హఠాత్తుగానే….అప్పుడు!

మౌనాన్ని అదుముకున్నంత సేపూ
పొడి మాటల గరళమొకటి  గొంతులోనే
తచ్చాడుతుందని తెలిసీ
చెప్తూనే ఉంటుందామె
మాటల ప్రవాహం సాగినంతమేరా..
ఒక సంభాషణ ముగించి
మరో సంఘటన సృష్టించబడే వ్యవధిలో
ఆమె పడే యాతన
ఒక సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వినిపిస్తుంది
మాట లోతుల్ని బండబారుస్తూ

కన్నీరు అడ్డొచ్చి
వెక్కిళ్ళు మింగేసిన క్షణంలో
ఏ ఇంద్రజాలాలూ మాయం చెయ్యలేని
గుండెలోతుల్లో గడ్డకట్టిన
తన మౌనాన్ని వింటుందామె

తనలో తను పడుతున్న సంఘర్షణ
వ్యక్తపరచలేని
మాటలలేమి
అప్పుడు వినిపిస్తుంది
కళ్ళ మీద వేళ్ళాడుతున్న తడి చినుకుల సాక్షిగా

అక్షరాలలో ఒదగలేని భావం
పదాల కోసం వెతుక్కునే
నిస్సహాయత
కళ్ళతో పలికిస్తుందామె
నెత్తుటి స్వేదమొకటి కనుపాపపై కమ్ముకుంటుంటే

కానీ…
మాట్లాడుతూ
మాట్లాడుతూ
హఠాత్తుగా ఆగిపోతుందే…
అప్పుడు
ఆమె నిట్టూర్పులు..
మన చెవుల్లో విస్ఫోటకాలవుతాయి
ఒక ప్రళయాన్ని పుట్టుకని వినిపిస్తూ

No comments