#FaizAhmedFaiz

మీరిప్పుడు ఇంకా అవసరం..
ఒక మంచి భావానికి... లిట్మస్ టెస్ట్ ఏమన్నా ఉందా!!!
ఏమో!!
నా దృష్టిలో అయితే.. ఒక మంచి భావం... అది కవిత అవచ్చు. కధ అవచ్చు.. లేకపోతే ఒక చిన్న విశ్లేషణ అవచ్చు... 
అది చదివాక మనలో ఒక ఉత్తేజం కలగాలి!!
పదే పదే స్ఫురణకు రావాలి! ఇంతకు ముందు లేని కలవరం ఏదో మన అనుభవం లోకి రావాలి..
ఏ ఇజానికి భావజాలానికి నిమిత్తం లేకుండా ఆ అక్షరాలు మనల్ని వెంటాడాలి.. 
అలా మనల్ని వెంటాడే కవితలు ప్రముఖ ఉర్దూ రచయిత, విప్లవకారుడు అయిన "ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలు".
ఫైజ్ అంటే "తోటి మనుషుల సేవకు అంకితం.." అని అర్ధం అట. ఫైజ్ తన కవితల ద్వారా ఆ పేరును సార్ధకం చేసుకున్నారు.
ఏంతో మందిలా ఫైజ్ కూడా భారత దేశం బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి అయితే పేదలు, కష్టజీవులూ కూడా అన్ని రకాల దోపిడీ నుండీ విముక్తులవుతారని ఆశించాడు. ఆ నిరాశ కలిగించిన వ్యధను "సుబహ- ఏ- ఆజాది ( స్వాతంత్ర్యోదయం) కవితలో ఇలా రాస్తారు..
ఏ దాగ్ దాగ్ ఉజాలా ఏ శబ్ గజీదా సహర్
వో ఇంతజార్ థా జిస్‌కా, ఏ వో సహర్‌తో నహీ.
.... ఈ మచ్చలు బడిన వెల్తురూ, ఈ మసిబారిన ఉషోదయం..
మేం దేనికైతే వేచి ఉన్నామో ఇది ఆ ఉషొదయం కాదే...
మనుష్యులకు సంకెళ్ళు వేయగలరు కానీ.. మనసుకి కాదంటూ.. రావల్పిండి కుట్ర కేసులో నిర్భందించ బడినపుడు ఇలా రాస్తారు..
"మతా- ఏ-లౌహ్ ఓ కలం ఛిన్ గయీ తో క్యా గం హై
కే ఖూన్- ఏ-దిల్ మే డుబాలీ హై ఉంగలియా మైనే.."
... కాగితం, కలం లాగేసుకుంటే ఏమయింది
నా వేళ్ళను గుండె రక్తంలో ముంచేసుకున్నా..
నోటికి తాళం వేస్తేనేమి...
వేసిన ప్రతీ సంకెళ్ళను మట్లాడే నాలుకగా మారుస్తా నేను!!
ఇంకా ఇలా అంటాడు..
"నీ పెదాలు ఇంకా స్వతంత్రమే,
కనుక మాట్లాడు
నాలుక ఇంకా నీదే కనుక మాట్లాడు
నీ దేహం కృశించినా...
ప్రాణం ఇంకా నీదే కనుక మాట్లాడు..."
ఫైజ్ కవితల నిండా ఇలాంటి ఉత్తేజమే!!
ఒక సదాశయం కోసం పని చేయాలనుకునే ప్రతీ ఒక్కరినీ... చేయి పట్టి దారి చూపించే మహత్తర భావజాలం ఉన్న కవితలు ఫైజ్ కవితలు..


No comments