ఒక మనిషి ఒక ఇల్లు ఒక ప్రపంచం - జయకాంతన్

"దొరా, తలను లోపలికి పెట్టుకో. ఆడది తానమాడడాన్ని అలా చూస్తున్నావే..." కోపంగా చెప్పాడు దొరైకణ్ణు.
హెన్రీ నవ్వాడు. "మీరు అది మాత్రమే చూసారా? ఆ హేర్‌పిన్ వంపులో వస్తున్నప్పుడు.. ఒక తెల్లని లేగదూడ పెరిగెత్తిందే... కొండ పల్లంలో, పొలాల మధ్య, ప్రశ్నార్ధకంలాగా తోకను ఎత్తుకుని మన లారీ శబ్దానికి రెండు గెంతులు గెంతిందే.. పరుగెడుతూ ఆర్భాటం చేసిందే... దాన్ని చూసానే.. మీరు చూళ్ళేదా? లారీకి అడ్డుగా ఇంతకు ముందు కోతులు ఇటూ అటూ దుబ్బుదుబ్బుమని దూకుతూ పరుగులు తీశాయే.. దాన్ని చూసానే, మీరు చూళ్ళేదా..." 
ఎంత గొప్ప భావన కదా.. 
మనం ఏదైనా వెతుకుతున్నామనుకోండి మనం వెతుకుతున్న ప్రతీ చోటా అది ఉన్నట్లే భ్రమగా అనిపిస్తుంది. నాకు ఆఫీస్ లో Reconciliations చేసేటప్పుడు కూడా ఇదే అనుభవం. ఎక్కడైన తేడా వచ్చిన ఒక ఎమౌంట్ కోసం వెతుకుతుంటే ఏ షీట్ లో చూసినా ముందు ఆ ఫిగర్ కనిపిస్తుంది. 
చాలా సార్లు కొన్ని పుస్తకాల విషయంలోనూ అదే అనుభవం. ఒక పుస్తకం కోసం వెతుకుతాం. దాని కవర్‌పిక్ మన మనసులో ముద్రపడిపోయిఉంటుంది. 
మొన్న బుక్ ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు సాహిత్య ఎకాడమీ స్టాల్ లో అమృతసంతానం తీసుకుని బిల్ కడుతుండగా పక్కన లీలగా ఈ పుస్తకం కనిపించింది. మళ్ళీ ఒక సారి పరీక్షగా చూసాక అప్రయత్నంగా చిన్న కేక వచ్చేసింది. నా సంబరం చూసి ఆయన నవ్వి "మళ్ళీ ప్రింట్ చేసాం" అన్నారు. ఎప్పుడో ఇంగ్లీష్ వెర్షన్ లో ( A Man A home A world) చదివా ఈ పుస్తకాన్ని. 
మనం మన చుట్టుపక్కల ఉన్న మనుష్యుల్లో చాలా చూస్తాం. రక రకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, కొన్ని కల్మషాలు, కొన్ని విద్వేషాలు..
కానీ, అసలు ఇలాంటివేమీ లేని స్వచ్ఛమైన ఒక ప్రపంచం ఉంటే అది ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు.
ఇదిగో అలాంటి పుస్తకం "ఒక మనిషి ఒక ఇల్లు ఒక ప్రపంచం" ఇందులో పాత్రలన్నీ చాలా గొప్పవి. Idealistic Characters. 
కృష్ణరాజపురం అనే అందమైన ఊరు. ఆ ఊరి గుడి ధర్మకర్త సభాపతిపిళ్ళై. ఒకానొక విషాద సమయంలో ఎవరికీ చెప్పకుండా ఊరువదిలి మిలట్రీలో చేరతాడు. యుద్ధంలో చనిపోయిన స్నేహితుడికిచ్చిన మాట కోసం అతని భార్యతో సహజీవనం చేస్తాడు. యుద్ధ సమయంలోనే అనాధ అయిన హెన్రీని చేరదీస్తాడు.
తండ్రి చనిపోయాక అతనికి వారసత్వంగా ఇచ్చిన ఇల్లు, పొలం పత్రాలు తీసుకుని కృష్ణరాజపురం వస్తాడు హెన్రీ. అనాధ అయిన హెన్రీ ఒక మనిషి గా మొదలు పెట్టిన ప్రయాణం, ఒక ఇల్లు నుంచి ఒక ప్రపంచాన్ని ఎలా సృష్టించి ఇచ్చిందో చాలా హృద్యంగా చెప్తారు జయకాంతన్.
ఈ కధలో హెన్రీ, పప్పా, మమ్మా, దేవరాజన్, దొరైకణ్ణు, ఊరి మునసబు, అక్కమ్మ, చిలకమ్మ, చిన్న పిల్లవాడు మణికంఠ.. అందరూ గొప్ప మనుషులే. చివరికి ఆ ఊరిలో ఉన్న పిచ్చిపిల్లతో సహా. 
అసలు ఒకానొక ఊహా ప్రపంచంలో ఒక గొప్ప కల కంటున్నట్లు ఉంటుందీ పుస్తకం.


No comments