ఎడారిలో పూలు పూయించగలం

"ఎడారిలో పూలు పూయించగలం!! 
మనకేల బెంగ"
అమ్మా!
ఈ మాట గుర్తుందా. నాకు అత్యంత ఆత్మ విశ్వాసాన్ని మూటగట్టి ఇచ్చిన మీ మాట ఇది. ఆగక తప్పదేమో అని భయపడిన ప్రతీసారీ భుజం తట్టి నడిపించిన మాట. ఎప్పుడైనా నేను ఏదైనా నిరాశలోకో... నిర్వేదంలోకో జారిపోతున్నప్పుడు నన్ను నాకు తెచ్చి ఇచ్చే అమూల్య వరం .. ఇది ఒక వాక్యంలోనో... ఒక పేజీలోనో... ఒక పుస్తకంలోనో అయితే ఇమిడేది కాదు. ఈ ధైర్యం చాలుకదా వాడిపోతున్న జీవితాన్ని చిగురింపజేయటానికి. మీకు అలాంటి వాక్యాలు అలవోకగా వచ్చేస్తాయి. ఎందుకంటే అందరిలా రాయడం కోసం ఆలోచించవలసిన అవసరం లేదు. ఇలాంటి వాక్యాలన్నీ మీ జీవితపు అనుభవం నుండి అలవోకగా జాలువారే మేలి ముత్యాలు. 
* * * * * * * * *
సత్యవతి అమ్మ పోయిన నెలలో "తిరగరాయ్" కధ రాసారు. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో పబ్లిష్ అయింది. చాలా మందికి ఎంతగానో నచ్చిందా కధ. సముద్రమంత దుఃఖాన్ని తనతో పాటు అండమాన్ తీసుకువెళ్ళిన ధరణి, అక్కడ తన గమ్యాన్ని, ఆనందాన్ని తెలుసుకోవడం...అక్కడి ప్రకృతి గురించి తను వర్ణించిన తీరు. దుఃఖాన్ని జయించడానికి దరణి పాత్రకి అమ్మ చూపించిన హృద్యమైన స్నేహ హస్తం.. చాలా మంది ఐడెంటిఫై చేసుకున్న అంశం ఇదే.
అమ్మ ఒకసారి నన్నో మాట అడిగింది. "ఎందుకు అందరూ నా మీద ఇంత ప్రేమ చూపిస్తారు!" అని.
ఎందుకంటే.. ఇందుకే.
చాలా మంది ఎలా ఉండాలని కోరుకుంటారో, తను అలా ఉంటుంది.. ఎలా జీవించాలని కలలు కంటారో.. తను అలా జీవించి చూపిస్తుంది.
బ్రతకడం అంటే అందరం ఎలాగో ఒక లాగా బతికేస్తాం.
కానీ జీవించాలంటేనే చాలా కష్టం. ప్రతీ క్షణం అలా జీవించి చూపించే Great Soul తను.
తన బ్లాగ్ రోజుల నుంచీ పరిచయం నాకు. ఆ తర్వాత చాలా సహజంగా పిల్ల కాలువలాంటి నన్ను సముద్రమంత తనలో కలిపేసుకుంది.
రాయడం మర్చిపోయిన నన్ను చేయి పట్టుకుని భావాల ఓనమాలు దిద్దించింది.
అమ్మ ఇచ్చిన ఇంకో అద్బుతమైన బహుమతి మాలిని. నా Soul Mate! కలిసి పుట్టిన కవలల్లా కలిసి పోయాం మేం. ఇప్పుడు జయా ఆంటీ కూడ.
అసలు అమ్మతో ఉంటే చాలు జీవితం వెన్నంటే ఉండే ఆనందాలు అలా అలా మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.
**
అమ్మా!
నాకు ఎంతో మంది స్నేహితులున్నారు. మొదటి స్నేహితురాలు అక్క దగ్గర్నుంచి శిల్ప, శ్రీదేవి, వసంత, అనసూయ, ఝాన్సీ, రజని, జానకి, రామలక్ష్మి.. వీళ్ళలో ప్రతీ ఒక్కరి దగ్గర్నించి ఎంతో నేర్చుకున్నా నేను. మీరు మాలిని ఎంతో ప్రత్యేకం. ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి పరిధులూ షరతులూ లేని స్నేహాలు ఎలా ఉంటాయంటే... మీ అందరిలా ఉంటాయి.
మీ దగ్గర, మాలిని దగ్గర ఇంకా నేర్చుకోవల్సింది చాలా ఉంది అమ్మా. చాలా త్వరలో ఈ ఉద్యోగం వదిలేసి మీ దగ్గరకి వచ్చేస్తా. మీ చేయి పట్టుకుని బుడి బుడి అడుగులు వేస్తూ అయినా కొత్త దారిలోకి ప్రయాణం మొదలు పెడతా.
Love you both . మీరు ఇద్దరూ ఇచ్చిన స్నేహానికి, నేర్పిన ప్రతీ పాఠానికీ...
ప్రేమతో
ఉమ.

No comments