యుద్ధకాలంలో స్వప్నాలు – బాల్య జ్ఞాపకాలు





ఎవరి స్వప్పమైనా ఏం ప్రతిబింబిస్తుంది?
గతం చూపించిన అనుభవాలు… వర్తమాన పరిస్థితులు… భవిష్యత్తుపై ఆశలు…
ఇవే కదా?
ఒక చిన్నపిల్లవాడు రెండవ ప్రపంచ యుద్ధంలో కన్న కలలు ఇవి. యూరప్‌లోని బ్రిటన్‌, ఇతర సామ్రాజ్యవాద దేశాలే కాక అధికార దాహంలో భాగంగా వారు చేజిక్కించుకుని వారి పాలనలో ఉన్న వలస దేశాలు అన్నీ కూడా తమకు సంబంధం లేకుండానే ప్రపంచ యుద్ధంలోకి లాగబడి, తమ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చినపుడు, గతం… వర్తమానం… భవిష్యత్తు అంతా యుద్ధమే కనిపిస్తున్నప్పుడు అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో గుగి వా థియాంగో మన ముందు పరచిన జ్ఞాపకాల దొంతర ఇది.
అలాంటి స్వాప్నికుడి ప్రపంచాన్ని మరొక స్వాప్నికుడు మన కళ్ళముందు ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నం ”యుద్ధ కాలంలో స్వప్నాలు – బాల్య జ్ఞాపకాలు’
ఎలాంటి నియంతృత్వ రాజ్యమైనా మన అడుగుల్ని కట్టడి చేయగలదు కానీ మన కలల్ని చేయలేదు కదా… అలాంటి ఒక నియంతృత్వ రాజ్యం నుంచి కలల్ని చేతబట్టుకుని వలస వెళ్ళి తన దేశంమీద వల్లమాలిన బెంగతో రాసిన ఆత్మకథ ఇది.
గుగివా థియాంగో కెన్యా దేశంలో 1938లో జన్మించాడు. అప్పటిదాకా కెన్యా దేశమంతా బ్రిటిష్‌ పాలనలో ఉంది. దేశమంతా ఆదివాసీ తెగల కష్టాలతో, కన్నీళ్ళతో, నెత్తురుతో తడిసి ముద్దయిన పరిస్థితి.
అద్భుతమయిన జానపద సంస్కృతి, కరువు, పీడనను సమిష్టిగా ఎదుర్కొనే తత్వం, గూగికి చెందిన మౌ మౌ తెగల సహజ లక్షణం. అలాంటి తెగల సహజ లక్షణాలను పుణికి పుచ్చుకున్న గూగి యవ్వన దశలో విప్లవంపై ఆకర్షింపబడ్డాడు. ఆ తర్వాత వలస పాలన నుంచి స్వేచ్ఛ కలిగినా, బ్రిటిష్‌ రాజ్యం తెచ్చిన ఇంగ్లీష్‌ చదువులు, సంస్కృతి కెన్యా ప్రజలపై పెను ప్రభావాన్నే తెచ్చిపెట్టాయి.
అయితే గూగి ఆ ప్రభావం నుంచి త్వరగానే బయటపడ్డాడు. తన దేశంలో ఇంగ్లీష్‌ దొర చిత్రించి ఇచ్చిన ఇంగ్లీష్‌ చదువుల చట్రం నుంచి బయటకు వచ్చి ఆయన ఆఫ్రికా ప్రజల అనాది జీవితాన్ని, పోరాటాన్ని, చరిత్రను, సంస్కృతిని మళ్ళీ చదువుకున్నాడు. నైరోబీ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరాక ఆయన చేసిన మొదటిపని ఇంగ్లీష్‌ భాష స్థానంలో తమ మాతృభాష అభివృద్ధికి పాటుపడడం.
ఒక రోజున, తమ పల్లెటూరి నుండి రోజూ పాలు పోయడానికి వచ్చే ఒక స్త్రీ ”నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద చదువులు చెప్తావట కదా. మన ఊరికి వచ్చి, మన ప్రజల బ్రతుకులు చూసి వచ్చి పాఠాలు చెప్పరాదా, మా బ్రతుకులు రాయరాదా” అని అడిగింది. ఒక్కసారి అడిగి ఊరుకోలేదామె. గూగీని మళ్ళీ మళ్ళీ అడిగింది. తను వెళ్తున్న దారిలో నడక ఆపి గూగీ వెనక్కి తిరిగి చూసుకునేదాకా… తన అసలైన గమ్యం ఏదీ… అని గుండె తడుముకొని తెలుసుకునేదాకా వెంట పడింది.
ఎవరో పదే పదే వెంటబడి అడిగినంత మాత్రాన పూర్తిగా మారిపోతాం అని మనం చెప్పగలమా. అలా అడగడం అన్నది ఒక కుదుపులాంటిది. ఆ కుదుపులో నుండి తన గుండె లోతుల్లో… మనసు పొరల్లో తనదైన సంస్కృతి మీద తనకున్న అపార ప్రేమ బయటకు వచ్చింది. ఎందుంటే ఆమె అడుగుతున్న దానిలోనే తన జీవితపు మూలాలు కూడా ఒదిగి ఉన్నాయనే మెలకువ ఒకటి బయటకు వచ్చింది.
