#UnSungMelodies-3

ఇలా కొంచెం విశ్రాంతి పోగు పడ్డాక 
నిర్లిప్తతలన్నిటినీ నిశ్శబ్దం చేసుకుంటూ 
వస్తున్నప్పుడు, 
మిణుగురుల్లాంటి నవ్వులు కొన్ని 
తుమ్మెదలుగా మారి నా హృదయం పై వాలి 
నా ఏకాంతాన్ని పొలమారెలా చేసాయి
ఏకాంతమంతా
నువ్వు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలే చప్పుడు చేస్తుంటే 
చాలా దగ్గరగా 
నువ్వు వినబడుతున్నట్లుంది
నీ మాటల నిండా 
నేను ఒదిగి ఉన్నంత సేపూ 
గుండె మీద ఉన్న పాత గాట్లన్నిటిమీద 
వెన్న రాస్తున్న 
సమాధానమే నువ్వు అని తలపుకొచ్చింది
నీలోనే కళ్ళు తెరవడం అలవాటైపోయాక 
నా కన్రెప్పలకి తడి అంటిన దాఖాలాలింక లేవు.
నీదొక గాయం 
నాదొక గాయం అనుకున్నంత సేపూ 
గాయాలు గుణింతాలుగా హెచ్చవేతలై 
ఎప్పటికీ మాను పడని మహాగాయాలవుతాయి
నీ గాయం నుండి నేను
నా గాయం నుండి నువ్వు 
కన్నీరుగా కురిసినప్పుడు 
మునివేళ్ళ స్పర్శ నుండి 
ఒక నిజమైన నవ్వేదో పుట్టిన అలికిడవుతుంది
అదిగో… అప్పుడే 
గాయాలన్నీ కాలం కౌగిట్లో 
శిలాజాలుగా రూపాంతరమవ్వడం మొదలవుతుంది



No comments