నిర్జన వారధి..

కొన్ని పేర్లు వినగానే ఒక అస్పష్ట మైన విచారం మనసుని కప్పేస్తుంది. అందులోనూ.. మనం బాగా ఇష్టపడే ఒక వ్యక్తి జీవితానికి సంభంధించినదీ .. అంటే ఆ భావం మరీ ఎక్కువగా ఉంటుంది. 
మూడు తరాలకు వారధిగా, ఎన్నో ఉద్యమాలను స్వయంగా చూసి, పోరాడీ.. తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయిన నిర్జన వారధి "కొండపల్లి కోటేశ్వరమ్మ.."
ఒక మనిషి జీవితంలో ఇంత బాధ ఉంటుందా!! అసలు ఇన్ని కష్టాలు భరించి తట్టుకుని నిలబడడం సాధ్యమేనా.. అలాంటి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని కొలవాలంటే కొలమానం ఎలాంటిది ఉండాలి?? 
"నిర్జన వారధి" పుస్తకం ముగించి పక్కన పెట్టాక 90 ఏళ్ళ కోటేశ్వరమ్మ గారు మన కళ్ళ ముందు పర్వతమంత ఎత్తులో కనిపిస్తారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం ఆమె రాసిన "నిర్జన వారధి"
ఇప్పటిదాకా ఒక కమ్యూనిష్టు పార్టీ కార్యకర్తగా.. నక్సల్బరీ ఉద్యమ కర్తగా సీతారామయ్యగారు మనకి పరిచయం. కానీ నిర్జన వారధి చదివాక మనకి కొత్త కోణాలు తెలుస్తాయి.
ఇద్దరు పిల్లలు పుట్టాక కట్టుకున్న భర్త కారణం చెప్పకుండా వదిలేసినా...
ఏ పార్టీ కోసమైతే తన ప్రాణాలకు తెగించి గర్భస్రావానికి సిద్ధపడిందో.. ఆ పార్టీయే తనని వదులుకునే పరిస్థితులు వచ్చినా...
కడుపున పుట్టిన పిల్లలూ, కన్న తల్లీ ఒకరి తర్వాత ఒకరు తనని ఒంటరిని చేసి లోకం విడిచి వెళ్ళినా.. అన్ని తట్టుకుని నిలబడి తనకంటూ ఓ జీవితం ఉందనీ దాన్ని సార్ధకం చేసుకోవాలనీ తపించిన మనిషి ఆమె.
పార్టీ మీద నిషేదం..


అది తొలిగే సమయానికి వ్యక్తిగత జీవితంలో సమస్యలూ
సీతారామయ్య గారి జీవితంలోకి మరో స్త్రీ రావడం..
సిద్ధాంత పరమైన కారణాలతో పార్టీ రెండు ముక్కలు కావడం..
అసలు తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలు తన జీవితం మీద చూపించిన ప్రభావం.. మన కళ్ళని తడి చేస్తుంది.
కధ మొత్తం చాలా ప్రశాంతంగా చెప్తారమె...
నడిరోడ్డున వదిలేసిన భర్త గురించీ..
తనను దూరం పెట్టిన పార్టీ గురించీ చెప్పేటప్పుడూ అదే సంయమనం!! బహుసా.. అది అంతులేని దుఃఖం అనుభవించాక వచ్చే ఒక మానసిక స్థాయి కావచ్చు.
అందుకే సీతారామయ్య చనిపోయినప్పుడు కూడా ఎలాంటి భావం లేకుండా.. కేవలం ఒక ఉద్యమ సహచరుడిగా అతనికి నివాళులర్పించా... అని ఆమె చెప్తున్నప్పుడు, ఆమె నిబ్బరానికి మనం జోహార్లు అర్పిస్తాం.
నిర్జన వారధి కేవల ఒక స్త్రీ ఆత్మ కధే కాదు. గత శతాబ్దంలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక ఉద్యమాలూ.. వాటి వెనుక ఉన్న సామాజిక కారణాలను విశ్లేషించగలిగే ఒక ప్రయత్నం కూడా..
అంతే కాదు.. జీవితం పట్ల భయాలు ఉన్న వాళ్ళకి కావలసినంత ధైర్యాన్ని ఇచ్చే పుస్తకం.
జీవితంలో పోరాడి గెలిచిన ఒక యోధురాలి స్ఫూర్తివంతమైన గాధ ఇది...

No comments