నికషం

‘చర్మం క్రింది మనిషి… 
ఆలోచనల్లోని మనిషి…
ఎవడసలైన మనిషి ?’

ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందో లేదో తెలియక పోవచ్చు కానీ… మన చర్మం క్రింది మనిషిని చూడటానికి పనికి వచ్చే అద్దం లాంటి పుస్తకం మాత్రం నా వరకు నాకు పరిచయం అయ్యింది. అదే కాశీభట్ల వేణుగోపాల్ గారి ‘నికషం’
నికషం అంటే గీటు రాయి అట. తెలుగు నిఘంటువు చూసి తెలుసుకున్న అర్థమిది. ఇలా లోపలి వెళ్లి మూలాన్ని తెలుసుకోవటమే ఈ రచన ముఖ్య ఉద్దేశ్యం ఏమో అన్న భావన పుస్తకం మొత్తం చదివాక అనిపించింది.
నిజమే… ఈ పుస్తకం మొత్తం చదివాక మన చర్మం క్రింద మనం ఎలా ఉంటామో తెలుసుకోవాలన్న భావన… లోలోపల మనమంతా ఇలానే ఉంటాం కదా అన్న ఆలోచన ఒక్క సారైనా కలగకపోతే, చదువరులుగా మనల్ని మనం పునఃసమీక్షించుకోవాల్సిందే…
అసలేముంది ఈ పుస్తకం లో…
అసలేమీ లేదు… అవును. కథగా చెప్పటానికి ఏమీ లేదు. అలెక్స్ రామసూరి అనబడే ఒక బొల్లి వ్యాధిగ్రస్తునికి దగ్గరగా ఉన్న సమాజ చిత్రణ. అసలు సమాజం ఇంత పెద్దది అని చూపించాలి అంటే అనేక పాత్రలు ఉండాల్సిన అవసరం లేదు, నిక్కచ్చిగా రాస్తే నాలుగైదు పాత్రల నుండే సమాజపు అన్ని కోణాలని పరిచయం చెయ్యవచ్చు. ఆ విషయమే ఈ రచన బలంగా చెపుతుంది.
‘ కళ్ళలోంచీ దూకుతున్న దుఃఖం…
నోటినిండా నవ్వు… 
ఒంటి నిండా సకల వర్ణాలూ కలగలిసిన అలెక్స్… ’
ఆ అలెక్స్ కథే ఇది.
అలెక్స్ రామసూరి - తన తల్లి నిరాకరణతో మొదలైన ప్రయాణం ఒక వేశ్యకూడా తనని తిరస్కరించటంలో డ్రగ్స్ కి బానిస అయిన అతని మానసిక స్థితి సమాజంమీద కసిగా మారి తనని తాను ఒక అంతర్యుద్ధంలోకి వెళ్లేలా చేస్తుంది. అదే సమయంలో ప్రియ అనబడే కాన్సర్ పేషంట్ వలన తనకి ఒక సహానుభూతి పరిచయం అవుతుంది. ప్రియకి… ఆమె తల్లి గాయత్రికి ఒక ఆదరువై నిలుస్తాడు. ముంతాజ్ అనే పాత స్నేహితురాలు అలెక్స్ గురించి చెప్పిన మాటల వలన, తనని తనగా ఇష్టపడే స్నేహితులు కూడా ఒకానొక దశలో తను ఒక పెర్వర్టెడ్ పర్సన్ గా మారుతున్నాడేమో అని భావించటం జరుగుతుంది. తనని ఏవిధమైన సంకోచాలూ, సహ్యాసహ్యాలూ లేకుండా ప్రేమించే ఏకైక వ్యక్తి అయిన ప్రియ మరణంతో అలెక్స్ అప్పటి వరకూ తనదైన ప్రపంచంతో తనకున్న బంధాలన్నిటినీ త్యజించుకుని దూరతీరాలకి వెళ్ళిపోతాడు.
