మంకెన పూలు - 3

ఆ ప్రేమే నేరమౌను!

“When you are deeply in love and deeply connected to a woman (and vice versa), if you don’t have the liberty of slapping each other, then I don’t see anything there.”

“If you can’t slap, if you can’t touch your woman wherever you want, if you can’t kiss, I don’t see the emotion there.”

ఇటీవల ఒక దర్శకుడు తన సినిమాలోని హీరో క్యారెక్టర్ ని సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలివి. ఒకర్నొకరు చెంపలు వాయించుకునే చనువు లేకపోతే అదసలు ప్రేమేంటి !

అంటున్నాడు ఆ దర్శకుడు.

"... love is blind, and lovers cannot see the pretty follies that themselves commit," అంటాడు Shakespeare, 'The Merchant of Venice' లో. Pretty follies ..ముచ్చటైన తప్పిదాలంటే చెంపదెబ్బలు కొట్టుకోవడమా? పిడిగుద్దులు ఇచ్చుకోడమా? నిండారా ప్రేమలో మునిగినప్పుడే కాదు, ఎటువంటి సందర్భంలో అయినా, ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద చెయ్యెత్తడం తప్పే, దాష్టీకమే. దాని పరిమాణం ఎంతయినా, 'ప్రవృత్తిగా హింస అసమర్థుల ఆయుధం' అంటారు సైకాలజిస్టులు. ఇక్కడ ఆ దర్శకుడు ప్రేమ ముసుగులో సమర్థిస్తుంది పచ్చి మగ దురహంకారాన్నే.

సినిమాని సినిమా లాగే చూస్తున్నాం కాబట్టే, ఇప్పటి వరకూ వచ్చిన పాత్రల్లో భిన్నంగా ఏదైనా కనిపిస్తే దాన్ని ఆసక్తిగా చూస్తాం. బారులు తీరిన ఆడియన్స్, ఇబ్బడిముబ్బడి కలెక్షన్స్ బట్టి ఆ పాత్రని సమాజం ఆమోదించేసింది అనుకోవడం ఒట్టి భ్రమ. అమ్మాయి ఇష్టాయిష్టాలతో ఏ మాత్రం పట్టింపు లేకుండా, 'అది నా పిల్ల...' అనుకోవడం అంటే, 'నా ఆస్తి... ' అని చేసే స్థలాల కబ్జా లాంటిది. 'బలవంతులు దుర్బల జాతిని బానిసల గావించి 'న అనగరిక న్యాయం హీరోయిజంగా చూపుతున్న సినిమాలు, కబ్జాలు, దౌర్జన్యాలు సమకాలీన ధర్మాలుగా గ్లోరిఫై చేయబడుతున్న సినిమాలు యువత మీద కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. వద్దన్న దానిమీదే ఎక్కువ ఆసక్తి ఉండటం ఆ వయసులో సహజమే కదా.

దానికి తోడు, సదరు హీరో క్యారెక్టరైజేషన్ లో కనిపించేదే నిజమైన ప్రేమ అని దర్శకుడు సమర్ధించుకోవడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు? సినిమాలో అత్యంత ప్రభావవంతంగా చిత్రీకరింపబడ్డ ఒక పాత్ర ఒక జెండర్ మీద మౌలికమైన దాడి చేసే స్థితిలో ఉన్నప్పుడు అది సరియైనదే కదా అనే భావనలోకి అందరూ వెళ్లిపోతున్నప్పుడు, తప్పకుండా అందులోని తప్పులని ఎత్తి చూపించి ఆ మత్తులో నుండి బయటకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది.

కొడవళ్ళతో ఆడపిల్లల మెడలు నరికే వాళ్ళూ… ఆసిడ్ దాడులతో అమ్మాయిల ముఖాలని వికృతంగా మార్చే నికృష్టులూ… ఇలాంటి వ్యాఖ్యలని తమ ఉన్మాదానికి ఆలంబనగా చేసుకుని తామూ ఉదాత్త ప్రేమికులమనే వాదనని తీసుకుని వచ్చే అవకాశం ఉంది అనిపించడం లేదా.

చెంపదెబ్బలు కొట్టుకోవడం… ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టచ్ చెయ్యడం… అనుకున్నప్పుడల్లా ముద్దు పెట్టుకోవడంలోనే ఎమోషన్స్ ఉన్నాయి, అనుకుంటే పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ మీద ఏకపక్షంగా దాష్ఠికానికి దిగే ప్రతి ఈవ్ టీజర్ కూడా అది తనలోని ఎమోషన్ అని చెప్పి తన మనసుని తను కవరింగ్ చేసుకుంటే వాళ్ళెంత ప్రమాదకరంగా మారతారు?

