ఒక నీకు

ద్వేషాన్ని కూడా నిలుపుకోలేనంత సున్నితత్వం నీలో నిండి పోయాక 
కన్నీళ్లు తప్ప నీకు మిగిలేదేముంది చెప్పు..
గాయాల పచ్చి ఆరబెట్టుకోవడం 
ఇంకొన్ని గాయాలకు నిన్ను సిద్ధం చేసుకోవడం 
ఇదే కదా జీవితం అంటే…
తడబడుతూ కూడ బలుక్కుని నువ్వడిగే ప్రశ్నలకి సమాధానం లేని చోట 
బ్లేమ్ గేమ్ గా ముద్రించబడే నీ కష్టం ఎవరికీ కష్టం కాని చోట 
నీ వేదన నీకే వ్యసనంగా మారుతుంది.
నీ స్వంత వేదన లోంచి దాన్నొక సామూహిక వేదనగా తీసుకెళ్ళే సమయానికి నీ జీవిత కాలం ముగిసిపోతుంది.
కాపాడుకోవాల్సిన విలువలు నీ నెత్తిమీద నాట్యం చేసి నువ్వు కోల్పోయిన వాటిని నీకు గుర్తు లేకుండా చేస్తాయి.
బతకడానికి ఒక్కటంటే ఒక్క భరోసా చాలని నువ్వనుకుంటావ్. అసలు నీ పుట్టుకలోనే లేని భరోసాని నువ్వు కలగనటమే తప్పని 
తెలుస్తుందా నీకు..
ఈ లోకం అందరి కోసం కాదు… కొందరికోసమే అని నువ్వెన్ని సార్లు చదివుంటావో కదా..… 
అయినా సరే ఆశపడుతూనే ఉంటావ్. 
అందరికీ ఆ కొందరి అవకాశం రావాలని. 
అంతా కొత్తగా మారిపోవాలని. ....
నీ అద్దంలోనే నీకు నువ్వు కొత్తగా కనపడవు కదా.. 
మరి అంతా మారిపోవాలని అనుకోవటం ఎంతటి భ్రమో తెలుసా నీకు..
అంతా ముగిసిపోయాకే తెలుస్తుంది… నువ్వెప్పుడూ కలలతత్వంలోనే ఉన్నావని… 
ఆ కలల తత్వమే అంధత్వమని….
గుక్కెడంత మంచి నీటి వర్షాన్ని నువ్వు కలగనే చోట ..
నీ దప్పిక తీర్చటానికి సముద్రాన్నే నీ ముందుకు తెస్తారు… 
మరి నువ్వు దాన్ని తాగగలిగిన రోజున మళ్ళీ మాట్లాడుకుందాం


No comments