అన్నిటికన్నా ఈ పుస్తకంలోని విశేషమేమిటంటే అసలు ఏ పాత్ర మీద కూడా నెగటివ్ ఫీల్ మనకి రాదు. ఏ పాత్రకి ఆ పాత్ర కరెక్ట్ అనే అనిపిస్తుంది. ఒక పాత్ర ప్రభావమంతమైన ఆలోచనలని మనలో ఎప్పుడు కలగ చేస్తుంది? ఆ పాత్ర ఆలోచనలలోకి మనకి తెలియకుండానే మనల్ని మనం నడిపించుకున్నప్పుడు. అంతే కదా… ఒక పాత్ర కథ నుండి జీవితం లోకి మనం ప్రయాణం చేసేలా రాయబడిన అక్షరాల కన్నా ఉత్కృష్టమైనవి ఏముంటాయి ?

ఎదుటి వ్యక్తిని తన కోణం నుండి చూస్తే… లోకం లోని చాలా సమస్యలకి చాలా తేలిగ్గా సమాధానాలు దొరుకుతాయి. నైతికతలూ… అనైతికతలూ అన్నీ తకరారు అయిపోతాయి.
నిజానికి అలెక్స్ ని ఇందులోని ఏ ప్రధాన పాత్ర కూడా తక్కువగా చూడదు. ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్స్, ఆఫీస్ లో బాస్ తనని తనలా accept చేసిన వారే. అంతే కాదు ఒక సారి తనని డ్రగ్స్ కేసు లో అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ కూడా అలెక్స్ అని చాలా మర్యాదగానే చూస్తాడు. అయినా సరే ‘అలెక్స్’ తాను ఒక అనాథ అన్న భావనతోనే ఉంటాడు. సమాజం పట్ల ఒక లాంటి ఏహ్యతతో ఉన్నాడేమో అన్నట్లే అనిపిస్తూ ఉంటాడు. తన ప్రవర్తనలో పెర్వర్షన్ ఛాయలూ మనకి పరిచయం అవుతూ ఉంటాయి. కానీ అవేమీ అలెక్స్ వ్యక్తిత్వాన్ని మసకబార్చేలా ఉండవు.
ఇందులో అలెక్స్ అంటే రచయితకి ఎంత ఇష్టమో చూడండి.
‘ఆ అలెక్స్… 
ఒక వర్ణ సముచ్చయం 
అలెక్స్… ఒక రంగుల ముద్ద 
అలెక్స్… అన్ని రంగులు 
అన్ని రంగులూ… అలెక్స్… 
వాడిప్పుడు ప్రకృతిలోని సకలవర్ణాలనీ, వర్ణ సముద్రాలనీ తాగేసిన వాడు. ‘
రచన మొత్తంలో అలెక్స్ ని ఇలాంటి ఎన్నో వర్ణనలతో నింపేసి, ఎక్కడ కూడా పొరపాటున కూడా మనకి అలెక్స్ అంటే జుగుప్స కలిగించడు. తను అలెక్స్ ని ఎంతగా ఇష్టపడ్డాడో అంతకు మిన్నగా మనం ఇష్టపడాలి అన్నట్లుగా సాగిపోతుంది ఈ రచన.
అలెక్స్ రూపమూ… నడవడికా… డైరీ లో పచ్చిగా రాసినట్లు అనిపించే అక్షరాలూ అన్నీ కూడా సమాజపు చలన సూత్రాల పరిధిలో ఇమిడేవి కావు. కానీ వాటన్నిటినీ మనం యథాతథంగా ఆమోదించేస్తాం. ఆ కాసేపూ మనకి ఇన్నాళ్లూ మనవి అనుకునే నీతి సూత్రాల పరిధిని చెరిపేసుకుంటాం. అలెక్స్ ని మనసుకి దగ్గరగా హత్తుకుంటాం. అసలు అలెక్స్ కి ఇవ్వగలిగినంత ప్రేమ ఈ రచనలోని పాత్రల పరిధుల నుండి సరిపోదనేమో ఆ పరిధుల్ని దాటుకొంటూ చదువరుల మనసుల నుండి అపరిమితంగా… అనంతంగా ప్రవహించేలా ఒక ప్రేమ వాగుని తవ్వేసి మనకిచ్చేసాడేమో రచయిత అని అనిపిస్తుంది.
