ఆనందం
మనసు తెరలపై
నువ్వు రాస్తున్న మెరుపులన్నీ
నా కలల వెలుగులుగా ప్రతిఫలిస్తున్నప్పుడు 
కనురెప్పల తీగల్ని
మీటే వాయిద్యంలా
నీ స్వరం
మంద్ర స్థాయిలో ఓ మైమరపునద్దుతోంది
పదాలకి దొరకని
నిశ్శబ్దపు కుంచె గీసే
మౌన చిత్రపు భావవేదాలన్నీ
ఆ నందివర్ధనాల నయగారాలై
మది నవ్వుల్లో వికసిస్తున్నప్పుడల్లా
పెదవులపై నువ్వే తళుక్కుమంటున్నావ్
కొన్ని గోరింటాకు సాయంత్రాల వేళల్లో
అమ్మలా గోరుముద్దవుతావు చూడూ
అప్పుడు అనిపిస్తుంది
వెన్నెల నీడలు కమ్ముకుపోతున్న
పన్నీటి కోనేటిగా నిను తడుముతూ
మన జీవితాన్నొక జోలపాటలా అనురాగించుకోవాలని
నువ్వూ నేను కలిసి పంచుకునే ఆ క్షణం
అదొక్క క్షణమైనా చాలు
ఒక ఉద్వేగం…
హత్తుకుపోతుంది
రావి ఆకు మీది తొలకరి
చినుకులా....
బిందువు బిందువుగా…
ఆనందపు సింధువుగా !

No comments