శరత్‌కాలపు వెన్నెల!!

శరత్‌కాలపు వెన్నెల!!
పగలంతా లెక్కలు ఎక్కాలతో అలసిన మనసుకి ఈ సాయంత్రపు నీలి వెన్నెల ఎంత ఆహ్లాదాన్నిస్తోందో తెలుసా...
పగటి చిరాకులన్నీ ఒక్క సారి మాయం అయిపోయిన ఫీలింగ్. 
ఎండకి దాహపడి ఇప్పటి దాకా చిర్రుబుర్రులాడుతున్నట్లున్న ఆకాశం ఇప్పుడు చూడు ఎలా ఉందో… 
చందమామ సద్దుచేయగానే దప్పిక తీరేమార్గం దొరికిందని కాబోలు ఎవరో మంత్రం పెట్టినట్లు ఆకాశం అంతా ఒక్క సారి మారిపోయింది.
బాదం పూత కింద రాలి ఇసకలో అలా అలా పరుచుకుంది. పైన నక్షత్రాలిలా కిందకి రాలి పడ్డాయా అన్నట్లున్నాయి బాదం పూలు . నగ్నపాదాలతో వాటిమీద నడుస్తుంటే చిన్ని చిన్ని నక్షత్రాల మీద నడుస్తున్న అద్భుతమైన ఫీల్. చెప్పటం కన్నా ఆ ఫీల్ లోకి వెళిపోతేనే నా ఈ ఆనందం అర్థం అవుతుంది.
ఇక్కడ ఇలా తోటలోని బాదం చెట్టు వైపుకి వస్తూ అలా రోడ్డు మీదకి చూడగానే ఒక చిన్న అసూయ… రోడ్డుకి అటువైపెళ్ళే దీపాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా అని … అవును మరి అవి నీ వైపొస్తున్నాయి… అంతలోనే చిన్న ఊరట. నేనున్నదీ అక్కడ కాదా అని...
ఇలా బాదం చెట్టు కింద ఊయలలూగుతూ.. బాదం ఆకుల మధ్య దోబూచులాడుతున్న వెన్నెల చూడడం ఎంత అందమైన అనుభూతి. అలా చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పనా…
ఆకాశం రాసే వేవేల తైలవర్ణ చిత్రాలు కళ్ళ ముందు అలా సాగిపోతుంటే, ఎవరో రచించే చిత్రాల కోసం కోట్ల కుమ్మరించే వాళ్ళని తలచుకుని ఒకింత జాలి పుడుతుంది నాకు. ఉచితంగా క్షణానికో కొత్త చిత్రం కళ్ళ మీద కొత్త నవ్వుని లిఖించే అవకాశం ప్రతి మనిషికీ ఉన్నప్పుడు నాదేనంటూ స్వార్థపడి స్వంతం చేసుకున్న ఒక్క చిత్రం ఏమిస్తుంది ఎవరికైనా..… ఎప్పుడెవరు దోచుకెళతారో అన్న భయాన్ని తప్ప.
బహుశా నేను నీ గురించి ఆలోచిస్తున్నాని అర్ధం అయినట్లుంది. ఆకాశరాజు చంద్రుణ్ణి చెట్టు కొమ్మల నడుమ దాక్కొని, తన వెన్నెల దాహం తీరేంత వరకూ కాస్త చీకటి చేయమన్నట్లున్నాడు.
నువ్వొచ్చినప్పుడల్లా నా చుట్టూ ముసురుకుంటున్న చీకటిని దోచుకుని వెళ్ళిపోతావ్…
అందుకే నువ్వున్న కాలం కొన్ని ఘడియలైనా అదే ఆనందం నాకు 
ఏ కాలమైనా అవ్వనీ… అసలు నీకూ నాకూ దూరమెంతనీ… ఒక్క తుషారపు వేడి చప్పుడంత. అవును మరి! అంతే కదా… అనుకోగానే ఇట్టే కరిగేపోయే దూరాన్ని ఇంకెలా చెప్పాలి!!…
నువ్వేసి వెళ్లే వెన్నెల ముద్రలు, నీ ఆచూకీని నాలోనే గాఢంగా ముద్రించి వెళతాయ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకోగలను నిన్ను… తలచుకున్నప్పుడల్లా ప్రకృతివై నీ స్పర్శతో పలుకరిస్తావ్.
ఇదిగో... ఇప్పుడూ అదే తెలుస్తుంది. ఇంత అందమైన ప్రశాంతతలో మెత్తటి అడుగుల సవ్వడి. నువ్వొస్తున్నావా? తలెత్తి చూడాలన్న ధ్యాస కూడా లేదు నాకు. వస్తున్నావన్న ఆశ ఎంత అందంగా ఉంటుందో తెలుసా. రావన్న బెంగా అంతే కష్టంగా ఉంటుంది.
ఆశ, నిరాశల మధ్య జీవితం ఎప్పుడూ ఒక డోలాయమానమే. కానీ అదే జీవితం లో ఒక కదలికా, ఒక జీవం ఇస్తుందన్న ఫీలింగ్.
చిక్కని నీలం వైపు సాగుతున్న నీ అడుగుల సవ్వడికి నా అడుగులని జత చేస్తూ అలా ఒక్క సారి తడి ఇసుక మీద నిశ్శబ్దపు ధ్వనులని రాస్తూ వెళ్ళటముందే… అదేమిటో తెలుసా… ఇష్టంగా నేను రాసుకుంటున్న విశ్రాంతి… 
నేస్తమా.. ఒక్కసారి వచ్చి వెళ్ళు..


No comments