నిన్నలా… మొన్నలా…

కల్ రహె నా రహె, మౌసం యే ప్యార్ కా
కల్ రుకె నా రుకె, డొల బహార్ కా
ఛార్ పల్ మిలే జొ అజ్ ప్యార్ మె గుజార్ దే…
కిషోర్‌దా గొంతులో మార్దవం గుండెలోతుల్లోకి నెమ్మదిగా జారిపోతోంది.
ఆదివారపు ఈ ఏకాంతం ఎందుకో గుబులు గుబులుగా అనిపిస్తోంది. దిగులు మేఘం కమ్ముకుపోయినట్లు... జీవితం లో ఆనందపు దశలన్నీ.. హడావిడిగా మాయం అయిపోయినట్లు.. ఏదో తెలీని నిరాశ.
ఎందుకో తెలీదు గానీ.. ఒక్కోసారి నడుస్తున్న నడక హఠాత్తుగా ఆపి మళ్ళీ ముందు నుంచి మొదలెట్టాలనిపిస్తుంది.
ప్రేమించడం మాత్రమే తెలిసిన జీవితాన్ని గడపాలని ఉంది.
జీవించడం తెలిసిన బతుకు మళ్ళీ కావాలనిపిస్తోంది.
మా ఊళ్ళో, మా ఊరి గాలిలో మా ఊరి గుడిలో, గుడిలోని చిలుకల గుంపులో..
మా ఊరి పిల్లల్లో, మా ఊరి మనసుల్లో.. మళ్ళీ బతకాలని ఉంది.
కృష్ణానది ఒడ్డున నడుస్తున్నప్పుడు మన కాలి కింద పొడిపొడి లాడుతున్న ఇసుక చేస్తున్న చప్పుడు లాంటి జీవితం...
నదిలో నీళ్ళలోంచి పైకెగిరి దూకుతున్న చేపపిల్ల లాంటి జీవితం...
ఇంటి ముందు ముగ్గైన సాయంత్రపు జీవితం. 
రాత్రులు ఆరు బయట పడుకుని.. వెన్నెల్లో నక్షత్రాలను లెక్క పెట్టిన జీవితం...
నాన్న పక్కన పడుకుని బినాకా గీత్‌మాలా విన్న రాత్రులు.
బంధువులూ, స్నేహితులూ.. వేరు వేరు కాని జీవితం. 
బాదాం చెట్టు నీడన, ఆట పాటలతో మురిసి మెరిసిపోయిన జీవితం. ..
ఇప్పటి యాంత్రికతని వెక్కిరిస్తూ... రా వెనక్కి వచ్చేయమని పిలుస్తున్నట్లు ఉంది.
ఎలా గడిచేవి ఆ రోజులు. బతికున్న రోజులవి.
ఎప్పుడైనా అనుకున్నామా యంత్రాలన్నీ అంతకంతకూ చిన్నగా మారిపోతూ… 
మనలోని జీవితాన్ని అంతకంతకూ యాంత్రికంగా మార్చేస్తాయని…
మనకు భౌతికంగా కంఫర్ట్స్ గా మనం దగ్గర చేసుకున్నవన్నీ 
మనలోని మనను దూరం చేసేసిన సంగతి తెలిసే సరికి..
ఇప్పుడు
బాదం చెట్టూ లేదు 
ఆరుబయలూ లేదు 
కాలికి మట్టి స్పర్శా లేదు
తలకి చెట్టు నీడా లేదు
ఏటిని దాటి వచ్చే పిల్లగాలికేమో ఏటి ఆచూకి చిక్కక తాను కలుషితమై మన శ్వాసలని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది,
బతుకులో జీవితం తాను పారిపోతూ.. బోలెడు సదుపాయాలు ఇచ్చి వెళిపోయింది.
అందుకే… నిన్నలా… మొన్నలా… 
మనలోకి మనలా… 
యాంత్రికతని నిశ్శేషం చేస్తూ… 
జీవితాన్ని సశేషం చేసుకుంటూ...
మళ్ళీ మొదలునుంచీ నడవాలని ఉంది.




No comments