మెట మార్ఫసిస్

కొన్నిసార్లంతే!! 
మన జీవితం మనకి ఏమాత్రం నచ్చదు. ఎందుకు నచ్చటం లేదో మనకి తెలుసు. కారణాలన్నీ మన చుట్టూనే ఉంటాయి. ఏది మార్చుకోవాలో ఎలా మార్చుకోవాలో కూడా మనకి తెలుసు.
అయినా ఏదో ఒక నిస్సహాయత మనల్ని ఆపేస్తుంది. లోలోన పొరలు గట్టిన నిర్లిప్తత మనల్ని బంధించేస్తుంది. మనకి మనమే పంజరమైన భావన... మనకి మనమే పంజరంలో ఒదిగిపోతున్నామన్న మానసిక స్థితి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. 
అప్పుడే... 
మనం ఉన్న స్థితి నుంచి కొంత స్వేచ్ఛ కావాలనిపిస్తుంది. కొన్ని సంకెళ్ళ నుండి స్వేఛ్చ.. కొన్ని భావాల నుండి స్వేచ్ఛ.... 
ఒవిడ్ కావ్యం "మెటమార్ఫసిస్ " చదివారా!! నాకు ఎంతో ఇష్టమైన కావ్యం అది. 
అందులో ఒక సన్నివేశం...
గ్రీకు దేవుడు అపోలో మోహంతో డాఫ్నె అనే వనదేవత వెంట పడతాడు. అతని నుంచి తప్పించుకోవడానికి నదీ దేవుడైన పీనియస్‌ని రక్షణ కోరుతుంది. ఆ సన్నివేశాన్ని ఒవిడ్ ఇలా రాస్తాడు.
" ప్రార్ధన ఆపిన మరుక్షణం ఆమె అవయవాల్లో ఒక బరువు పాకింది.
ఆమె శిరోజాలు ఆకులుగా..
చేతులు కొమ్మలుగా మారాయి.
క్షణం క్రితం చురుకుగా కదిలిన ఆమె పాదాలు వేర్లలా మారి భూమిలో పాతుకు పోయాయి..."
ఇలా రూపాంతరం చెందే వరకూ డాఫ్నే పరిగెడుతూనే ఉంది. చూడడానికి ఆమె సమస్తం కోల్పోయినట్లు ఉండవచ్చు. స్వేచ్ఛ కోల్పోయి చెట్టులా మిగిలిపోయినట్లు ఉండవచ్చు.. కానీ ఆ రూపాంతరమే ఆమెకి విముక్తి. 
ఇప్పుడు నేను కూడా అంతే.. ఒకానొక సంఘర్షణ నుంచి విముక్తి పొందడంకోసం... కొన్నిరోజులు నా ప్రపంచంలో అత్యంత ఇష్టమైన... వ్యాపకాల్ని దూరం చేసుకున్నా...
ఇప్పుడు నాకు మరలా కొత్త జన్మ ఎత్తినట్లు ఉంది. 
అయితే ఈ మార్పుకు నేను చాలా మూల్యం చెల్లించుకున్నాను. 
నా స్నేహ ప్రపంచంలో ఒక సమూహాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నాను.
డాఫ్నేలాగే ఇరుక్కు పోయిన భావనని అనుభవించాను.
నాలో సత్తువ అంతా తోడేసే పెనుగులాటను..
మెలితిప్పే సంఘర్షణను... 
ఒక నిరంతర వైఫల్య భావనను ఎట్టకేలకు జయించాను.
ఇప్పుడు మరింత స్వేచ్ఛగా...
మరింత భద్రంగా అనిపిస్తోంది.
ఇపుడు డాఫ్నేలా నాకు ఒక దళసరి బెరడు రక్షణగా లేకపోవచ్చు...
కానీ 
అంతకన్నా దృఢమైన స్వేచ్ఛ కలిగిన మనసు ఉంది...
స్వేచ్ఛలోని స్వచ్ఛతని ఒంపుకుని తాగాక 
ఇప్పుడు మనసంతా పూల రెక్కల విహంగంలా లోకాన్ని తిరిగేస్తుంది


No comments