మెటామార్ఫసిస్‌ (రూపాంతరం) – ఫ్రాంజ్‌ కాఫ్కా

కొన్నిసార్లు కథ లోపలి కథల్లోకి వెళ్ళి చూడాలి.
అవును…
ఎందుకంటే కొన్ని కథలు ఎప్పుడూ చదివే కథల్లా ఉండవు. కథ వెనుక చెప్పబడిన కథ (కథలు అనాలేమో) ఎవరెవరి మనఃస్థితిని బట్టి వారికి చేరువవ్వటం ఎన్నిసార్లు జరుగుతుంది. అలా రాయగలగాలంటే అంతర్లీనంగా రచయిత మనసులో ఎన్ని వేల పాత్రల సంఘర్షణ కొనసాగుతూ ఉండాలి. అలాంటి రచయితలు అసలు ఎందరుంటారు? ఎందరుండనీ… అలాంటి రచయిత పేరు ఒకటి చెప్పాల్సి వస్తే మొదటగా మనకి స్ఫురించే పేరు ఫ్రాంజ్‌ కాఫ్కా.
అలాంటి రచనల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫ్రాంజ్‌ కాఫ్కా రాసిన ‘మెటామార్ఫసిస్‌’ పుస్తకాన్ని. దీన్ని తెలుగులో ‘రూపాంతరం’ పేరుతో మెహర్‌ అనువదించారు.
ఒక రూపాంతరం, మనిషి – మనిషి రూపంలో కనపడని ‘అంతరాల’ని ఏ విధంగా బయట వేస్తుందో మనకి అనుభవమయ్యే కథ ఇది.
ఇందులో కథగా చెప్పాలంటే ఏమీ ఉండదు… గ్రెగర్‌ జమ్జా అనే ఒక సేల్స్‌మాన్‌ రాత్రికి రాత్రి ఒక కీటకంగా మారిపోవటంతో అతని కుటుంబ దృశ్యం ఏ విధంగా రూపాంతరం చెందింది అన్నదే ఈ పుస్తకం. అలా కీటకంగా మారే అతనికి తన ఇంట్లో అమ్మ, నాన్న, చెల్లి అప్పుడప్పుడూ పనిమనిషి, చివరిలో ఆ ఇంట్లో ఆద్దెకు దిగిన కుర్రవాళ్ళ మధ్య జరిగిన రోజువారీ అనుభవాలే ఈ కథ. నిజంగా ఇందులో చెప్పుకునేంత కథేమి ఉందని అనిపిస్తుంది కదూ…
కానీ ఒక్కసారి దీన్ని చదివి చూడండి. మీకు మీరే ఒక కథగా మారిపోయే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రతివాళ్ళూ ఒక పాత్రగా మారి మిమ్మల్ని ఎడ్యుకేట్‌ చేస్తున్న అనుభూతి ఒకటి అనుభవమయ్యే అవకాశమూ ఉంటుంది.
”గ్రెగర్‌ జమ్జా ఒక ఉదయం కలత కలల్నించి నిద్రలేచేసరికి, మంచంపై తానో పెద్ద కీటకంగా మారిపోయి
ఉన్నాడని గమనించాడు” అనే వాక్యంతో మొదలయ్యే ఈ పుస్తకం అడుగడుగునా మనలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో భావాలని కుదిపేస్తోంది.
నిజంగా ఒక మనిషి కీటకం అవ్వడం ఏమిటీ అని కొట్టి పారేస్తే… ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. అసలు కీటకంగా మారటమన్న ఒక ప్రతీకని రచయిత ఎందుకు రాశాడో అన్న ఆలోచనలోకి జారుకుంటూ పుస్తకంలోకి లీనమయితే… మీరు లీనమయ్యేది పుస్తకంలోనే కాదు.. మీ జీవితపు అంతరాత్మలో కూడా.
నువ్విప్పుడు ఏదీ చేయలేని తనంలో ఉంటే నీ వాళ్ళకి నువ్వెంత? అన్న ప్రశ్నకి ఒక సమాధానంలా అనిపిస్తుంది ఈ రచన. నిజంగా చెప్పాలంటే కాఫ్కా ఇందులో తనకు తానుగా ఏమీ చెప్పినట్లు అనిపించదు. మనలో అంతర్లీనంగా ఉన్న ఒక రచనని వెలికితెచ్చేలా చేసిన ప్రయత్నం అనిపిస్తుంది.
”నిజాయితీ నిబద్ధతలు కలవాడూ, ఒక ఉదయం గంటా రెండు గంటల ఆఫీసు సమయాన్ని వృధా చేసినందుకే మనస్సాక్షి చేత చిత్రవధకు గురై మతిభ్రమించి, చివరకు మంచంమీంచి లేవడమే కష్టమయ్యే పరిస్థితికి చేరుకునేవాడూ, అలాంటి వాడు ఒక్కడూ
ఉండడా?” అన్న వాక్యాల్లో గ్రెగర్‌ మనస్తత్వాన్ని చక్కగా విప్పిచెప్పుతూ, అలాంటివాడు తన బాధ్యతలని నెరవేర్చలేని నిస్సహాయ స్థితిలో
ఉన్నప్పుడు అతని కుటుంబసభ్యుల ప్రవర్తన ఏ విధంగా రూపాంతరం చెందుతూ వస్తుందో చదువుతుంటే మనలో ఎక్కడో తెలియని భయం.
