#SileruMusings-4

బాల@ సీలేరు. (కింద ఫోటోలో వంట చేస్తున్న ఆయన పేరు బాల. ఈ కధంతా ఆయన గురించే)
సీలేరు- చిత్రకొండ ప్రయాణం అనుకోగానే చాలా సంతోషాల మధ్య కొంత కలవర పెట్టిన విషయం సీలేరులో ఎక్కడ స్టే చేయాలి అని. 
చిత్రకొండలో ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఉద్యోగులంతా రిలీవ్ అయిపోయారు. అక్కడ లోకల్ గా ఉన్న కాంటాక్ట్ మిశ్రా మౌసీ కుటుంబం ఒక్కటే. వాళ్ళు కూడా తర్వాత జైపూర్ వెళ్ళిపోయారు.
సరే అని సీలేరు ప్రయాణం గురించి ఫేస్‌బుక్ లో స్టేటస్ పెట్టాను. శిల్ప వాళ్ళ అన్నయ్య రవి ఒక కాంటాక్ట్ ఇచ్చారు. తర్వాత రేవతి ద్వారా గౌతం కాశ్యప్ గారు బాల నంబర్ ఇచ్చారు. 
మేం దారకొండ దాటగానే బాల గారికి కాల్ చేసాం. 
మేం కారు దిగుతుంటే నవ్వుతూ ఎదురొచ్చాడతను.
"బాగా ఆలస్యం అయిపోయిందండి. దారిలో ఏమన్నా ఇబ్బంది పడ్డారా" ఆప్యాయంగా మా చేతుల్లో సూట్‌కేస్ అందుకుని బోయ్‌ని కేకేసి అతనికి అందించి, మమ్మల్ని రూం లోకి తీసుకెళ్ళాడు.
"ఈ అమ్మాయి ఇక్కడ పెరిగిన అమ్మాయే, కొండ పిల్ల " నా సహచరుడు నన్ను ఆట పట్టిస్తూ చెప్పారు.
రూం లో సామాన్లు పడేసి బయటకి వచ్చి లాన్‌లో ఉయ్యాలలో కూర్చుని చుట్టూ చూసి మైమరిచిపోయాం.
అసలు సీలేరు అందమంతా అక్కడే ఉందా అన్నట్లు అనిపించింది. విరగపూసిన , అరచెయ్యంత గులాబీలు.. రంగురంగుల డాలియాలు. ఇంకా బోలెడు పూలు గుత్తులు గుత్తులుగా ఒక క్రమ పద్దతిలో ఎంత అందంగా ఉన్నాయో.
ఇవి కాక బుల్లి బుల్లి క్యాలీఫ్లవర్ మొక్కలు.
మధ్యలో ఒక బుజ్జి కొలను. అందులో వేణువూదుతున్న కృష్ణుడు.
చిన్నప్పటి జ్ఞాపకాలు అలలు అలలుగా మనసుని తాకి వెళ్తున్నాయి.
ప్రపంచం మర్చిపోయి అక్కడి అందాల్లో లీనమైపోయిన నన్ను "మిమ్మల్ని ఇంతకు ముందు బాగా చూసానమ్మా" అంటూ దగ్గరకి వచ్చాడు బాల.
చెప్పొదూ.. నాకు కొంచం విసుగ్గా అనిపించింది.(నాగరీకపు అపనమ్మకం) బిజినెస్ టెక్నిక్..అసలు అతను నన్ను ఎక్కడ చూస్తాడు?. ఎందుకు చూస్తాడు.? 
ఇలాంటి వాళ్ళని మనం ఎంత మందిని చూసి ఉంటాం.!! 
తెచ్చిపెట్టుకుని నవ్వుతున్న నన్ను... 
"నరసయ్యగారి పిల్లలతో కలిసి చదువుకున్నారా" అని అడిగాడు.
ఉలిక్కి పడ్డాను. 
నారాయణ నరసయ్య అంకుల్!!
వాళ్ళమ్మాయి శిల్ప! నాకు 6వతరగతి క్లాస్‌మేట్. అక్క తర్వాత నా మొదటి స్నేహితురాలు. 
అవునని నేను ఆశ్చర్యంగా తల ఊపుతుండగానే గల గలా చెప్పడం మొదలు పెట్టాడు.
అప్పట్లో వాళ్ళ నాన్నగారికి కూరగాయల దుకాణం ఉండేదట. శిల్ప వాళ్ళ అన్నయ్య రవి, తమ్ముళ్ళు నరేష్, సురేష్ .. అందరూ గుర్తున్నారు అతనికి.
అంతకన్నా నన్ను గుర్తు పట్టడం అదీ దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత... 
ఇంక అక్కడ సీలేరులో ఉన్న రెండురోజులూ ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో చెప్పలేం. మీరెవ్వరైనా సీలేరు వెళితే బాలజి రెసిడెన్సీకి వెళ్ళండి. సీలేరు అందాలతో పాటు బాలా మీకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం అయితీరతాడు.
చిత్ర కొండ వెళ్ళి వచ్చేటప్పటికి మంచి కాంప్‌ఫైర్ ఏర్పాటు చేసాడు. 
పొద్దున్నే సీలేరు డాం దగ్గర సూర్యోదయం చూడడానికి వెళ్ళాం. ఆంధ్రా ఒడిషా బోర్డర్ అది. అక్కడ రెండు రాష్ట్రాల పోలీసులు ఉంటారు. చెక్ పోస్ట్ దగ్గర సెక్యూరిటీ ఫార్మాలిటీస్ అయ్యాక బారేజ్ మీద కూర్చుని సూర్యుడి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టాం. అదొక గొప్ప అనుభూతి. అడవుల్లో చెట్ల మధ్య దాగుడు మూతలాడుతున్న సూర్యుడు ఒక పట్టాన దొరకలేదు మాకు. మొత్తానికి బ్రతిమిలాడించుకుని 7.30 కి మమ్మల్ని తన కిరణాలతో అలరించాక వెనక్కి వచ్చి, మేం చదువుకున్న స్కూల్‌కి వెళ్ళి సరదాగా కాసేపు గడిపి వచ్చేసాం. సీలేరు అస్సలు ఏమీ మారలేదు. అవే ఇళ్ళు, ప్రతీ ఇంటి ముందు గుత్తులు గుత్తులుగా గులాబీలు, డాలియాలు. ప్రతీ క్రాస్ రోడ్ చివర్లో పెద్దపెద్ద చెట్లు.. చెట్లకింద సిమెంటు చప్టాలు. అదే ప్రశాంతత . 
మంచి హోంలీ ఫుడ్. శుభ్రమైన వాతావరణం.
అన్నిటికన్నా ఎక్కువగా.. మనకి దగ్గర ఉండి కొసరి కొసరి తినిపించే బాలా.
మనం సీలేరు అడవుల్లో తిరిగి మనసు నింపుకుంటే చాలు. మన కడుపు నింపే పని బాలా చూసుకుంటాడు. 
ఇంకా నాగరీకత అంత అంటని స్వచ్చమైన మనసులు అవి. 
తిరిగి వచ్చేటప్పుడు దారిలో తినడానికి బాలా ప్రేమగా వండి పెట్టినవి తీసుకుని, మా మనసుల్ని మాత్రం అక్కడ వదిలేసి తిరిగి వచ్చేసాం.

No comments