ఇంకొక విశేషం ఏమిటంటే ఈ రచనలో ఎక్కడా కూడా మనకి సందేశం చెప్పిన ప్రయత్నమే కనిపించదు. ఒక ఆలోచనలోకి నెమ్మదిగా మనల్ని నడిపించుకుని వెళ్ళటం తప్ప.
‘సౌందర్యం ఎప్పుడూ నమ్మకద్రోహం చేస్తుందిరా ! ముందు దాని మీద అపారనమ్మకం పెంచుకునేలా అమాయకంగా ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా ఒకానొక లౌల్యంతో దాని వెంటబడేలా చేసుకుంటుంది. దాంతర్వాతోక్షణాన ఉన్నట్టుండి హఠాత్తుగా నుసిగా మారిపోయి రేణువులు రేణువులుగా కొట్టుకుపోయి అదృశ్యమయిపోతుంది.’
ఎంతటి నిజమిది. దైహికమైన సౌందర్యం మీది భ్రమలో యావత్ప్రపంచమూ తనని తాను ఎంతటి మోసం చేసుకుంటుంది. తనని తానూ ఎంత కోల్పోతూ ఉంటుంది.
బాహ్యసౌందర్యం మీద మనిషి ఏర్పరుచుకున్న భ్రమలు… ఆ సౌందర్యపు కొలతలతో ఇమడని వారి మానసిక స్థితిని ఎంతలా ఛిద్రం చేస్తాయో అన్న ఆలోచనలోకి మనం ఒక్క సారి వెళ్లి చూడగలిగితే ఇకపై ఈ ప్రపంచం ఇలా ఉండదు. తన సామాజిక సూత్రాల పునర్నిర్వచనం మొదలవుతుంది కూడా…
అలెక్స్ జీవితం ఎంతగా మనల్ని కదిలించేలా రాసారో , దుర్గ & కథకుని పాత్రల ద్వారా స్నేహం యొక్క ఉన్నత విలువలని, కావేరి పాత్ర ద్వారా భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనురాగవంతమైన బంధాన్నీ అంతే ప్రభావవంతంగా చెప్పారు రచయిత.
మనలోని మరో మనిషిని మనం గుర్తు పట్టినా… సమాజపు నియమాలకు లోబడి అతన్ని బయటకు రానివ్వకుండా బందీని చేసేస్తాం. మనకి మనమే పూర్తిగా ఆవిష్కృతం అవ్వకుండానే సమాధి చెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఆ పరంపరలో అడుగడుగునా మనకి ఎదురయ్యే ‘ఏది నైతికత… ఏది అనైతికత… ఏది నీతి... ఏది నిజాయితీ…’ ఇలాంటి ఎన్నో ద్వైదీ భావనలని కొలవగలిగే గీటురాయి ఏమిటో తెలియక సమాజంతో పాటే తామే సమాజమై నడిచేస్తూ ఉంటాం. ఇలాంటి ఏ పుస్తకంమో చదవటం జరిగినప్పుడు ఒక ఆలోచనా స్రవంతి మొదలవ్వటమూ… మనల్ని మనం పునర్నిర్వచనమ్ చేసుకోవాలి అనిపించటమూ సహజంగా జరుగుతుంది. కానీ ఆచరణలో అది ఎంత వరకూ సాధ్యమవుతుందో కాలమే సమాధానం చెప్పాల్సిందే.
ఇదంతా పక్కన పెడితే, అక్షరం అక్షరం ఒక ఆలోచనగా మారటం అన్నది ఏ కొన్ని రచనల విషయంలోనో సాధ్యం అవుతుంది. అలాంటి కొన్ని రచనల్లో మేలిమి ‘నికషం’ ఈ నికషం.







No comments