నిశ్శబ్ద గాయం


నేనొక నిశ్శబ్ద యుద్ధరంగాన్ని
పెనుగాయాలతో విరిగిపడ్డ కలల క్షేత్రాన్ని
మౌన మహార్ణావంలో కన్నీటి అలలుగా
 
కొట్టుకులాడుతున్న పంజరపు స్వేచ్ఛని
యుగాల సరిహద్దు రేఖల ఆంక్షల్లో
పుడమి గర్భంలోనో, గండుశిలలానో తలదాచుకున్న శీలపరీక్షని
కావ్యాల సౌందర్యానికి అలంకారాన్ని
 
ఇంతవరకెక్కడా నాకు నేనుగా రాయబడని అక్షరాన్ని
కాలపు వేదనా వలయాల తొలి సాక్ష్యాన్ని 
చీకటి గొంతుకలో కొట్టుకులాడుతున్న ఆర్త గీతాన్ని
 
అంతరంగపు ఒంటి స్థంభంలో
 
చీకటి శబ్దాన్ని అవలోకిస్తున్న తడి చారికని
సహన శాస్త్రాలు అంటగట్టబడ్డ ఆర్ద్ర స్వరాన్ని 
మనసాంతక క్షణాల శరాలని తాళలేక
 
యుగాంతపు పిలుపుకోసం ప్రళయవేదాన్ని
 
ప్రణవంగా జపిస్తున్న అంతేవాసిని

సీత అహల్య ఊర్మిళ... మండోదరి 
ద్రౌపది
రుక్మిణి కుంతి గాంధారి 
కవిత
మహిత రాధిక రేణుక 
పేరేదైతేనేం !
 
ధరిత్రి నిండా నా సరిహద్దు ఆడపిల్ల గానే
 
కాలం అంచుల వరకూ కొనసాగే యుద్ధ గాయాన్నే


No comments