స్వేచ్ఛ". ప్రముఖ రచయిత్రి వోల్గా వ్రాసిన ఈ నవల దాదాపు 30సం.. క్రితం వచ్చింది. స్త్రీవాద భావాలు కొత్తగా పరిచయం అవుతున్న ఆ రోజుల్లో ఈ నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అంతవరకూ చర్చించకుండా వదిలేసిన ప్రశ్నల్ని.. ఒక అమ్మాయి అడిగితే చాలా మంది ఉలిక్కి పడ్డారు. 
చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నా.. ఇంటా బయటా ప్రత్యక్ష పరోక్ష అణిచివేతలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆధునిక స్త్రీ జీవితాన్ని, ఆమె ఉనికికి అర్ధాన్ని ప్రశ్నించే "అరుణ" పాత్ర మనలో కలిగించే సంఘర్షణ మాటల్లో చెప్పలేం.. ఆమె భర్తని ప్రశ్నించి ఊరుకోదు. సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న కొన్ని సంఘాలలో ఆడవారిపట్ల, వారి పాత్ర పట్ల ఉన్న అభిప్రాయాలను ప్రశ్నిస్తుంది. తనను వ్యక్తిగా కాక ఒకరి భార్యగా.. స్త్రీగా మాత్రమే చూసిన సమాజాన్ని ప్రశ్నిస్తుంది. 
"LIBERTY.. EQUALITY.. FRATERNITY" ... అని ఒక ఫ్రెంచ్ విప్లవ నినాదం ఉంది. ఈ మూడింటికీ ఒక వరస ఉంది. అయితే చాలా మంది స్వేచ్ఛ.. సమానత్వం ఒకటే అనుకుంటారు. సమానత్వం పాటిస్తే స్వేచ్ఛ దొరికినట్లే అనుకుంటారు. స్త్రీవాదం అనగానే అది పురుషులకు వ్యతిరేకమనే భావన కూడా చాలామందికి ఉంటుంది. వీటన్నింటికీ సమాధానం "స్వేచ్ఛ" నవల...
ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని తమ దృష్టిని సమాజ సమస్యల వేపు మళ్ళించే సమయంలో ఒక స్త్రీ పడే క్షోభ.. ఎదుర్కునే సమస్యల ప్రతిబింబం ఈ పుస్తకం.


No comments