#WinterMusings

ఒకానొక మంచుకురిసే ఉదయాన
వెలుగు రేఖల సాక్షిగా
నీ మనసు తలుపులు నువ్వే తెరుస్తావ్
అద్దం ముందు నుంచుని 
నీ ప్రతి రూపం కళ్ళల్లోకి చూసుకుని పక్కున నవ్వుకుంటావ్
అదిగో అప్పుడే అర్ధం అవుతుంది..
నిన్ను నువ్వు మట్టిగా మార్చుకుని 
మొలకెత్తించిన నవ్వుల నీడల మాటున 
తలదాచుకుంటున్న స్థిమితత్వంలో 
ఇక నిన్ను వెంటాడే అలసటలన్నీ అస్థిమితాలే అని!
నీకోసం నువ్వొక పుష్పగుచ్ఛంగా మారిపోతున్న 
ఈ సమయాలన్నీ సీతాకోకలై ,
కాసిన్ని తేనె చుక్కలతో తమ రెక్కలపై 
ఎన్నటికీ చెరగని 
తీయని చిత్రాలని చిత్రించుకునే 
రహస్య తావుల్ని 
నీ అరచేతుల్లో వాల్చుకుంటావు..
ఇన్నాళ్ళు ఎవరికోసమో 
నువ్వు నవ్వని ఓ నవ్వుతో 
నీ కోసం నువ్వు ఏడవని నీ కన్నీళ్ళతో
ఈ ఏకాంతపు నిశ్శబ్దాన్ని అభిషేకం చేస్తావ్!


No comments