#Uppalapadu Bird Sanctuary"

01.01.2019 5am.. 
ప్రపంచం కొత్త సంవత్సరం మత్తులోంచి తేరుకోలేదనుకుంటా.. అంతా ప్రశాంతంగా ఉంది.
సూర్యుడు కూడా ఇంకా మంచుతెరల మాటునే దాక్కున్న వేళ.. మేం ఉప్పలపాడు బయలు దేరాం.
మంగళగిరి నుంచి దాదాపు 20 కి.మి లు దూరంలో ఉంది ఉప్పలపాడు. అచ్చమైన పల్లెటూరు. ఊర్లో దారంతా అందమైన ముగ్గులు వేసి ఉన్నాయి. ప్రతీ ఇంటి ముందూ పెద్ద ముగ్గూ, గొబ్బెమ్మలు.. వాటి మీద బంతి పూలు. .. ఎవరూ తొక్కకుండా అనుకుంటా చుట్టూరా రాళ్ళు.
ముగ్గులు చూస్తూ, అతి కష్టం మీద అవి తొక్కకుండా కారుని దాటిస్తూ Bird Sanctuary అడ్రస్ కోసం ప్రయత్నించాం. అప్పటికింకా ఎవరూ నిద్రలేవలేదు. ఊరి రోడ్లమీద బోర్డు కూడా కనిపించలేదు. ఇంతలో గేదెల సావిట్లో కనిపించాడొకాయన. దగ్గరకెళ్ళి పక్షుల్ని చూడడానికి వచ్చాం అని చెప్పాం. ఆయన దారి చూపించారు.
ఉప్పలపాడు ఊరికి దాదాపు చివరి సందులో ఉంది Bird Sanctuary.
తెల్లటి మంచుని తొలుచుకుంటూ … నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళితే ఒక పక్కగా చెరువు… చెరువు మధ్యలో మంచు దుప్పటి కప్పుకున్న ఆకు పచ్చని చెట్ల మీద వెన్న ముద్దల్లా ఏవో వెలుగు దివ్వెలు.
మమ్మల్ని చూసి ప్రేక్షకులు వచ్చాయి అనుకున్నాయేమో… అప్పటివరకూ బద్ధకంగా పడుకుని ఉన్న ప్రకృతిలోకి ఒక ఉత్సాహాన్ని వంపుతూ.. టపటపా రెక్కలు చాపుకుంటూ గాలిలోకి ఎగురుతూ తమ ముచ్చట్లతో సూరీడికి సుప్రభాతం పాడటం మొదలు పెట్టాయి.
తెల తెల్లటి పక్షులు.!!
Spot billed pelicans .. Painted Storks.. వందలు, వేలు.. చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు. మేం వెళ్ళేటప్పటికి పూర్తిగా తెల్లవారలేదు. పక్షులు అప్పుడప్పుడే నిద్రలేస్తున్నాయి. కాసేపటికి మొదలయింది సందడి. చెరువులో చేపల వేట మొదలెట్టాయి. వాటి విన్యాసాలు చూడడానికి రెండు కళ్ళూ చాలలేదు.
బద్ధకం ఏ క్షణంలో అయినా వచ్చి తమ రెక్కల మీద ఎక్కడ వాలుతుందో అన్న భయం వేసినట్లుగా అవన్నీ అలా రెక్కల్ని చాచుకుంటూ… గిరికీలు కొడుతూ… గాలి అలలతో నిశ్శబ్దాన్ని ఆమడ దూరం తరిమెయ్యడం చూస్తుంటే… అసలు ఏ ఉదయమైనా ఇలా కదా మొదలవ్వాలి అనిపించింది.
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పక్షులు అక్కడికి వస్తాయట. గుడ్లు పొదిగి పిల్లలు అయ్యాక వెళిపోతాయి. గ్రామస్థులు స్వచ్చందంగా చెరువులో సగ భాగం Sanctuary కి ఇచ్చేసారు. మనం కూర్చుని పక్షుల విన్యాసాలు చూడడానికి చిన్న చిన్న హట్స్ కట్టారు. ఎంత సేపయినా కూర్చునిచూడొచ్చు మనం.
ఆ ఆవరణలోనే చిన్న పార్కు, ఒక చిన్న రెస్టారెంటు ఉన్నాయి. ఎంత సమయం అయినా గడపొచ్చు. అయితే తాగిన వాటర్ బాటిల్స్, తిన్న ఆహారపు వ్యర్ధాలు చెరువులో కనిపిస్తున్నాయి. అదే కొంచం బాధగా అనిపించింది.
మనిషి స్నేహం నెరపడానికి ఒక అడుగు ముందుకు వేస్తే ప్రకృతి తనని మనసారా హత్తుకోవడానికి వంద అడుగులు ముందుకు వస్తుంది కదా అనిపించింది.
అప్పుడప్పుడూ మనకి మనం దగ్గరగా జరగాలంటే ఇలా ప్రకృతి నిలిచిన చోటుకి వెళ్ళాల్సిందే...


No comments