మంకెన పూలు - 6

సూపర్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ !!
‘నా ఆధ్వర్యంలోనే సమస్త చరాచర సృష్టి జనిస్తుంది. కల్పాంతంలో నాలోనే విలీనమై మళ్ళీ కల్పాదిలో సృష్టించ బడుతుంది. ఈ జగత్తుకు నేనే తల్లిని, తండ్రిని, పూర్వుడను, కర్మఫల ప్రదాతను, ప్రణవ నాదాన్ని. వేదాలు, వేద విద్య, వేదాల ద్వారా తెలియదగినవాడను నేనే. ” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా వ్యాస మహర్షి రాసిన వాక్యాలివి. ఆచరణలో చక్కగా పాటించేది ఎవరంటే…

ఇంకెవరు…
మనమే…
మహిళలమే…!

పొద్దున్న లేవగానే వంటగదిలో మొదలుపెట్టిన అష్టావధానం, పిల్లలని స్కూల్‌కు రెడీ చేసి, భర్తకి లంచ్‌ బాక్స్‌ సిద్ధం చేసి, అత్తామామలకు అన్నీ అమర్చిపెట్టి, సమయం దాటకుండా ఆఫీసుకి వెళ్ళి, అక్కడ మాట రాకుండా తనకు మించిన పని నెత్తిన పెట్టుకుని, ప్రతి ఒక్కరినీ సమాధానపరుస్తూ, సాయంత్రానికి మళ్ళీ భోజనాది కార్యక్రమాలలో తలమునకలూ, సోషల్‌ మీడియాలో స్నేహితులు నొచ్చుకోకుండా పలకరిస్తూ అలసటగా పడక గదిని చేరినప్పుడు ముగుస్తుంది. వీటన్నింటిలోనూ తన ముద్రే ఉండాలనుకోవడం, ప్రతి పనిలో తృప్తిని వెదుక్కోవడం, అన్నిటా నేనే… అన్నీ నేనే అనుకోవడం… ఏమంటారు దీన్ని?
”సూపర్‌ ఉమన్‌ సిండ్రోమ్‌”

… … …
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ
అంటూ చెప్పబడిన ఉత్తమ భార్య లక్షణాలని ఎక్కడ తప్పుతామోనని, మనమున్న ప్రతిచోటా మన ముద్రఉండాలనే తపన ఉన్న ప్రతి స్త్రీలో ఉన్నది ”సూపర్‌ ఉమన్‌ సిండ్రోమ్‌”. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనమీదే ఆధారపడి ఉండడం మనకి గర్వకారణంగా మారిందంటే మనమీ సిండ్రోమ్‌లో పూర్తిగా కూరుకుని పోయి ఉన్నామన్నమాటే.

నిజంగా తరచి చూస్తే అలా ఆధారపడి ఉన్నట్లు కనిపించడం అనేది తమ బాధ్యతల్ని అతి లాఘవంగా మనమీదకి మళ్ళించడం. అయితే ఆ ఆలోచన మనలో కలగకుండా చేయడంలోనే వారి ప్రజ్ఞ, మన అమాయకత్వం, బయటపడుతూ
ఉంటుంది. అందరి తలలో నాలుకలా ఉండాలనుకోవడంలో మనకొక తల ఉందని, దానికో నాలుక అవసరం ఉందని మనమే మర్చిపోతున్నాం.

కుటుంబంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ… ఎక్కడైనా సరే మన ముద్ర బలంగా ఉండాలని అనుకుంటున్నామంటే, మనం మనచుట్టూ ఉన్న కొన్ని జీవితాల బరువుని జీవితాంతం మోయడానికి సిద్ధపడినట్లే. ఇది అసలు తెలియని బరువు. మనల్ని మనం అలక్ష్యం చేసుకుంటూ, పక్కవారి పెదాలమీద నవ్వుగా ఉండాలని అనుకోవడంలో మన అస్తిత్వాన్ని మనకి తెలియకుండా కోల్పోవడమంటే, మనకి మనం సమాధి కట్టుకోవడమే.

