అమ్మమ్మ కథలు...

అమ్మమ్మవీ నానమ్మవీ బూజు పట్టిన భావాలంటూ
పాతదెపుడూ ముతకవాసననంటూ
ఈ తరమంతా నవతరమంటూ 
నిన్నటితరాలని వెక్కిరిస్తే 
సాధికారత వస్తుందనుకుంటే 
ఇంతవరకూ ఏ కొన్నిపాఠాలు కూడా మనం చదవలేదనే,
ఏ చరిత్రపుటల్ని కూడా మనం తాకలేదనే
కాసేపలా దేశ చరిత్రలని పక్కన పెట్టి 
మన ఇంటి చరిత్రలకి వెళదాం రండి 
పంట పొలానికి తాతయ్యలు వెళితే 
ఇంటి దగ్గర పాడి పశువును సాకిన 
ఆనాటి వర్కింగ్ విమెన్ అమ్మమ్మలు నాయనమ్మలే,
బాల్య వివాహాలు చిన్న వయసులోనే ఒంటరిని చేసినప్పుడు
సాంప్రదాయం మారు మనువు కాకుండా చేసినప్పుడు
ముసుగులేసుకున్న మగస్వార్థాల సాయాలని ధిక్కరించి
వంటిచేత్తో తమ పిల్లలని ప్రయోజకులని చేసిన ఘనులే
నిన్నటి తరపు ఈ పండు తారలు
చిన్న చిన్నసంసారాలనే 
సరిదిద్దుకోలేక సతమతమై 
కుటుంబాలుగా ఆహుతి అయిపోతున్న నేటితరానికి
తరతరాల ఉమ్మడి సంసారాలని
రకరకాల మనస్తత్వాలనీ 
తరాల పాటు తడబడనివ్వని నైపుణ్యం 
మన ముందరి తరాలకి నారికేళ పాకం
వెతికివెతికి చూస్తే
ఒంటరి తాతయ్యలకంటే
ఒంటరి అమ్మమ్మలే ఎక్కువగా కనిపించడమన్నది
జీవితాన్ని మోసే ధైర్యం ఎవరికెక్కువో తెలుపుతుంది
అనగనగా అంటూ వీరనారుల కథలే చెప్పిన
అమ్మమ్మ ఎప్పుడూ అబలే కాదు
కొంగు బిగిస్తే సత్యభామ… 
కొడవలి పడితే రాణి రుద్రమ
చీటికి మాటికీ... చిన్న సమస్యకు
చావే పరిష్కారమని ఎంచుకునే నవతరానికి
సమస్యల మీద పోరాటమే కర్తవ్యమని
ఎరిగేలా నేర్పే భగవద్గీతలే వీరి కథలు
పాతతరపు నగలే కాదు…
వాళ్ళు నడిచిన దారులూ ముఖ్యమే…
ప్రాచీనత్వపు పట్టుచీరల కళలే కాదు
వాళ్ళు చూపిన స్థైర్యమూ అక్కరే.
ఎప్పటికప్పుడు నేర్చుకుందాం 
నిన్నటి తరాల్లోని సమున్నత విలువలని...
నేటి తరపు విజ్ఞానపు మెరుగుల జతగా 
కొత్త చరిత్ర రాసుకుందాం


1 comment

అన్యగామి said...

మీ కవిత ఒక అద్భుత సందేశం. గతంనుంచి, పూర్వీకుల నుంచి నేర్చుకొని వర్తమానాన్ని భవిష్యత్తుని బాగుచేసుకోవటమే జీవితం.