సముద్రంసముద్రం!!!!
ఎంత విశాలత్వం!
చేతులు రెండూ ఎంత చాపినా ఇంకా ఇంకా మిగిలుండే వైశాల్యం... మనమెంత ఆహ్వానించి, అస్వాదించినా ఇంకా ఇంకా మనతో దోబూచులాడుతుండే విశాలత్వం...
సముద్రం దగ్గరకి ఎప్పుడు వెళ్ళినా ఇంతే. మామూలప్పుడు ఇన్ని మాటలు ప్రవాహంలా వస్తాయా.. తన దగ్గరకి వెళ్ళినప్పుడు ప్రవాహం సంగతి అటుంచి, పదాలే దొరకవు.
ఒకలాంటి నిశ్శబ్దం...
ఒక్కో అల ఒక్కో లయగా..
ఈ అలలకి లయలు ఏ నాట్య కారుడు నేర్పి ఉంటాడో...
ఆ లయల్లో కొట్టుకుపోతూ...
ఎక్కడో సుదూర తీరాల్లో ఇరుక్కు పోవడం..
సముద్ర ఘోష చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే,
మెలమెల్లగా లోలోపలి సెగల సముద్రాలు
అలలు అలలుగా ఎగిసెగిసి పడడం...
ఆ నిశ్శబ్దంలో ఎదుగుతున్నామో
ఒదుగుతున్నామో తెలియని ఒకానొక సందిగ్దత!!
ఇరుకిరుకు మనసుల్లోంచి..
గాలి ఆడని బంధాల్లోంచి,
ఒక్కసారి సముద్రం వేపు చూస్తే
వాహ్!!! ఎంత హాయి...
ఎవరికి వారే పంజరాలు నిర్మించుకుని...
వాటిల్లోంచే ఎదుటి వారి జీవితాలపై తీర్పులు ఇస్తూ..
ఏం సాధిస్తున్నాం..
ఏం కోల్పోతున్నాం
అనంతానంత ఆకాశం కింద
ఇంత దగ్గరితనం..
సముద్రం కాక ఎవరిస్తారు..
ఎవరికైనా..

No comments