నా లాంటి నీ కోసం,

ఇక నుండి నీ ప్రయాణమూ నాదేనని 
చెప్పకనే చెప్పిన నేస్తమా…
ఎక్కడి మబ్బుల్ని ఇక్కడ కూర్చావో మరి…
విసుగూ విరామం లేకుండా 
గుండె మీద అలా కురుస్తూనే ఉన్నాయి 
ఇక కురుస్తూనే ఉంటాయి
అది నీకూ తెలుసు 
మరెందుకిలా చేశావు
నువ్విప్పుడు ఒక ప్రశాంతతలోకి వెళ్ళిపోయావు 
నిద్దుర నిండా మెలకువగా 
జీవితమంత అశాంతతని ఇక్కడ చల్లేసి
ఇప్పటిదాకా 
ఆకాశానిది నిశ్శబ్దం అనుకునే దాన్ని
నీలాంటి ఊపిర్లని నిలువుదోపిడీ చేసుకుని 
పాటించే మౌనమని తెలియక
ప్రపంచాన్ని నువ్వెందుకు నిషిద్ధం చేశావో 
లోకంతో నీ భేదమేమిటో 
నీ గొంతుతో వినాలని ఉంది 
ఒక్క సారి మాట్లాడవూ
అప్పుడెప్పుడో 
నువ్వు వాగ్దానం చేశావే 
ఒక నవ్వుని
ఇప్పుడది కావాలి 
జీవితమంతా … 
మరి ఎదురుగా వచ్చి 
నీ నవ్వుని అమృతించవూ

No comments