#WhereTheMindIsWithoutFear

“ ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో 
ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో 
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో 
సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం
విడిపోలేదో 
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో 
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో 
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో 
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి నీచే నడపబడుతుందో 
ఆ స్వేఛ్చా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.”
- విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్
దాదాపు ఒక శతాబ్దం క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కి నోబెల్ ప్రైజ్ ని తెచ్చిపెట్టిన ‘గీతాంజలి’ సంకలనంలోని ఒకానొక గీతమిది… అప్పటికీ ఇప్పటికీ ఏమి మారిందో అసలేమీ తెలియటం లేదు.
అందుకే తండ్రీ !!
మేల్కొలుపు… మేలుకొలుపు మొదలై శతాబ్దమైనా ఇంకా మెలకువ రాని నా ఈ దేశాన్ని. నా ఈ దేశపు గాలిలో ఎక్కడో గడ్డ కట్టుకుపోయినట్లున్న మానవత్వపు జ్ఞానదీపాన్ని మళ్ళీ ఒక్క సారి వెలిగించి యుగాల క్రితపు ధర్మం లోకి స్వేచ్ఛగా నా జనాన్ని నడిపించు.
చేసే పనిని బట్టే వర్ణ విభజన చేసుకున్న మహోన్నత సంస్కృతి అంటూ పెదాల నుండి వేదాలు వల్లిస్తూ వర్ణాలని బట్టే వివాహాలు అని మనసులో పాఠాలు వల్లెవేసుకుంటూ, ఆ పాఠాలను మాత్రమే యుగయుగాలుగా కరడుగట్టించుకుని అత్యంత పాశవికపు నాగరికాన్ని పరిచయం చేస్తున్న నా దేశపు వారసత్వాన్ని పురాతనపు పునాదుల నుండీ స్వచ్ఛపరచుకుంటూ రా…!
జంబూద్వీపమంటూ పురాణాల నుండి చెప్పుకుంటున్న దేశంలో… ప్రతి ఊరూ ఒక ఖండమై కులానికొక ద్వీపాన్ని కేటాయించుకుని, ఉన్న కాస్త మట్టికీ కులాన్ని రాసేసుకున్న వికటత్వాన్ని కూకటి వేళ్ళతో పెకలించుకుంటూ రా…!
అవును తండ్రీ !!
నాదేశం పురాతనం… ఎంత పురాతనమంటే… పని విభజనకంటూ మొదలైన చతుర్వర్ణాలు కొన్ని వేలకులాల ఊడలై వేళ్ళూనకున్నంత ప్రాచీనతత్త్వం. పని విభజన మాయమై జన్మని బట్టి విభజనని అంతరాంతరాలలో కణకణంలో నింపేసుకుని… ఎవరికి వారు పవిత్రతని… క్షాత్రియ ధర్మాలని, వాణిజ్య వ్యవహారాలనీ తమ తమ వారసత్వాలకి దఖలుపరస్తూ… మిగిలిన వారసత్వాలన్నీ నీచజన్మలంటూ అంటరానితనాన్ని అంటుగట్టుకుంటూ… ప్రకృతి ధర్మాలని కోల్పోతున్న నా జాతికి బుద్ధివికాసాన్ని వెలిగించు తండ్రీ…!
పవిత్రత మొత్తాన్నీ పురాణేతిహాసాల్లో నింపేసినందువల్లనేమో, మనసుల నిండా అపవిత్రతని అప్రతిహతంగా పోగుచేసుకుంటూ మురికిపట్టి మలినమైన ఏ ఒక్క మనిషినీ వదలకుండా,అనాది నుండీ స్వజాతి మీద దాడి చెయ్యని జంతుధర్మాన్ని బహుమతిగా ఇవ్వు తండ్రీ…!
అవును తండ్రీ… స్వజాతిని ఆబగా కబళించే నేటి మనిషి ధర్మం మాకొద్దు… ప్రకృతిని వికృతి చెయ్యని జంతుధర్మమే మాకు ముద్దు... ! ఆ ధర్మాన్ని మాత్రమే మేల్కొలుపు!!!


No comments