#SileruMusings-2

"సీలేరు 90Kms" మైలు రాయి కనిపించగానే మనసు ఉద్వేగంతో ఊగిపోయింది..!!
నవంబరు మొదటి వారంలో లంబసింగి బయలుదేరాం.
పొద్దున్నే నాలుగు గంటలకి వైజాగ్‌లో బయలుదేరి, దాదాపు 6 గంటల కల్లా లంబసింగి చేరుకున్నాం. అక్కడ సూర్యోదయం ఆశ్వాదించి, వలిశ పూల తోటల్లో కాసేపు కూర్చున్నాం.
చిక్కటి మంచును చీల్చుకుంటూ సూర్యుడు...
ఎదురుగా మీటర్ దూరంలో ఉన్న మనుష్యులు కూడా కనిపించనంత మంచు. నెమ్మదిగా చీల్చుకోస్తున్న వెలుగులో వలిశ పూల తోటలు. తెల తెల్లని మంచులో, పచ్చని ఆకులు.. పసుపు రంగు పూలు!! 
అద్భుతమైన ఫీలింగ్ అది. ఇంకా నాగరీకత అంతగా సోకని స్వచ్ఛమైన మనుష్యులు. కొండ అంచులో గడ్డి మీద హాయిగా నేలమీద కూర్చుని ఆకాశం వేపు, అడవి వైపు ఎంత సేపు చూస్తూ కూర్చున్నామో తెలీదు. 
ఎంత ప్రశాంతతో. 
In every moment, we are part of the infinite Stories that the universe is telling us and and that we are telling the Universe..." అన్న Ben Okri మాటలు గుర్తుకు వచ్చాయి.
సర్వం మరచి అలా చూస్తుంటే, నిజంగా అడవి తల్లి ఎన్నో కబుర్లు చెప్తున్నట్లే అనిపించింది. ఎంత కూర్చున్నా తనవి తీరదని తెలుసు. ఇక తప్పదని అక్కడనుంచి లేచాం.
9 గంటలకి ఏమన్నా టిఫిన్ తిందామని లంబసింగి సెంటర్‌కి వచ్చినప్పుడు అక్కడ కనిపించింది.
"సీలేరు 90Kms" మైలు రాయి. ఇంక నా మనసు నా మాట వినడం మానేసింది. 
ఎప్పటి జ్ఞాపకాలు! దాదాపు 30 సంవత్సరాల క్రితం బంగారు బాల్యం గడిపిన రోజులు!! 
90 కిలోమీటర్లు అంటే దాదాపు గంటన్నర అంతేగా.. అనుకున్నా. వెళ్దాం వెళ్దాం .. అని పోరు మొదలు పెట్టాను. 
అయితే Permutations and Combinations సరి చూసుకున్నాక జనవరి 13న బయలుదేరాం. సీలేరు చిత్రకొండ.. వయా లంబసింగి. 
మొత్తం మూడు రోజుల ప్రయాణం. ఇంటి దగ్గరే ముందు ఒక రెండు రోజులకి సరిపడా ఫుడ్, మంచినీళ్ళ బాటిల్స్ ఒక బాక్సు. ఎక్కడైనా తోటల్లో కూర్చోవడానికి వీలుగా రెండు చాపలు. మొత్తం సరంజామాతో సరదా సరదాగా ప్రయాణం మొదలైంది.
నవంబర్ లో వెళ్ళినప్పుడు వలిశ పూల తోటలు ఎంత అందంగా ఉన్నాయో. జనవరిలో వెళ్ళేటప్పటికి వాటి సీజన్ అయిపోయింది. తోటలన్నీ చదును చేసేసారు. అంత మంచు కూడా లేదు.
అయితే ఈ సారి స్ట్రాబెరీ తోటలు మాత్రం మంచి కాపులో ఉన్నాయి. రెండు నెలల కిందటి , పసుపు, పచ్చని అందాలు... ఈ సారి వర్ణం మార్చుకుని స్ట్రాబెర్రీ రూపంలో కనిపిస్తుంటే భలేగా అనిపించింది. నేల మీద అరడుగు ఎత్తు కూడా లేని తీగెలాంటి సున్నితమైన స్ట్రాబెరీ మొక్కలు ఎంత బాగున్నాయో. తెల్లని పూలు.. వాటి మధ్యలో ఆకుపచ్చని స్ట్రాబెర్రీ పిందలు. పండిన తర్వాత అందమైన ఎర్రని పళ్ళు.
ప్రకృతి తన దశలన్నీ కళ్ళముందు పరచినట్లు అనిపించింది. 
ఆ అందాలన్నీ దాటుకుని.. నన్ను రెండు నెలలుగా నిలువ నీయ కుండా చిన్నప్పటి జ్ఞాపకాలను తట్టిలేపిన "సీలేరు 90Kms" మైలు రాయిని చేరుకుని సీలేరు ప్రయాణం మొదలుపెట్టాం.
సీలేరు, చిత్రకొండ అడవుల్లోకి ప్రయాణం..
కాఫీ తోటల ముచ్చట్లు,
చిత్రకొండలో చేసిన జ్ఞాపకాల కవాతు..
మళ్ళీ చెప్తా..

No comments