మంకెన పూలు - 1

ఒకలా చూస్తే…
ఎర్రటి విప్లవాన్ని వళ్ళంతా పులుముకున్న సున్నితత్వపు అగ్ని శిఖలు…
మగువ మనసు సున్నితత్వపు పొరల క్రింద ప్రజ్వరిల్లుతున్న హిరణ్యపు రేకలు

మరోలా చూస్తే…
అరుణిమని హత్తుకుని కళ్ళల్లో కాంతి జ్వాలలని వెలిగిస్తున్న పూల దీపాలు...
ఎర్రెర్రని సీతాకోకలై అతివ మనసుని మురిపించే సిందూరపు కవిత్వాలు…

ఇంతకూ అవేమిటో తెలుసు కదా

మంకెన పూలు…

***

ఏ రోజైతే
స్త్రీ
తన అసహాయతలనుండి కాకుండా
తన సమర్ధతకి ప్రతిగా ప్రేమని
స్వీకరిస్తుందో..
ప్రేమ వల్ల తనని తాను కోల్పోకుండా
నూతనంగా ఆవిష్కరించుకోగలుగుతుందో
తనని తాను కించ పరచుకోకుండా,
నిశ్చింతగా వెల్లడి చేసుకోగలుగుతుందో
ఆ రోజున..
ఆమెకి
తన ప్రేమ
ఒక ప్రాణాంతక ప్రమాదంలా కాక
జీవన సాఫల్యతకి మూలాధారమవుతుంది.
- Simone de Beauviour..

మంకెన పూలు “ రాద్దామనుకున్నప్పుడు నిజానికి ఇలా రాయాలని గానీ ఇలానే రాయాలన్న ఆలోచనగానీ ఏమీ లేదు. అందునా నేనేమీ అలవోకగా రాయగలిగిన చేయి తిరిగిన రచయిత్రినీ కాదు. అనుభవశాలినీ కాదు కాబట్టి కొంచెం బెరుగ్గానే ఉంది.

అయితే  చెప్పదలచుకున్నది చెప్పగలిగే శక్తి ఉన్నా.. చెప్పుకునే పరిస్థితి ఉందా అన్నదే ఇప్పుడు ప్రశ్న…

మన చిన్నప్పుడు తమకి నచ్చినవీ నచ్చనివీ స్వేచ్ఛగా యథేచ్చగా మాట్లాడుకోవడానికి మన అమ్మలకీ అమ్మమ్మలకీ కాస్త చోటుండేది… అరుగుల రూపంలో ! తలుపులు లేని మంచి అరుగులు.

అంటే తలుపులు చెడ్డవనేమీ కాదు. కాకపోతే చిక్కంతా తలపులకి వేసుకునే తలుపుల గురించే.  

తలుపులు వేసున్నప్పటికీ కాస్త ప్రయత్నించి ఒక రెక్కని కాస్తంత ఓరగా తీసి తొంగి చూస్తే ఎలా ఉంటుంది? అసలు మూసి ఉన్న తలుపుల అవతల ఏముందో ఊహించుకుంటే భలే తమాషాగా… చాలా గొప్పగా  ఉంటుంది కదూ…! ఆలోచనలకి రెక్కలొచ్చినట్లూ కొత్త దృశ్యాలేవో ఆవిష్కరింపబడే అవకాశమున్నట్లూ అనిపించదూ..
అసలు చిక్కంతా ఎక్కడొస్తుందంటే మనం ఊహించుకున్నంత వరకూ పర్వాలేదు. మాట్లాడితేనే కష్టం.. మాట్లాడినా ఓకే.. ఆవేశం తెచ్చుకుంటే ఇంకా కష్టం.. అవేశం దాటి పదండి ముందుకు.. పదండి తోసుకు.. అంటూ నడకా.. పరుగూ మొదలెడితే...

గోడలు మనకి గిట్టవు. కానీ.. గోడలకి తలుపుల మాట అటుంచి.. చిన్న చిన్న కిటికీలు కూడా వాళ్ళకి నచ్చవు. పెద్ద పెద్ద గోడలు. మనసుని కప్పేసే గోడలు. వాటికి తలుపులుంటాయి… కానీ తాళాలు వేసేసి ఉంటాయి. ఆంక్షలనబడే తాళాలు. అవునా కాదా ! ఇంక స్వేచ్ఛ అనే మాట ఎక్కడిదీ..

చిన్నప్పుడు అరుగు మీద మాట్లాడినంత స్వేచ్ఛ ఇక్కడ లేదు.   మీ మనసులోనే చక్కని పూల తోట ఉంటుంది. మల్లెలూ జాజులే కాదు. కొన్ని గడ్డిపూలూ.. మరి కొన్ని మంకెన పూలూ ఉటాయి. వీటినే మీ భావాల కూర్పు అనుకుందాం. వీటు చుట్టూ ఒక ముళ్ళ కంచె కూడా ఉంటుంది. నవ్వుతూ తుళ్ళుతూ లేడిపిల్లలా మీకుండాలనిపిస్తుంది. అక్కడే పొంచి ఉన్న ఖడ్గ మృగాలు మిమ్మల్నలా బతకనివ్వవు.

పళ్ళ చెట్టుకి ముళ్ళకంప… ప్రహరీగోడపై గాజు పెంకులు… చిక్కని రక్తం రుచి అంటే మనషికి ఎంత మక్కువో కదా…!

Yes ! No ! Alright ??

కనీసం కిటికీలనైనా ఉంచుకుందాం నేస్తమా… గాలీ వెలుతురూ వస్తుంది. వాటితో పాటు చిన్న చిన్న ఆలోచనలు.

Simone ఏమంది? మనం మనలా బ్రతకాలని చెప్పింది. 



No comments