మహీ మ్యూజింగ్స్- 6

"అయ్యో నాన్నగారూ!! ఆటీను ఆసు వేయకండి.!" 
అక్క అరిచే లోపే నాన్నగారు కింద పడేయడం, సీతాపతి మామయ్య వొళ్ళో కూర్చున్న నేను గబుక్కున ఎత్తడం మామయ్య ముక్క మూయటం క్షణాల్లో అయిపోయింది.
ఆరోజు అక్క నాన్న గారి జట్టు, నేను సీతాపతి మామయ్య జట్టు. అక్కకి బహుశా ఏడేళ్లు ఉంటాయి. నేను తన కన్నా సంవత్సరమేగా చిన్న. 
కాసేపటికి అమ్మమ్మ గొంతు లోపల గట్టిగా వినిపిస్తుంటే అప్పటికి అర్థమైంది నాన్నగారికి, మామయ్యకి.. నాలుక కరుచుకుని మమ్మల్ని కేకలేసినట్లు నటించి లోపలికి పంపేశారు.
చిన్నప్పుడు మాకూ, మూర్తి మామయ్య వాళ్ళ ఇంటికీ మధ్యలో పెద్ద రేగి చెట్టు ఉండేది. ముందు ఒక నేరేడు చెట్టు. రెండింటి కింద నీడలో మట్టి చక్కగా చదును చేసి ఆదివారాలు,సెలవు రోజులు అక్కడ జంపఖానా వేసుకుని కూర్చునేవారు. మూర్తి మామయ్య, సీతాపతి మామయ్య నాన్నగారు permanent hands. మిగిలిన వాళ్లేమో అప్పటి availability ని బట్టి.
ఇంట్లో అమ్మ,సుశీలత్త, సీతత్త, వీళ్ళకి మంచినీళ్లు, తినడానికి చక్రాలు, గవ్వలు, కాఫీలు, టీలు అందించడానికి మమ్మల్ని పంపేవాళ్ళు. అలా అందించి ఇలా వచ్చేస్తే మేం .. మేమెందుకు అవుతాం. అసలే ఉమా, మాధవి ఇక్కడ. చాలా షార్ప్ కదా.. మావయ్య వళ్ళో ఒకరం, నాన్నగారి వళ్ళో ఒకరం వంతులు వంతులుగా కూర్చుని కదిలే వాళ్ళం కాదు. అలా చిన్నప్పుడు కుంటాట, తొక్కుడు బిళ్ళ కన్నా ముందు పేకాటలో ఇద్దరికీ పర్ఫెక్షన్ వచ్చేసింది. ఇప్పటికీ మేం ఇద్దరం కూర్చున్నామంటే ఎదురు లేదు 13 ముక్కల నుండి లిటరేచర్ దాకా. (లిటరేచర్ పేకాటలో ఒక రకమైన మైండ్ గేం. మెమొరీ పవర్‌తో ఆడే గేం)
అమ్మమ్మ వచ్చి అప్పటికి నాలుగు రోజులు. అదే తను వచ్చాక మొదటి ఆదివారం. తిరణాలకి వచ్చే వాళ్ళకి వండినట్లు అమ్మ వాళ్లు వండి పంపటం, బయట చెట్టు కింద నాన్నగారు వాళ్లు పేకాడుకోవటం .. నేను, అక్క, వాసు, రవి (మూర్తి మావయ్య పిల్లలు) వాళ్ల వొళ్ళో కూర్చుని కబుర్లు చెప్పటం, అంతటితో ఆగకుండా ముక్కలు మేమే పట్టుకుని ఆడటం ఇవన్నీ అమ్మమ్మ కి అసలు నచ్చలేదు. 
అల్లుడిని ఏమీ అనలేక అమ్మ ని వెనగ్గా తెగ సాధించేది. ఆ తరువాత ఊరు వెళ్లాక మా పెంపకం గురించి కృష్ణాయ పాలెం లో వైనాలు వైనాలు గా చెప్పి అమ్మమ్మ బాధపడుతుంటే అత్తయ్య తట్టుకోలేక అమ్మకి చాటుగా పెద్ద ఉత్తరం రాసిందట.. ఆ ఉత్తరం ఇప్పుడు ఉందో లేదో కానీ (ఇప్పటికీ అమ్మ నాన్న గారిని సాధిస్తూనే ఉంటుంది) . అందులో అత్తయ్య రాసిన ప్రతి అక్షరం అమ్మకి ,మాకు కళ్ళముందు కట్టినట్లు ఉంటుంది ఇప్పటికి కూడా.. ఆ ఉత్తరమే కాదు, ఆ నేరేడు చెట్టు , రేగి చెట్టు ,ముందు పక్కన ఉండే తోట , వెనక వైపున అమ్మ పెంచుకున్న కూరగాయల మళ్ళు.. ఇవేమీ మర్చిపోలేము. 