మనమే ఇరుసుగా మారి లోకాన్ని చట్రంగా చేసుకుని జీవితాన్ని పరుగులు పెట్టిస్తూ మనం సాధించేది ఏమిటి? మనం పెట్టే పరుగులలో ఎప్పుడైనా మనం మన శరీరం చెప్పే మాటలు వింటున్నామా? శరీరమంటే కాసిన్ని ఉడుకు నీళ్ళు పోసుకుంటే సేద తీరిపోయేదా? దానికో భాష ఉంది. ఆభాషని చదవాల్సింది మనం మాత్రమేనని ఎప్పుడైనా అనుకుంటున్నామా?

నిజంగా మన శరీరం మొరాయించినప్పుడు కూడా దాన్ని సమాధానపరచి మనల్ని మనకు అతీతం చేసుకుని మన చుట్టూ ఉన్నవారి కోసం తాపత్రయపడడం అన్నది మనలోని స్త్రీత్వానికీ… సూపర్‌ ఉమన్‌ సిండ్రోమ్‌కీ పరాకాష్ట. మన పాత్రలనీ, బాధ్యతలనీ పరిపూర్ణంగా నెరవేర్చడం జీవితకాలపు ఆనందానికీ, సమతుల్యతకు దారితీస్తుందనే ఆలోచన వాస్తవికమైనది కాదు.

మనకి మనం లేనితనంలో ఏ పరిపూర్ణత గురించి మనం ఆలోచిస్తున్నట్లు?

మనం పరిపూర్ణ స్త్రీలుగా గుర్తింపు పొందాలనుకోవడంలో మనం పొందుతున్నవి ఏమిటి?

భరించలేని ఒత్తిడి… తీవ్రమైన అలసట…నిస్సత్తువ… దీర్ఘకాలపు నిద్రలేమి. మనవారి రేపటి సంతోషం కోసం ఏమి చెయ్యాలన్న మన ఆలోచనలో, మన నేడు కనుమరుగు అయిపోవడమన్నది మన దృష్టికి రాకపోవడం మనకి మనం రాసుకున్న మరణ శాసనం. మన శరీరమూ, మనసూ ఎంత ఒత్తిడి భరించగలవో అంతకుమించి మనల్ని మనం సిద్ధపరచుకోవడం చెప్పుకోవడానికి గర్వకారణంగా ఉంటుందేమో కానీ… వినడానికి సిద్ధంగా ఉండేదెవ్వరు?

మన చుట్టూ ఉన్న వారిలో ఎవరు చేయగలిగిన పనిని వారికి అప్పగించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయించగలగటం మన విజయం కాదా? ప్రయత్నించి చూద్దాం తప్పేముంది. మనచుట్టూ ఉండేది మనవారే కదా. బాధ్యతలకు అలవాటు పడి ఉండరు కాబట్టి మొదట్లో సహాయ నిరాకరణ చేసినా, సుతిమెత్తని హెచ్చరింపులతో దారిలోకి రాకపోవడానికి వారేమీ మన శత్రువులు కాదుగా!

అన్నీ నేను చేసుకోవడంలోనే నాకు తృప్తి అన్న భావనలోనుండి ఒక్కసారి మనం బయటికి వస్తేనే కదా… లోకం తన పనిని తాను సరిగ్గా చేయగలుగుతోందో లేదో తెలిసేది. మనవల్ల ‘అవదు’ అని చెప్పడం అంటే తప్పేమీ కాదు. తనకు తాను చేసుకోగలిగిన దానికోసం మనల్ని ఎవరైనా సహాయం అడిగినప్పుడు ‘కుదరదు’ అని చెప్పడం వల్ల మనకి పోయేదేమీ ఉండదు… పైగా మనకిష్టమైన అభిరుచి కోసం కాస్తంత ఖర్చు పెట్టుకునేలా మనకే సమయం మిగులుతుంది …!


Learn How To Say No, When You Don't Want To Say Yes !!!




1 comment