ఒక కోయిల- ఒక మాంజా..

మా ఇంటి ముందు రావి చెట్టు మీద సీజన్ తో సంబంధం లేకుండా కోయిల పలకరింపులు మామూలే. వాటి పాట వినిపించినప్పుడల్లా మేమూ పాడడం, అవి ఇంకాస్త రెచ్చి పోయి గొంతెత్తి పాడడం చివరికి నేనూ , భరద్వాజ ఓడిపోయామని ఓ దణ్ణం పెట్టి లోపలకి వచ్చేయడం.. ఆదివారాలు ఇదొక సరదా మాకు.
కాని, ఈ రోజు శబ్దం చాలా తేడాగా వినిపించింది. బాధతో కేకలా ఉంది. తీరా చూద్దుం కదా.. కొమ్మలో చిక్కుకు పోయి ఉందది. గిల గిలా కొట్టుకుంటోంది. ఒక కర్ర తీసుకు వచ్చి కొమ్మ కదిలిస్తే కింద పడుతుందేమోనని ఎంతో ట్రై చేసాం. సన్నటి దారం లో దాని కాలు ఇరుక్కు పోయింది. కొమ్మ చాలా ఎత్తులో ఉంది. ఎంత ట్రై చేసినా మా వల్ల కాలేదు. కాసేపటికి ఇంక ఆ కోయిల ఓడిపోయింది. కదలికా ఆగిపోయింది. నిస్సహాయంగా లోపలికి వచ్చేసాం.
కాసేపటికి మళ్ళీ అలికిడి మొదలయింది. ఈసారి ఇంకేదో కొంచం పెద్ద పక్షి. మళ్ళీ అదే కొమ్మకి ఇరుక్కు పోయింది. హృదయవిదారకంగా అరుపులు. అది గిల గిలా కొట్టుకుంటుంటే మా ఇద్దరికీ దుఖఃం వచ్చేసింది. ఇంక ఆగలేక వాచ్‌మేన్ కి కబురు చేస్తే మొత్తానికి ఎక్కడినుంచో పళ్ళు కోసేది పెద్ద కర్ర తెచ్చాడు. దానితో కొమ్మ విరగ్గొట్టి దారం తెంచేసాక పెద్ద పక్షి చిక్కులోంచి బయటకొచ్చింది. కాసేపు వేరే కొమ్మ మీద సేద తీరాక హాయిగా ఎగిరి పోయింది.
ఆ తర్వాత ఆ దారం ఏమిటా అని చూస్తే గాలి పటాల మాంజా అది. కింద చూడండి.. క్లియర్ గా కనబడుతోంది బ్లూ కలర్ దారం. పైగా షార్ప్ గా ఉండడానికి ఇప్పుడు నైలాన్ దారాలూ వాటికి గ్లాస్ కోటింగ్స్ కూడా అట. ఎంత ప్రమాదం కదా.
గాలి పటాలు ఎగరేయడం సరదా.. సాంప్రదాయం.. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇలా పక్షులూ… , మనుష్యులూ ప్రమాదాల బారిన పడకుండా చూస్తే బాగుండు కదా. జనావాసాలకి, ఇలా చెట్లకీ దూరంగా ఆడుకుంటే మంచిది కదా.
ఇప్పుడొచ్చే ఈ గ్లాస్ కోటింగ్ మాంజాల వల్ల జరిగిన ప్రమాదాల గురించి అప్పుడప్పుడూ పేపర్ లో చూస్తూనే ఉన్నాం… మాంజా తగిలి బైక్ మీద వెళ్ళే ఎవరి గొంతో తెగిందని… మేడ మీద మాంజాలు ఎగరవేస్తూ పిల్లలు పడిపోయారని…
ఆటలు మానసిక ఉల్లాసానికి ఎంత అవసరమో వాటిని ప్రమాదాల బారిన పడకుండా ఆడుకోవడమూ అంతే అవసరం కదా… అందుకే పతంగులు దగ్గరలో ఉన్న మైదానంలాంటి ప్రదేశాలకి వెళ్లి ఎగరవేస్తే అందరకీ ఆనందమే… అది కూడా మామూలు దారాలతో ఉండే గాలి పటాలే తప్ప… గ్లాస్ కోటెడ్ దారాలతో మాత్రం కాదు…
ఎందుకంటే వాటి తో ఆట ప్రాణాలతో ఆడే చదరంగపు ఆట…

No comments