ఓ అమ్మాయీ… ఓ మనస్వినీ..!!

ఓ అమ్మాయీ… ఓ మనస్వినీ..!!
నువ్వెప్పుడూ ఒక సెకండ్ క్లాస్ సిటిజెన్ వే. ప్రివిలేజ్ద్ అన్ ప్రివిలేజ్డ్ ప్రపంచాల మధ్య నువ్వు ఎప్పటికీ చేరుకోలేని గమ్యానివి. ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ మీద నువ్వు నింపుకునే భరోసా సాక్షిగా నువ్వు తెలుసుకోవాల్సినది ఒక్కటే… ఇక్కడ అవసరాలన్నవాటికి ప్రాధాన్యాలు అంటూ ఏమీ ఉండవు. ఉన్న ప్రాధాన్యమంతా తమ అహాల సంతృప్తి మాత్రమే.
అవును...
తమ అహాల సంతృప్తి కోసం లేని అవసరాలు కొన్ని సృష్టించబడతాయి. ఆ అవసరాలన్నీ నీ అడుగులకి ఎదురుగా ముళ్ళకంచెలని పరిచేస్తాయ్. అడుగు ముందుకు పడే దారీ ఉండదు. అక్కడే నిలబడే ఓపికా ఉండదు. అంతేనా… 
ఆ ముళ్ళ కంచెల మొనల మీదే కొన్ని సానుభూతి వచనాలని నిలబెట్టి నీ మనసుని మరణారణ్యంలో చీకటి కొమ్మ మీద ఉరివేసే విష ప్రవృత్తే విరామమెరుగకుండా కొనసాగుతూ ఉంటుంది.
నువ్వు ఎంత కన్నీటినైనా వెచ్చించు… ఆత్మాభిమానాన్ని ఫణంగా పెట్టు. నువ్వు రాల్చే నీటి బొట్లు నెత్తుటి పువ్వులుగా విరియాల్సిందే కానీ ఈ వ్యవస్థ రాసుకున్న ఉన్మత్తతలు కరగనే కరగవు. అంతే కాదు నీ కన్నీటి చెమ్మ తగిలినంత మేరా... అంతకంతకూ ఆ ఉన్మత్తత పెరిగిపోతూనే ఉంటుంది.
నువ్వంటూ ఒక స్థిమితత్వాన్ని ఎరిగి ఎన్నాళ్ళు అయ్యిందో చెప్పగలవా?
చెప్పలేవు… నువ్వే కాదు ఎవరమూ చెప్పలేము. జీవితపు స్తిమితత్వాలు ఎవరికీ అందవన్నది అందరికీ తెలిసిందే అయినా… పోటీ పడి సాధించుకున్న వృత్తి జీవితంలో కూడా అడుగడుగునా అస్థిమతలు ఎదురయ్యే మొదటి వ్యక్తివి మాత్రం నువ్వే అవుతూ ఉంటావ్. ఎందుకంటే… ఇంకా మనం హ్యూమన్స్ గా మారబడని ఒక జండర్ మాత్రమే.
పాత లెక్కల్ని సరి చెయ్యటానికంటూ కొందరికి ఇచ్చే ప్రయారిటీస్ మాటున, మన అవసరాలు, మన అస్తిత్వాలూ అన్నీ వెనకబడిపోతూ ఉంటాయ్. కొత్త లెక్కలకూ తామే పాత సమాధానాలు రాసిచ్చి వాటి గణాంకాలనూ తామే రూపొందించే వ్యవస్థలో చిక్కు బడి పోయిన చేప పిల్లలాంటి వాళ్ళం మనం.
మన స్వప్నాలన్నిటికీ మన కళ్ళల్లోనే సమాధులు కట్టగలిగే వ్యవస్థ ఒకటి మన చుట్టూరా ఉన్నంత సేపూ మనకు అర్థమయ్యేది ఒక్కటే… మన చుట్టూ ఉన్నది రాక్షస గణాల పహారా అని.
ఓ అమ్మాయీ… ఓ మనస్వినీ..
నువ్వు కార్చే కన్నీళ్ళ లెక్కలన్నీ 
నీ నిశ్శబ్దంలోకి ఇంకిపోతున్న నీరవాలే 
నీకంటూ ఉన్న హక్కులన్నీ 
తెల్లకాగితం మీద రాయబడుతున్న నీటిరాతలే 
అందుకే…ఇప్పుడు 
నీ ప్రపంచంలోనే నువ్వో కాందిశీకురాలివి..

No comments