చిత్రకొండకి వెళుతున్నాం అనుకుంటేనే ఇదంతా గుర్తుకు వచ్చింది. 
నిజానికి సీలేరు రోడ్డు ప్రయాణం, కొండలూ జలపాతాల అందాలూ అవేం మనసులోకి పూర్తిగా వెళ్ళట్లేదు. మనసంతా చిత్రకొండ మీదే ఉంది. సామాను సీలేరు గెస్టుహౌస్ లో పడేసి ఏదో తిన్నాం అనిపించి చిత్రకొండ బయలు దేరాం.
సీలేరు నుంచి చిత్రకొండ కి ఇప్పుడు రెండు రోడ్లు ఉన్నాయి. ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది కాబట్టి డ్యాం మీదుగా ఒడిషా ప్రభుత్వం చేపట్టిన ఎకో పార్కు దాటుకుని కొత్త రోడ్డు. ఇక రెండవది నా చిన్నప్పటి జ్ఞాపకాల ఘాట్ రోడ్డు. వెళ్ళేటప్పుడు చీకటి పడకుండా త్వరగా చిత్రకొండ చేరుకుంటే వచ్చేటప్పుడు ఘాట్‌లో రావచ్చని, కొత్త రోడ్డు మీదుగా బయలుదేరాం.
దారి మధ్యలో స్పిల్‌వే2 వచ్చింది. బలిమెలా డ్యాం దాటి చిత్రకొండ ఊరు మొదట్లో
"CHITRAKOMDA-O Kms" అని మైలు రాయి కనిపించగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంక అసలు ఏమీ గుర్తు రాలేదు. 30 సంవత్సరాల తర్వాత కూడా ఊరు ఏమీ డెవెలప్ అవ్వలేదు. బలిమెలా ప్రాజెక్ట్ ఏరియాలో నక్సలైట్ల దాడి తర్వాత కొంత నిఘా, అక్కడ ప్రజల్లో కూడా కొత్త వారి పట్ల కొంత కలవరం గమనించాం.
మొన్న వెళ్ళినప్పటికీ క్వార్టర్స్ చాలా మారిపోయాయి. రేగి చెట్టు లేదు, పక్కన సీమచింత చెట్టు మాత్రం అలానే ఉంది. వెనుక వైపు తోట లేదు. ఇప్పుడు ఉన్న ఆమెకి అసలు ఇంట్రెస్ట్ లేదనుకుంటా. మిగతా పూల మొక్కలు కూడా లేవు. డాలియాలు మాత్రం దుంపమొక్కలు తరతరాలు ఉంటాయి కాబట్టి అవే ఉన్నాయి ప్రాణం ఉండీలేనట్లు.
అప్పట్లో హాలులో టీవీ ఫ్రిజ్ హడావిడి లేదు కదా ఒక పక్కగా సోఫాలు ఉండేవి మిగతా ప్లేస్ అంతా ఆడుకునీ పడుకుని దొర్లేవాళ్ళం. బయట వరండాలో క్యారం బోర్డు పెట్టుకునే చోట రెండు బళ్ళు ఒక సైకిలు చెప్పుల స్టాండ్ వచ్చాయి.
చిన్నప్పుడు విశాలంగా అనిపించిన రోడ్లు, కాలనీ అంతా ఏదో ఇరుకు ఇరుకుగా అనిపించింది. బలిమెలా ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఎవరో కొంతమంది మెయిన్‌టెనెన్స్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు అక్కడ. మిగిలిన క్వార్టర్స్ అన్నీ దాదాపు శిధిలమైపోయాయి. మేం చిన్నప్పుడు ఆడుకున్న సందు చివర గ్రౌండ్ లో ఇప్పుడు ఒక సాయిబాబా గుడి కట్టేసారు. 
30 ఏళ్ళు కలలోకి వచ్చిన అందమైన జ్ఞాపకం... 
బాబి కి కథలు కథలుగా వర్ణించి చెప్పిన బాల్యం..
పచ్చటి ...రంగు రంగుల పూదోట లాంటి నా బాల్యం..
అలా మాసిపోయిన కాంక్రీటు దిమ్మల్లో..
తెలుపు నలుపు రంగులో కళావిహీనంగా కనిపిస్తుంటే మనసు ఉసూరుమనిపించింది, వెళ్ళకుండా ఉంటే బాగుండు అనిపించి దుఃఖమొచ్చింది.

No comments