గల్లీ పోరడి అరుపు!!

ఎవరీ రోల్‌రైడా!! 
ఇన్నాళ్ళూ ఎలా మిస్ అయ్యాం ఈ గల్లీ పోరడిని! 
బిగ్‌బాస్ చూసే ఓపిక, ధైర్యం నాకయితే అస్సలు లేవు. ఈ మధ్య ఎప్పుడో తోచక ఛానెల్స్ తిప్పుతుంటే, అనుకోకుండా ఒక ఎపిసోడ్ చూసా. నాలుగ్గోడల మధ్య ఒక రకంగా బందీలుగా ఉన్న కొంతమంది మనుష్యులు. ..
వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ పనీ పాటూ లేని మనం. కృత్రిమమైన వాతావరణం! అంతకన్నా కృత్రిమమైన ఎమోషన్స్. ఎబ్బెట్టుగా.. సహనానికి పరీక్షగా!
అదిగో, వాళ్ళందరి మధ్యలో ఈ అబ్బాయి చాలా ప్రత్యేకంగా అనిపించాడు. కొంచం మురికిగా, మాసిన గెడ్డం.. అయినా భలే స్వఛ్చంగా అనిపించాడు. కళ్ళల్లో కొంచం దయ, నవ్వులో ఏదో మెత్తదనం, అల్లరి చేసినప్పుడు, తెల్లని పళ్ళు కనిపించేలా నవ్వినప్పుడు అచ్చం మన పక్క గల్లీ పోరడిలా..
సరిగ్గా అప్పుడే మా అబ్బాయి రోల్‌రైడా చేసిన వీడియో చూపించాడు.
"అరుపు" వీడియో భలే ఉంది.
కల్మషంలేని చిరునవ్వులు చిందించే పసిపాపల్లో కూడా కామాన్ని వెతికే కొందరు నరరూప రాక్షసుల్ని, చదువుకుందామని స్కూల్ కి వెళితే కీచకులుగా మారిన కొందరు గురువుల్నీ, బంధువులు అని నమ్మితే రాబందులుగా మారి వేధించిన కొందరు ప్రభుద్ధుల్ని...
ఇలా ఒకరిని కాదు, సమాజంలో రక రకాలు గా స్త్రీ పడుతున్న హింసనీ..
రక రకాల కారణాలతో బయటకు చెప్పుకోలేక, చెప్పుకున్నా సరైన న్యాయం జరగక అనేక మంది పడుతున్న నరక యాతననీ కళ్ళకు కట్టినట్లు చెప్పాడు ఈ వీడియోలో.
#Breakthesilence "నీ మౌనాన్ని వీడు"..
ఇదే "అరుపు" కాన్సెప్ట్.
"మమ్మల్ని వదిలేయండి, ఏమీ చేయకండి" అని ప్రార్ధించే చేతులని పిడికిలిగా మార్చి, ఈ కలి కాలంలో ప్రతీ ఒక్క స్త్రీ కల్కిగా మారాలని చెప్తోంది "అరుపు". అసలు లిరిక్స్ చదువుతుంటేనే చాలా భావోద్వేగంగా అనిపించింది. లిరిక్స్ రోల్‌రైడా నే రాసాడని తెలిసాకా చాలా ఆశ్చర్యంగా , చాలా చాలా సంతోషం గా అనిపించింది.
సాదా సీదా గా కనిపిస్తున్న ఈ గల్లీ అబ్బాయి ఎంత లోతైన , ఎంత గొప్ప మనసున్న మనిషి కదా.
రోల్!! 
నీకు ఫిదా అయిపోయాం.
నువ్వు ఆ పిచ్చి షో లో గెలిచినా ఓడినా.. మాకేం ఫికర్ లేదు.
మా హృదయాలని గెల్చావు చాలు.


No comments