బక్ !! ఒక కుక్క కధ.. జాక్ లండన్ (తెలుగు : ఎ. గాంధి)

“I'd rather sing one wild song and burst my heart with it, than live a thousand years watching my digestion and being afraid of the wet.” 
ఎంత గొప్ప థాట్ కదా. జాక్ లండన్ అలాగే బతికాడు. 
వైజాగ్ బుక్ ఫెస్టివల్ లో కధాప్రపంచంలో కొనుక్కున్నా ఈ పుస్తకాన్ని. ఇప్పటికి చదవడం మొదలుపెట్టా. 
బక్ ఒక కుక్క కధ. తోడేలు జాతికి చెందిన అందమైన, బలమైన బక్.. విధివశాత్తూ తన విలాసవంతమైన జీవితంలోంచి అతి హీనమైన జీవితంలోకి ఎలా జారి పడిందీ.. బతుకు నేర్పిన కర్కశమైన పాఠాల్నించి అది ఎంతెంత నేర్చుకుందీ.. కళ్ళకు కట్టినట్లు చెప్తాడు రచయిత.
పాపం బక్ పత్రికలు చూడదు. చూసినట్లయితే తనకూ తనలాగా బలమైన కండలూ, ఒంటిపైన జూలూ ఉన్న కుక్కలకు కష్టాలు రాబోతున్నాయని తెలుసుకుని ఉండేది. అలస్కా ప్రాంతంలో మనుష్యులకు బంగారం దొరకడం... బక్ లాంటి ప్రాణులపాలిట నరక ప్రాయం అయిపోయింది. జడ్జి గారింట్లో విలాసవంతమైన జీవితం అనుభవించిన బక్ , అక్కడ పని వాడైన మాన్యూల్‌ని నమ్మి మోసపోతుంది.
అసలు ఇక్కడే కధ భలే ఉంటుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అణుగుణంగా బక్ తనను తాను మలచుకోవడం గొప్పగా అనిపిస్తుంది.
జడ్జీగారింట్లో ఉనంత వరకు తన దర్పాన్ని, శౌర్యాన్ని నమ్ముకున్న బక్ , చేతులు మారి యజమాని మారాక ఎదురు తిరిగి పోరాడినంతవరకూ పోరాడుతుంది. ఇక తప్పదనుకున్నాక, తన తిరుగుబాటు ఎంత న్యాయమైనదైనా దెబ్బలు తినక తప్పదనీ అర్ధం అయ్యాక.. బతకడం కోసం ఎన్ని ఎత్తులు వేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ నేర్చుకుంటుంది. అన్ని చేతులు మారీ.. జాన్ టారంటన్ దగ్గరకి చేరినప్పుడు మాత్రం.. 
అక్కడ అసలు ప్రేమ అంటే అర్ధం అయ్యాక.. అప్పటిదాకా తాను కోల్పోయిన ప్రేమ పొందడం మొదలెట్టాక, యజమానిని పిచ్చిగా ప్రేమిస్తుంది. అప్పుడే అడవిలోంచి వచ్చిన పిలుపులూ.. ఆ పిలుపులు విన్నప్పుడు దానిలో రేగే వెర్రి ఆవేశం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేం. పుస్తకం చదవాల్సిందే.
చివరికి, వేటగాళ్ళ చేతుల్లో తన యజమాని చనిపోయాక రాక్షసిగా మారిపోతుంది. అక్కడ శిబిరాల్లో దొరికిన వేటగాళ్ళను దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపేస్తుంది. ఇంత రాక్షసి గా మారిన బక్ ప్రతి వేసవి లోనూ ఆ లోయలోకి వచ్చిఅక్కడ తన యజమాని చనిపోయి బంగారం నేలలోకి ఇంకి పోయి గడ్డి మొలిచిన ఆ ప్రాంతాల్లో ఎవర్నో గుర్తు చేసుకుని సుదీర్ఘంగా ఏడ్చి వెళ్ళి పోతుంది. 
పుస్తకం మొత్తం బక్ కధే. బక్ ఒక కుక్క కధే కాదు. మనలో చాలా మంది కధ. అవకాశం ఉన్నప్పుడు దర్జా వెలగ బెట్టడం. పరిస్థితులు దిగజారినప్పుడు లొంగి ఉండడం, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తమలో నిద్రాణంగా ఉన్న పశుప్రవృత్తిని నిద్రలేపడం... ఇవన్నీ రచయిత ఒక కుక్క పాత్రలో పెట్టినా.. అంతర్లీనంగా మనుష్యుల గురించి చెప్పినవే.


No comments