అదుగో అప్పుడు మొదలయింది గూగి అసలు చదువు!! అది కేవలం చదువు కాదు… తమ జీవితాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం. ఆయనలో స్వతహాగా నిద్రాణమై ఉన్న సాంస్కృతిక నేపథ్యం మేల్కొంది. గూగి ఊరు రంగస్థలమైంది. ఊళ్ళోని మనుష్యులే పాత్రలయ్యారు. తన జీవితకాలపు జీవన్మరణ పోరాటాలు ఆవిష్కరించిన గత వర్తమానాలు… కథలు, నాటికల రూపంలో భవిష్యత్తులో సమకాలీనంగా చదువుకోగల వస్తువులయ్యాయి. ఊరి పొలాల్లో మడిచెక్కల్లో ప్రజా రంగస్థలం వెలిసింది.
గూగి స్వంత తెగ ప్రజలు కాలక్రమంలో మర్చిపోయిన జానపద ప్రజల కళా రూపకాలు మళ్ళీ జీవం పోసుకున్నాయి. జనజీవనంలోని ఆటుపోట్లు, కలలు, కన్నీళ్ళు, భావ సంఘర్షణలు ఆయన కళారూపాల్లో జీవం పోసుకుని కళ్ళకు కట్టాయి. జానపద స్వభావ సహజత్వంలోకి ప్రజా రంగస్థల చలనాన్ని ప్రవేశపెట్టాడు గూగి.
గూగీ అంతటితో ఆగలేదు. తమ జానపద జీవితానికి కాళ్ళు తెచ్చి, రంగులద్ది పల్లె జీవితాన్ని నగరం ముందుకు తెచ్చాడు. తమ మూలాల ఆనవాళ్ళను పరిచయం చేశాడు. నైరోబీ నగర ప్రజలు తమ మూలాల్ని తడుముకునేలా చేశాడు.
సహజంగానే రాజ్యం ఇది సహించలేకపోయింది. గూగి వా థియాంగోని రెండు సంవత్సరాల పాటు హై సెక్యూరిటీ జైల్లో చీకటి కొట్లో బంధించారు. ఆ రోజుల్లోనే జైల్లోని టాయ్‌లెట్‌ పేపర్లమీద ఆయన ”డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌” అనే నవల రాశారు.
జైలు నుండి విడుదలయ్యాక తన దేశంలో స్వేచ్ఛగా జీవించలేక ఆయన ప్రవాసాన్ని ఎంచుకున్నాడు. ఎంతో కాలం గడిచాక తన దేశాన్ని ఒక్కసారి చూడాలన్న బలమైన ఆకాంక్షతో స్వంతగడ్డపై అడుగుపెట్టిన గూగి తనపై జరిగిన దారుణమయిన దాడితో వెనుతిరిగి వెళ్ళిపోవలసి వచ్చింది.
ఈ అనుభవాల సమాహారమే ”డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైం ఆఫ్‌ వార్‌ – ఎ ఛైల్డ్‌హుడ్‌ మొమైర్‌”. గూగివా తన నిరంతర అధ్యయనంలో, రచనలో కెన్యాలోని వకవకా పోరాట కాలపు జీవితమే జీవితమని కెన్యాలోని తన క్రియాశీల బాధ్యతాకాలపు, నిర్బంధ కాలపు జీవితమే జీవితమని ప్రపంచంలోని పోరాట శక్తులన్నింటికీ చాటి చెప్పాడు. తద్వారా ఒక విప్లవ పోరాట యోధుడికి సంతృప్తినిచ్చే గమ్యం ఎక్కడ ఉందో తేటతెల్లం చేశాడు.
గూగివా థియాంగో రాసిన పుస్తకాన్ని తెలుగులో ప్రొ.సాయిబాబా అనువదించడం ఓ అద్భుతమయిన యాదృచ్ఛికం అనవచ్చు. ప్రొ.సాయిబాబా ఒక ఉద్యమకారుడు, ప్రజా యుద్ధ స్వరాన్ని ఎలుగెత్తి ఆలపించినవాడు. గూగీ ఆత్మని అందులోని స్వరాన్నీ అత్యంత సహజంగా తర్జుమా చేయడం చిన్న విషయం కాదు. బహుశా ఆయన గూగీ కలల్ని తన కలలతో మమేకం చేసుకుని గూగీ భావాల్ని మనముందుకు తెచ్చారా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.
కెన్యాలోని కియాంబు జిల్లాలోని కామిరితు అనే పల్లెటూళ్ళో 1938లో పుట్టిన గూగివా థియాంగో, కెన్యా, ఉగాండా, బ్రిటన్‌లలో చదువుకున్నాడు. నవలా రచయితగా, వ్యాసకర్తగా, నాటక రచయితగా, విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా సుప్రసిద్ధుడయిన గూగి ఇంగ్లీష్‌ సాహిత్యంలో అధ్యాపకుడిగా నైరోబీ విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ గ్రామీణ ప్రజా నాటక రంగాన్ని అభివృద్ధి చేసినందుకు ప్రభుత్వ ఆగ్రహానికి గురై రెండు సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడిపాడు. విడుదలయ్యాక ప్రస్తుతం యూనివర్విటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన రాసిన మూడు భాగాల ఆత్మకథలో ”డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైం ఆఫ్‌ వార్‌, ఎ చైల్డ్‌హుడ్‌ మొమైర్‌” – మొదటి భాగం.
మనం ఒక నిరంతర యుద్ధంలో ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటి సామ్రాజ్యవాద దశ అంతా యుద్ధకాలమే. యుద్ధం అంటేనే మృత్యువు. అలాంటి మృత్యుముఖంలో తలదూర్చిన విప్లవం ఒక బంగారు కల కనే ప్రయత్నం చేస్తే ఆ కల ఎలా ఉంటుంది?
”యుద్ధకాలంలో స్వప్నాలు” అంత స్వచ్ఛంగా ఉంటుంది.

No comments