శరీరం మీదో.. మనసు మీదో జరిగే దాడి అన్నది ఎప్పటికీ కూడా ప్రేమ లోని ఎమోషన్ కాదు. అది ఒక హింస. అంత కన్నా వేరేమీ కాదు. ఒకళ్లనొకళ్ళు కొట్టుకునే స్వేచ్ఛలోనే నిజమైన ప్రేమ కనిపిస్తుందంటే… పరస్పర అంగీకారంతో జరగాల్సిన సెక్స్‌ కి, లైంగిక హింసకి తేడాలేదనుకుంటే మన ఆలోచనలోనే ఏదో తేడా ఉన్నట్లు.. నరనరాల్లో పాతుకుపోయి ఉన్న పితృస్వామ్య భావజాలమే ఇలాంటి ఆలోచనలకి కారణం అవుతుంది. ఇలాంటి శారీరక లైంగిక, మానసిక హింస చాలామందిపై ఎంత ప్రభావం చూపిస్తుందంటే వాళ్ళలో ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కూడా బలీయంగా పెరిగిపోయేంతగా.

ఏ ఒక్కరి నిర్వచనాన్నోతీసుకుని ప్రేమంటే ఇదీ అని ఒక నిర్ణయానికి రావటం సరి కాకపోవచ్చు కానీ… ఖలీల్ గిబ్రాన్ చెప్పిన ఈ మాటలు చూడండి. ఈ మాటల్లోని లోతులకి వెళితే మనకి తప్పకుండా ప్రేమంటే ఏమిటో అన్నది పరిచయం అవుతుంది.

“ఒకరినొకరు ప్రేమించుకోండి, కాని ప్రేమని బంధకంగా చేసుకోకండి
దాన్ని మీ జ్ఞాన తీరాల మధ్యన కదిలే కడలిగా ఉండనివ్వండి
ఒకరి పాత్రనొకరు నింపుకోండి , కానీ ఒకే పాత్రలో తాగకండి
మీ రొట్టెలని ఒకరినొకరు ఇచ్చుకోండి కానీ ఒకే రొట్టెను పంచుకుని తినకండి
కలసిమెలసి నృత్యగానాలతో ఆనందించండి కానీ ఎవరికి వారుగా నిలిచి ఉండండి
వీణ తంత్రులు దేనికది వేరుగా ఉంటేనేమి, వాటి కంపనలన్నీ ఒకే నాదంగా పలుకుతాయి
ఒకరికొకరు హృదయాల్ని ఇచ్చుకోండి తప్ప ఒకరి మనసుని మరొకరు ఆధీనం చేసుకోకండి
జీవితపు హస్తం మాత్రమే మీ హృదయాల్ని కలిగి ఉంటుంది
జంటగా నిలవండి కానీ మరీ దగ్గరగా కాదు… ఆలయ స్తంభాల రీతిగా!”

ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలుపుకుంటూ ఒకరికొకరు ఆలంబనగా మారడంలో ఉన్న ఎమోషన్ కన్నా గొప్ప ఎమోషన్ ఏదైనా ఉంటుందా…?

మనకెంత ఇష్టమయిన వారైనా సరే… వారి కంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందనీ… దానికి మరింత మెరుగులద్దేలా తమ ప్రవర్తన ఉండాలే కానీ తమ ఆలోచనలకొక కార్బన్ కాపీలాగానో… తాము ఆడించినట్లు ఆడే మరయంత్రం లాగానో అనుకునే వాళ్ళలో ప్రేమలో ఏ నిజాయితీ ఉన్నట్లు. ప్రేమలో ఏ ఒక్కరైనా తమ వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తే అంత కన్నా నరక యాతన మరొకటి ఉంటుందా? అంతటి యాతన ఉన్నప్పుడు అది ప్రేమ అవుతుందా?

అసలు తన సమక్షంలో నిశ్చింతగా ఆదమరచి నిద్రపోగల ధీమా అన్నది అవతలి వారు ఇవ్వనప్పుడు తమ ప్రేమలో ఏ నిజాయితీని ఎమోషన్ ఫీల్ అవ్వాలి? ఒకరి ఎమోషన్స్ మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతి బంధకమైనప్పుడు అక్కడ మిగిలేది ప్రేమ కాదు… చిత్ర హింస మాత్రమే!!!


1 comment

swathi said...

Nice analysis,agree with all your points.