గ్రెగర్‌ కీటకంలా మారి హాల్‌లోకి వచ్చినప్పుడు తన రూపం చూసి కర్రతో తనని వెనక్కి పంపడానికి అతని తండ్రి చేసిన హడావిడి, అంతకు ముందు ప్రేమగా పిలిచిన తల్లి మారిన అతని రూపం చూడగానే అతనికి దూరంగా పారిపోవడమూ, ఆఫీసు నుండి వచ్చిన పెద్ద గుమస్తా తన వస్తువులని వదిలేసి ఆ ఇంట్లో నుండి హడావిడిగా వెళ్ళిపోవటమూ… ఇదంతా చదువుతుంటే మనకి అర్థమయ్యేది ఏమిటి?
ఇక్కడ కీటకంగా మారడం అనేదాన్ని ఒక అంటువ్యాధికి ప్రతీకగా తీసుకుంటే… మనకి ఎంత దగ్గరి వాళ్ళయినా సరే ఆ సమయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారో అన్న విషయం ఎత్తి చూపినట్లు అనిపిస్తుంది.
నువ్వైనా, నేనైనా లేదా ఇంకెవరైనా సరే ఇప్పటివరకూ మనమెలా కనిపించామో అలా కనినిస్తేనే ప్రపంచం ఆమోదిస్తుంది. మనమీద ఏర్పరచుకున్న తమ అభిప్రాయాల పరిధిలోనే మనమున్నామన్న సంతోషం ప్రపంచానిది. వాళ్ళ అభిప్రాయాల్ని చెల్లాచెదురు చేసేలా మనం మారామా దాన్ని ఆమోదించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. అది మంచి అయినా, చెడు అయినా…
ఈ పుస్తకం నిండా చెప్పబడింది అదే… ఎక్కడా మనిషి అంతరంగాన్ని తొలచి మాటలు రాసినట్లు గానీ, అద్భుతమైన మానసిక విశ్లేషణ చేసినట్లు గానీ ఉండదు, కానీ తాను తీసుకున్న ప్రతీకని బట్టి మనమే దీనిలో ఉన్న అంతర్యం ఏమిటీ అని మనల్ని మనం తొలుచుకుంటూ వెళ్ళేలా చేస్తుంది ఈ ‘రూపాంతరం’.
ఇది చదివినంతసేపూ, మనది కాని జీవితంలో మనం బతుకుని కొనసాగించడం అన్నది ఒక జీవితపు పర్యంతపు బరువు అన్న అలికిడి ఒకటి మనలో చప్పుడు చేస్తూ ఉంటుంది.
జీవితానుభవాలని యధాతథంగా తర్జుమా చేసి రాస్తే అది మామూలు రచన అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ అనుభవాల భావాల్లో మనకి మనం ఒదిగిపోయిన కాలాలని కాగితం మీదకు చేరిస్తే మనిషి మనిషికీ దాని ప్రభావం, తమలో తాము మమేకమయ్యేలా ఒక తార్కికతని కలిగింపచేస్తుంది.
గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారటమన్న రూపాంతరాన్ని మనం ఆమోదించగలిగినట్లు అదే సీతాకోకచిలుక గొంగళిపురుగుగా రూపాంతరం చెందితే ఆమోదించగలమా? అలా ఆమోదించగలిగినంత మేలిమి వ్యక్తిత్వాలు ఈ లోకంలో వచ్చే రోజు వరకూ, మనలో ఈ ‘రూపాంతరం’ కలుగజేసే అలజడి మాత్రం అమేయం.
ఫ్రాంజ్‌ కాఫ్కా జర్మనీలో ఒక యూదు కుటుంబంలో పుట్టాడు. కాఫ్కా సున్నితత్వాన్ని, సిగ్గరితనాన్ని, ఆధారపడే మనస్తత్వాన్ని అతని తండ్రి ఎత్తి చూపించి కాఫ్కాని సందు దొరికినప్పుడల్లా కించపరిచేవాడు. తల్లేమో భర్త చాటు భార్య. తన బాల్యంలో తన అనుభవాల ప్రభావం కాఫ్కా రచనలపై తీవ్రంగా ఉండేది. కాఫ్కా రచనా ప్రక్రియ మన కలలను పోలి ఉంటుంది. మన కలలు ఏ విధంగానయితే మన బాధలను, సంతోషాలను చిత్ర విచిత్రమయిన దృశ్యాల ద్వారా ప్రతిబింబిస్తాయో కాఫ్కా రచనలు కూడా అలాగే
ఉంటాయి. క్షయ వ్యాధితో బాధింపబడిన కాఫ్కా నలభై ఏళ్ళ వయసులోనే 1924 జూన్‌ 3న కన్ను మూశాడు.

No comments