వచ్చే పోయే వానల్లో..

కొన్ని నిత్య భయాలు, ఆ భయాలు వెనక్కి లాగేసే జీవితాలు.. ఎలా ఉంటాయి.
బహుశా ఇలా వచ్చే పోయే వానల్లో తడుస్తూ, పొడి బారిపోయిన మనసుల్ని తడి చేసుకుంటూ.. తమకి తామే చేసుకున్న గాయాలకి ఆశల లేపనాలు పూసుకుంటూ..
నిశీ స్పందన చదివాక, ఇంక రాయొద్దులే అనుకున్నా. కానీ ఎందుకో గానీ మళ్ళీ రాయాలనిపించి ఇలా..
అసలు Abstrat లో ఉన్న గొప్పతనమే ఇది. మన మనసు అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఎదురుగా ఉన్న చిత్రమైనా, కధ అయినా అర్ధం అవుతుంది.
" ఈ నగరాన్ని ప్రేమించాలని చాలాసార్లు అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడే కచ్చితంగా ద్వేషించడానికి కావలిసిందేదో వెంటనే డ్రమేటిక్ గా సృష్టించేస్తుందీ హైదరాబాద్" ...
ఇది కొన్ని రోజుల క్రితం బహుశా ఈ కధకి నాందీ ప్రస్తావన అఫ్సర్ తన టైంలైన్ లో పెట్టారు. అప్పుడే చాలా కుతూహలంగా అనిపించింది.
అందులోనూ ఈ Abstract కి అది కచ్చితంగా సరిపోయింది.
భయం... భయం.. అతనికి అంతా భయమే. ఆమెని చాలా చాలా ప్రేమించాడు కాబట్టి దగ్గరయ్యేకొద్దీ అమ్మ లాగా, నాన్నలాగా దూరం అయిపోతుందని భయం. 
కధ అంతా చదివాక నా మనసు వరకూ అర్ధం అయిందేమిటంటే ఆమె అప్పుడప్పుడూ తన గదికి వచ్చి వెళ్ళడం కూడా అతని అబ్సెషన్ లో భాగమని. ఆమె మీద అంతులేని ప్రేమ ఉంది అతనికి. ఆమె వెళిపోయిందని తెలుసు. మళ్ళీ వివాహం అయిందని కూడా తెలుసు. తను వచ్చిపోతుందన్నది అతని గాఢమైన ఆశలోంచి ఊహ అనుకుంటున్నా. అందుకే తల్లి పాత్ర చేత కూడా, "తాము మళ్ళీ పెళ్ళితో ముడి పడతామని ఆమె చివరి వరకూ ఎదురు చూసింది అంటాడు.
అయితే, ఒకవేళ నా ఈ Assumption తప్పు అయితే మాత్రం... ఆమె నిజం గా వచ్చిపోవడమన్నది నిజమే అయితే మాత్రం నాకు ఆమె పాత్ర అస్సలు నచ్చలేదు.
ఆమె అతని పట్ల ప్రేమతో వచ్చేదైతే మళ్ళీ పెళ్ళి చేసుకోదు. పెళ్ళి చేసుకున్నాక అతని దగ్గరకు రావడం తప్పని నా ఉద్దేశం కాదు. రావాలన్న ఆశ ఉన్నప్పుడు అసలు వెళ్ళడం ఎందుకని. జాలి పడినా కనీసం... అసలు వెళ్ళకూడదు కదా.. అయిదు సంవత్సరాలు ప్రేమించి, రెండేళ్ళు వైవాహిక జీవితంలో ఉండి... అతని గీతల్ని అర్ధం చేసుకోలేకపోవచ్చు. కనీసం అతని మనసులో ఉన్న భయాలు.. అవి ఏ పునాదుల మీదుగా అంత బలంగా తయారయ్యాయో తెలుసుకోవాలి కదా.
వివాహ బంధంలో ఉన్న అనిశ్చితి కంటే, ఎలాంటి ఆశలూ, ఆపేక్షలూ లేని బంధం లోని అనిశ్చితి నయం అంటుంది ఆమె. .. అసలు ఏం అనిశ్చితి అది. అసలు ఆమెకి అతని పై ఉన్నది కేవలం అలవాటైన అతని సాంగత్యమేమో అనిపించింది. అసలు అతని భయాలు దూరం చేయడానికి ఆమె ఏమీ చేయలేదు కదా. 
"ఆమె ఒక్కటే నిజం అనికదా తన నమ్మకం!!
కాదా??"
కాదు ..అయితేనే నాకు ఈ కధ నచ్చింది. ఆమె నిజం అయితే.. ఊహూ..

No comments